Share News

సీఐ లక్ష్మణ్‌పై వేటు

ABN , Publish Date - May 09 , 2024 | 01:45 AM

ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ లక్ష్మణ్‌పై వేటు పడింది. ఆయన్ను ఎన్నికల విధుల నుంచి ఉన్నతాధికారులు తప్పించారు. ఆ బాధ్యతలను అలీఖాన్‌కు అప్పగించారు. ఈమేరకు ఆదేశాలు ఇచ్చారు. అవి గురువారం అందే అవకాశం ఉంది.

సీఐ లక్ష్మణ్‌పై వేటు

పాత కేసుల విచారణకే ఆయన పరిమితం

ఒంగోలు వన్‌టౌన్‌కు అలీఖాన్‌.. ఎన్నికల విధులు అప్పగింత

ఒంగోలు (క్రైం), మే 8 : ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ లక్ష్మణ్‌పై వేటు పడింది. ఆయన్ను ఎన్నికల విధుల నుంచి ఉన్నతాధికారులు తప్పించారు. ఆ బాధ్యతలను అలీఖాన్‌కు అప్పగించారు. ఈమేరకు ఆదేశాలు ఇచ్చారు. అవి గురువారం అందే అవకాశం ఉంది. మాజీ మంత్రి బాలినేనికి వీరవిధేయు డుగా ఉన్న లక్ష్మణ్‌పై టీడీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశారు. అదేసమయంలో ఇటీవల ఒంగోలులో వైసీపీ మూకలు రిమ్స్‌లో వీరంగం సృష్టించి అక్కడ ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేశాయి. ప్రస్తుత టీడీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌రావు కార్లను ధ్వంసం చేయడమేకాకుండా టీడీపీ కార్యకర్తలపై దాడిచేశాయి. దీనిపై ఓ కార్యకర్త ఫిర్యాదు చేసినా లక్ష్మణ్‌ కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు రిమ్స్‌లో జరిగిన ఘటనపై నమోదైన కేసులో వైసీపీకి చెందిన వారిని అరెస్టు చేస్తారా.. అని మాజీ మంత్రి బాలినేని ఒంగోలు వన్‌టౌన్‌లో రెండు గంటలపాటు తిష్ఠవేసి బెదిరించడంతో కేసు తీవ్రత తగ్గించారన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ అంతా వైసీపీ అడ్డాగా మార్చివేశారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇలా ఎన్నికల వేళ వైసీపీతో అంటకాగుతున్న సీఐపై ఎట్టకేలకు వేటు పడింది. లక్ష్మణ్‌ ఇకపై కేవలం పాత కేసుల విచారణకు మాత్రమే పరిమితం కానున్నారు. ఎన్నికల విధుల్లో ఆయనకు ఎలాంటి ప్రమేయం ఉండదు.

Updated Date - May 09 , 2024 | 01:45 AM