Share News

ఎయిడెడ్‌లో బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:15 PM

ఎయిడెడ్‌ పాఠశాలల యాజమానులలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. పాఠశాలల్లో పిల్లలు చేరకపోయినా ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు తమ స్కూళ్లల్లో నమోదు చేసి వారికి హాజరు వేస్తూ మోసానికి పాల్పడుతున్నారు.

ఎయిడెడ్‌లో బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌

పాఠశాలల్లో ఏరివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు

ఒంగోలు(విద్య), జూలై 26 : ఎయిడెడ్‌ పాఠశాలల యాజమానులలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. పాఠశాలల్లో పిల్లలు చేరకపోయినా ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు తమ స్కూళ్లల్లో నమోదు చేసి వారికి హాజరు వేస్తూ మోసానికి పాల్పడుతున్నారు. వాస్తవంగా తమ స్కూళ్లల్లో లేని విద్యార్థుల పేర్లు, వివరాలు యూడై్‌సలో ఎక్కించి కొత్తగా పోస్టులు మంజూరు చేయించుకునేందుకు చూస్తున్నారు. ఇటీవల కొన్ని ఎయిడెడ్‌ యాజమాన్యాలు కొత్త పోస్టుల కోసం కోర్టులను ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు పొందారు. తమ పాఠశాలల్లో పిల్లలు ఉన్నా పోస్టులు భర్తీచేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టును ఆశ్రయించి పోరాడి పోస్టులు తెచ్చుకున్నారు. ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులు మంజూరు చేయనున్నారు. తీరా కొందరు అధికారులు ఆ పాఠశాలల సందర్శనకు వెళ్లినప్పుడు పాఠశాలల్లో బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాలలపై దృష్టి పెట్టింది. వాటిల్లో బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఏరివేతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాల విద్యా కమిషనర్‌ విజయరామరాజు బుధవారం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్‌జేడీలు, డీఈవోలు ఎయిడెడ్‌ పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. యూడైస్‌ నుంచి బోగస్‌ పేర్లు తొలగించాలన్నారు. వెంటనే చర్యలు చేపట్టాలని కమిషనర్‌ కోరారు.

Updated Date - Jul 26 , 2024 | 11:15 PM