Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు మరో చాన్స్‌!

ABN , Publish Date - May 09 , 2024 | 01:46 AM

జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు ఎన్నికల కమిషన్‌ మరో చాన్స్‌ ఇచ్చింది. ఒక రోజు పొడిగింది. తొలుత ప్రకటించిన ప్రకారం బుధవారంతో ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంది. తాజాగా గురువారం కూడా ఓటింగ్‌కు అవకాశం కల్పించింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు మరో చాన్స్‌!
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు వచ్చిన ఉద్యోగి గుర్తింపు కార్డును పరిశీలిస్తున్న సిబ్బంది

ఒకరోజు పొడిగింపు

నేటితో ముగియనున్న ప్రక్రియ

ఒంగోలు (కలెక్టరేట్‌), మే 8 : జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు ఎన్నికల కమిషన్‌ మరో చాన్స్‌ ఇచ్చింది. ఒక రోజు పొడిగింది. తొలుత ప్రకటించిన ప్రకారం బుధవారంతో ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంది. తాజాగా గురువారం కూడా ఓటింగ్‌కు అవకాశం కల్పించింది. జిల్లాలో 19,050 మంది అధికారులు, ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.బుధవారం సాయంత్రానికి 17,003 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో 2,047 మంది మిగిలి ఉన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో 3,767 మంది దరఖాస్తు చేసుకోగా 3,644 ఓట్లు పోలయ్యాయి. మరో 123 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాల్సి ఉంది. ఈనేపథ్యంలో గడువు పొడిగించాలని ఎన్నికల సంఘానికి వినతులు అందినట్లు సమాచారం. దీంతో అదనంగా ఒకరోజు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో తొలుత ఎనిమిది ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా బ్యాలెట్‌ ఓటింగ్‌ వేసే వారి సంఖ్య తగ్గడంతో బుధవారం రెండింటిని మాత్రమే కొనసాగించారు. గురువారం ఒక కేంద్రంలోనే ఓటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40శాతానికిపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు కలిపి 1,663 మంది, అత్యవసర సర్వీసుల్లో ఉండే 1,508 మంది కలిపి మొత్తం 3,171 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం సాయంత్రం వరకూ అందిన సమాచారం మేరకు వీరిలో 2,827 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఇంకా 346 మంది మిగిలి ఉన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:46 AM