Share News

ప్రభుత్వ వైద్యశాలలో సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:46 AM

ప్రస్తుతం మారిన వాతావరణ ప్రభావం వలన దోమల బెడదతో ప్రజలు వైరల్‌ ఫీవర్లతో ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్నందున వైద్య శాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకో వాలని మార్కాపురం సబ్‌కలెక్టర్‌ రాహుల్‌మీనా కంభం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివనాయక్‌కు సూచించారు.

ప్రభుత్వ వైద్యశాలలో సమస్యల పరిష్కారానికి కృషి

కంభం, జూలై 26 : ప్రస్తుతం మారిన వాతావరణ ప్రభావం వలన దోమల బెడదతో ప్రజలు వైరల్‌ ఫీవర్లతో ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్నందున వైద్య శాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకో వాలని మార్కాపురం సబ్‌కలెక్టర్‌ రాహుల్‌మీనా కంభం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివనాయక్‌కు సూచించారు. శుక్రవారం ఆయన కంభం ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్‌, ఇన్‌పేషంట్‌ రూములను, మందుల స్టోర్‌ రూమ్‌, కంటి పరీక్ష, ప్రసూతి, ఆర్థోపెడిక్‌, జియోథెరపి, పిల్లల వార్డు, కాన్పుల వార్డులను పరిశీలించారు. రోగులను అడిగి తెలుసుకున్నారు. మహిళ పేషెంట్ల వార్డులో మరుగుదొడ్ల అపరిశుభ్రంగా ఉండడంపై సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జనరేటర్‌ రూమ్‌ సమీపంలో నీళ్లు నిలిచి అపరిశుభ్రంగా ఉండడం చూసి వైద్యశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే రోగులు ఇబ్బందులు పడతారని, తక్షణమే పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. వైద్యశాల ఆవరణలో ఇరిగేషన్‌ పంట కాలువలో మురికినీరు వెళు తుండడం గమనించి ఈ మురికి కాలువ ఎక్కడిదని అడగ్గా, అది ఇరిగేషన్‌ పంట కాలువ అని తెలిపారు. వెంటనే కాలువ పై భాగాన్ని కప్పివేయాలన్నారు. జనరేటర్‌ పని చేయక పోవడంతో కరెంటు పోయిన సమయంలో చీకట్లోనే మగ్గాల్సి వస్తుందని, ఫ్యాన్లు తిరగక దోమలతో ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు సబ్‌కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఆపరేషన్‌ సమయంలో కరెంటుపోతే సెల్‌ఫోన్‌ లైట్‌తో ఆపరేషన్‌ చేయాల్సి వస్తుందని తెలపగా కొత్త జనరేటర్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రోగులకు అందచేసే భోజనాన్ని రుచి చూశారు. రోగులకు నాణ్యమైన మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. హాజరుపట్టీని పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటి తహసీల్దార్‌ శ్రీనివాస రావు, ఎంపీడీవో మస్తాన్‌వలి, తురిమెళ్ల సర్పంచ్‌ సుభద్ర, ఎస్సీ సెల్‌ నాయకులు గోన చెన్న కేశవులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:46 AM