Share News

రియల్‌ వ్యాపారుల నయా దందా

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:13 AM

స్థిరాస్తి వ్యాపారుల్లో పలువురు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి అనుమతీ లేకుండా లేఅవుట్లు వేస్తున్నారు. జిల్లాలోనే అత్యధిక అనుమతులు లేని లేఅవుట్లు ఉన్నది చీరాల నియోజకవర్గంలోనే. కొందరు కనీసం ల్యాండ్‌ కన్వర్షన్‌ రుసుము కూడా చెల్లించడం లేదు. దీంతో కొనుగోలుదారులు నష్టపోతున్నారు. తరువాత విక్రయించేవారిని అడిగినా ప్రయోజనం ఉండడం లేదని వాపోతున్నారు.

రియల్‌ వ్యాపారుల నయా దందా
216 జాతీయ రహదారిప పక్కన అక్కాయిపాలెం పరిధిలో అనధికారిక లేఅవుట్‌ పనులు (ఫైల్‌)

సిండికేట్‌గా మారి నిబంఽధనలకు పాతర

అనుమతులు లేని లేఅవుట్లతో నష్టపోతున్న కొనుగోలుదారులు

అక్రమ లేఅవుట్ల లెక్క తీస్తున్నామంటున్న రెవెన్యూ అధికారులు

పూర్తయ్యేదెప్పటికో అంటున్న ప్రజలు

ఆ లేఅవుట్ల వివరాలు, సర్వే నెంబరు వెల్లడించాలని

బాధితుల విన్నపం

చీరాల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : స్థిరాస్తి వ్యాపారుల్లో పలువురు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి అనుమతీ లేకుండా లేఅవుట్లు వేస్తున్నారు. జిల్లాలోనే అత్యధిక అనుమతులు లేని లేఅవుట్లు ఉన్నది చీరాల నియోజకవర్గంలోనే. కొందరు కనీసం ల్యాండ్‌ కన్వర్షన్‌ రుసుము కూడా చెల్లించడం లేదు. దీంతో కొనుగోలుదారులు నష్టపోతున్నారు. తరువాత విక్రయించేవారిని అడిగినా ప్రయోజనం ఉండడం లేదని వాపోతున్నారు. ఒక వైపు అనధికారిక లేఅవుట్లులో స్థలాలు కొన్నవారికి గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వమని, మౌలిక వసతులు కల్పన జరగదని ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకు సంబంధించి అనధికారిక లేఅవుట్లు జాబితాను తయారు చేసి, బహిరంగ పరిచారు. ఆ తరువాత కూడా అనధికారిక లేఅవుట్లు వెలుస్తూనే ఉన్నాయి. వీటిపై మరలా పూర్తి స్థాయిలో వివరాలను సేకరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.

సిండికేట్‌గా మారుతున్న రియల్టర్లు

రియల్‌ వ్యాపారుల్లో కొందరు సిండికేట్‌గా మారి తమ దందా సాగిస్తున్నారు. ఆయా సిండికేట్‌లలో పాలక, ప్రతిపక్షాలకు చెందిన వారు ఉండేలా చూచుకుంటున్నారు. సిండికేట్‌ భాగస్వాముల్లో ఏ ప్రాంతంలో ఎవరికి ఎక్కువ పట్టుంటే అక్కడ వేసే అనధికారిక లేఅవుట్‌ ఆ వ్యక్తిదని ప్రచారం చేస్తున్నారు. అధికారుల దగ్గర పాలకపక్షానికి చెందిన వ్యక్తులు ముందుంటున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు.

రూపాయిలు మదుపు చేసుకుని కొనుగోలు చేస్తే

సొంతింటి కలను సాకారం చేసుకుందామని ప్రత ఒక్కరికీ ఉంటుంది. కొందరు స్థిరాస్తిగా స్థలాలు, పొలాలపై ముదపు చేస్తుంటారు. ఈ క్రమంలో రూపాయి రూపాయి కూడబెట్టుకుని స్థలాలు కొనుక్కుంటున్న వారిలో పలువురికి తరువాత గృహ నిర్మాణ సమయంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అనధికారిక లేఅవుట్లకు మౌలిక వసతులు లేకపోవడం, కనీసం ఇంటి నిర్మాణానికి ప్లాన్‌ అప్రూవల్‌ కూడా ఇవ్వమని అధికారులు చెప్పడం అందుకు కారణం. దీంతో అక్రమ లేఅవుట్లు వివరాలను సర్వే నెంబరు, పేర్లతో సహా ప్రభుత్వ అధికారులు వెల్లడించి తాము నష్టపోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

మీ ఫార్మాల్టీ మీకిస్తారు

మీ ఫార్మాల్టీ మీకిస్తారు. వార్తలు రాయొద్దని మీడియాకు, వారి జోలికి వెళ్లకుంటే మీ మంచిచెడులు చూస్తారని అధికారులకు పలువురు రియల్టర్ల తరపున వకాల్తా పుచ్చుకుని రాయబేరాలు నడిపేవారు తెరపైకి వస్తున్నారు. ఇందులో మా స్వార్థం ఏమీ లేదు. అందరూ బాగుండాలనేది మా అభిమతం అని చెప్పిడం విశేషం. అయితే అంతిమంగా అనధికారిక లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారు నష్టపోతారు కదా అని అడిగితే సమాధానమే లేదు.

ప్రహరీ రక్షణకు అని చెప్తున్నారు.. వివరాలు నమోదు చేస్తున్నాం

అనధికారిక లేఅవుట్లకు సంబంధించి వివరాలు నమోదు చేస్తున్నాం. కొందరు పక్కాగా లేఅవుట్‌ కోసం పనులు చేస్తూ, చుట్టూ గోడ కట్టి కూడా అది రక్షణకు ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు. వాటి మధ్యలో రాళ్లు వేయకుంటే అది లేఅవుట్‌ లెక్కలోకి రాదు. వారు కోర్టుకు వెళితే లేఅవుట్‌ అని నిరూపించలేం. నిలబడదు. అలాంటి వాటి వివరాలను నమోదు చేస్తున్నాం. అంతిమంగా కొనుగోలుదారులు పక్కాగా అనుమతులు ఉంటేనే లేఅవుట్లులో స్థలాలు కొనుగోలు చేయాలి.

- గోపీకృష్ణ, తహసీల్దార్‌, చీరాల మండలం

వివరాలు నమోదు చేస్తున్నాం

కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలి

ఒంగోలు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఒడా) చైర్మన్‌, ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు అనధికారిక లేఅవుట్లు జాబితా తయారు చేస్తున్నాం. గతంలో సేకరించిన వాటి వివరాలు ఇప్పటికే వెల్లడించాం. ఆ తరువాత, అంతక ముందు ఉన్న లేఅవుట్లలో కూడా అనుమతిలేని వాటి వివరాలపై నివేదిక తయారు చేస్తున్నాం. పూర్తి వివరాలతో నివేదికను ఒడా చైర్మన్‌, ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు అందజేసేందుకు క్షేత్రసాథయి పరిశీలన జరుగుతోంది.

- పార్వతి, తహసీల్దార్‌, వేటపాలెం మండలం

Updated Date - Nov 21 , 2024 | 12:13 AM