Share News

వాగు పోరంబోకు హాంఫట్‌

ABN , Publish Date - May 09 , 2024 | 01:48 AM

కనిగిరిలో వైసీపీ నేతలు భూబకాసురులుగా మారా రు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. గత ఐదేళ్లుగా రూ.కోట్ల విలువైన భూములను కాజేశారు.

వాగు పోరంబోకు హాంఫట్‌
వాగు పోరంబోకు, శ్మశాన స్థలాన్ని చదును చేసి చేపట్టిన నిర్మాణాలు

కనిగిరిలో రూ.2 కోట్ల విలువైన భూమి కబ్జా

దర్జాగా నిర్మాణాలు చేస్తున్న వైసీపీ ముఖ్యనేత అనుచరుడు

చోద్యంచూస్తున్న మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు

కనిగిరి, మే 8 : కనిగిరిలో వైసీపీ నేతలు భూబకాసురులుగా మారా రు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. గత ఐదేళ్లుగా రూ.కోట్ల విలువైన భూములను కాజేశారు. ఇప్పుడు అధికారులు ఎన్నికల పనుల్లో నిమగ్నమవడంతో ఇదేఅదనుగా అధికార పార్టీకి చెందిన ముఖ్యనా యకుడి అనుచరుడు వాగుపోరంబోకులో పాగా చేశాడు. ఆ స్థలాన్ని చదును చేసి నిర్మాణాలు చేస్తున్నాడు. అయినప్పటికీ అధికారులు పట్టీనట్లు వ్యవహరిస్తుండటంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కనిగిరి పట్టణంలోని చెక్‌పోస్టు వద్ద ప్రధాన వాగును ఆనుకుని దాదాపు 2ఎకరా లకు పైన ప్రభుత్వ వాగు పోరంబోకు ఉంది. దాని పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని ఎన్నో ఏళ్లుగా పాతూరు ఎస్సీకాలనీ, మంగలిమాన్యం వాసులు శ్మశానవాటికగా ఉపయోగించుకుంటున్నారు. ఆస్థలంలో సమాధులు కూడా ఉన్నాయి. కనిగిరిలో స్థలాల ధరకు రెక్కలు రావడంతో వైసీపీ ముఖ్యనేత అనుచరుడి కన్ను వాగుపోరంబోకుపై పడింది. ఎన్నో ఏళ్లక్రితం ఆస్థలం రిజిస్టర్‌ అయిఉన్నట్లు రికార్డులు పుట్టించాడు. వాటిని అడ్డం పెట్టుకుని వాగు పోరంబోకు కొంత ఆక్రమించేశాడు. ఇప్పుడు మిగిలిన దానితోపాటు శ్మశాన స్థలాన్ని కబ్జా చేశాడు. అక్కడ చెట్లను తొలగించి చదును చేసి పక్కా నిర్మాణాలు ప్రారంభించాడు. పనులకు ఆటంకం లేకుండా ఉండేందుకు ఆక్రమిత భూమి నుంచి వెళ్లే కొండసాలు కాలువను కూడా మూసివేశాడు. ఈ భూమి విలువ దాదాపు రూ.రెండు కోట్లకుపైన ఉంటుంది. ఇంత జరుగుతున్నా మునిసిపల్‌, రెవెన్యూ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. ఆక్రమణదారుడి నుంచి భారీగా ముడుపులు ముట్టడమే అందుకు కారణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - May 09 , 2024 | 01:48 AM