Share News

వైద్యశాఖ ఉద్యోగుల్లో అలజడి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:16 PM

జిల్లా వైద్యారోగ్యశాఖలో ఎప్పుడో భర్తీచేసిన పోస్టులపై ఇప్పుడు విచారణలు జరుగుతుండటంతో ఆ శాఖ ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. 2004 నుంచి ఇప్పటివరకు జరిగిన నియామకాలపై రాష్ట్రస్థాయి అఽధికారులు విచారణలు చేస్తుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.

వైద్యశాఖ ఉద్యోగుల్లో అలజడి
విచారణకు హాజరైన అభ్యర్థులు

ఎప్పుడో భర్తీచేసిన ఉద్యోగాలకు ఇప్పుడు విచారణలు

ఆ సమయంలో ఏ ప్రాతిపదికన తీసుకున్నారో తెలియని పరిస్థితి

ఉద్యోగుల వద్ద ధ్రువీకరణ పత్రాల పరిశీలనతో సరిపెట్టిన విచారణ

శాఖలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని సిబ్బంది వణుకు

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 26: జిల్లా వైద్యారోగ్యశాఖలో ఎప్పుడో భర్తీచేసిన పోస్టులపై ఇప్పుడు విచారణలు జరుగుతుండటంతో ఆ శాఖ ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. 2004 నుంచి ఇప్పటివరకు జరిగిన నియామకాలపై రాష్ట్రస్థాయి అఽధికారులు విచారణలు చేస్తుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. వైద్యశాఖలో 2002లో గుంటూరు రీజియన్‌ పరిధిలో భర్తీచేసిన హెల్త్‌ అసిస్టెంట్ల నియామకాల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆ నేపథ్యంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైద్య ఆరోగ్యశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ శోభారాణి విచారణ చేపట్టారు. ఇప్పటికే గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో విచారణ పూర్తికాగా గురువారం ఒంగోలులో విచారణ జరిగింది. 2002 నుంచి ఇప్పటివరకు 160 హెల్త్‌ అసిసెంట్లు పోస్టులు భర్తీచేయగా, వారిలో వందమంది ఉద్యోగులు రెగ్యులర్‌ అయ్యారు. మరో 60 మంది కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. ఇప్పుడు వారందరూ అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులతోపాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు చూపాల్సిన అవసరం వచ్చింది.

అంతా అయోమయం

సాధారణంగా ఉద్యోగ నియామకాల భర్తీలో అక్రమాలు జరిగాయంటే అప్పటి నోటిఫికేషన్‌తో పాటు రోస్టర్‌ విధానం, ఏ కేటగిరికి ఎన్ని ఇచ్చారు తదితర అంశాలతో విచారణ చేపడుతారు. అలా కాకుండా నేరుగా 2002 నుంచి ఇప్పటివరకు భర్తీచేసిన పోస్టులపై విచారణ పేరుతో ఉద్యోగులందరినీ వైద్యశాఖ కార్యాలయానికి పిలిపించడంతో వారిలో ఆందోళన నెలకొంది. వైద్యశాఖపై ఎప్పుడు ఎవరు ఫిర్యాదులు చేస్తారో, ఎప్పుడు ఎవరు విచారణ చేస్తారో తెలియదు, ఫిర్యాదులు వచ్చిన ప్రతిసారీ విచారణకు రావాలని ఆదేశాలిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు ఉన్నారు. గత నియామకాలపై అనేకమార్లు విచారణలు చేసి అక్రమాలు జరిగాయని నిర్ధారించినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజా విచారణ కూడా అలానే ఉంటుందా అన్న అనుమానాలున్నాయి. కేవలం ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసేందుకే విచారణ చేస్తున్నారా? అన్న ఆరోపణలున్నాయి.

Updated Date - Jul 26 , 2024 | 11:16 PM