Share News

దరఖాస్తు చేసినా దక్కని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు

ABN , Publish Date - May 08 , 2024 | 11:48 PM

ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నా ఓటు హక్కు దక్కని పరిస్థితి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి సొంత నియోజకవర్గానికి ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఓటు కోసం గంటల తరబడి కార్యాలయం వద్ద నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో వెనుదిరిగి పోవల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దరఖాస్తు చేసినా దక్కని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు

జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన ఉద్యోగులు

మీరు పనిచేస్తున్న చోటుకు బ్యాలెట్‌ ఫాంలు పంపామని చెప్పిన సిబ్బంది

ఉసూరుమంటూ వెనుదిరిగి వైనం

పర్చూరు, మే 8 : ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నా ఓటు హక్కు దక్కని పరిస్థితి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి సొంత నియోజకవర్గానికి ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఓటు కోసం గంటల తరబడి కార్యాలయం వద్ద నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో వెనుదిరిగి పోవల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పర్చూరు రెవెన్యూ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల పోలింగ్‌ కేంద్రంలో చోటుచేసుకుంది. మొన్నటివరకు ఇక్కడ పనిచేస్తూ ఎన్నికల విధుల కోసం ఇతర జిల్లాలకు వెళ్లిన వారు తపాలా ఓటు కోసం ఫాం-12 ద్వారా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. కొంత మంది రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా వీరికి ఓటు దక్కలేదు. బుధవారం పోస్టల్‌ ఓటు కోసం వచ్చిన పలువురు ఉద్యోగులకు ఓటు లభించకపోవడంతో గంటల తరబడి కార్యాలయం వద్ద నిరీక్షించి వెనుదిరిగారు. అందులో భాగంగా ఏలూరు జిల్లా, జంగారెడ్డి గూడేనికి చెందిన ఎన్నికల విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి బ్యాలెట్‌ ఓటు కోసం సొంత నియోజకవర్గం పర్చూరు రావడంతో మీరు పనిచేస్తున్న నియోజకవర్గానికి బ్యాలెట్‌ ఓటు పంపాం మీకు ఇక్కడ ఓటు కల్పించలేమని చెప్పడం ఇందుకు నిదర్శనం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ అధికారులు ఆహ్వాన పత్రికలు పంపుతూ ప్రచారం చేస్తున్నా, అర్హత ఉన్న ఉద్యోగులకు సక్రమంగా ఓటు హక్కు కల్పించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ఎన్నికల విధుల్లో ఉండి ఫారం 12 దరకాస్తు చేసుకున్న ఉద్యోగులకు పూర్తి స్థాయిలో ఓటు హక్కు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - May 08 , 2024 | 11:48 PM