Share News

వీరభక్తులు తెగబడ్డారు..

ABN , Publish Date - May 09 , 2024 | 01:52 AM

అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు, పోలీసులు నిబంధనలను పక్కనపెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒకపక్క ఈసీ చర్యలు తీసుకుంటున్నా లెక్కచేయకుండా వైసీపీ సేవలో మునిగితేలుతున్నారు.

వీరభక్తులు తెగబడ్డారు..

అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు!

అధికారులు, పోలీసుల తీరుపై విమర్శలు

రంగంలోకి మాజీలు

పాత పరిచయాలతో హడావుడి

స్టేషన్లలో తిష్టవేసి మేనేజ్‌మెంట్‌

విచ్చలవిడిగా నగదు పంపిణీ

సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రధాన పాత్ర

అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు, పోలీసులు నిబంధనలను పక్కనపెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒకపక్క ఈసీ చర్యలు తీసుకుంటున్నా లెక్కచేయకుండా వైసీపీ సేవలో మునిగితేలుతున్నారు. ఆపార్టీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి మరీ అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పోలీసులు కేసుల నమోదులో వివక్ష చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కేసులలో వైసీపీ వారిపట్ల ఉదాసీనంగా వ్యవహరించడం షరామామూలైంది. అధికార పార్టీ వారు దొరికితే వదిలిపెడుతూ, ప్రతిపక్షాల వారు పట్టుబడితే కేసులు నమోదు చేస్తూ పక్షపాతం చూపుతున్నారు. టీడీపీ నేతలను నేరుగా బెదిరించిన ఎస్‌ఐలూ ఉన్నారు. పైస్థాయిలో మార్పు జరిగినా కిందిస్థాయి వారు మాత్రం వైసీపీ అడుగుజాడల్లోనే వెళ్తుండటంతో వారికి ఎంత మొత్తంలో సెటిల్‌ అయ్యిందోనన్న చర్చ నడుస్తోంది.

ఒంగోలు(క్రైం), మే 8: వైసీపీ వీరభక్త అధికారులు, పోలీసుల వ్యవహార శైలి చూస్తుంటే శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల నిబంధనలు అత్యంత కఠినతరం చేసినా, పోలీసు అధికారులను మార్చినా ఓటరు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉందా.. అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రంలో అనేక మంది పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్‌ వేటు వేస్తోంది. తొలుత గుంటూరు రేంజ్‌ ఐజీ పాల్‌రాజ్‌తోపాటు ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డిని బదిలీ చేశారు. ఇటీవల డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేసి హరీష్‌కుమార్‌గుప్తాను నియమించిన విషయం విదితమే. అయినప్పటికీ కొందరు పోలీసు అధికారుల తీరు మారడం లేదు. జిల్లాలో పనిచేస్తున్న ఎస్‌ఐల నుంచి డీఎస్పీల వరకు పనిచేస్తున్న పోలీసు అధికారులు వైసీపీ నేతల కనుసన్నలలో పోస్టింగులు పొంది ఉన్నారు. దీంతో వైసీపీ నాయకులు పాల్పడే అరాచకం, అక్రమాలను అరికట్టకుండా స్వామిభక్తిని చూపుతున్నారు. అదేసమయంలో ఒకవైపు ఉన్నతాధికారులు, మరోవైపు వైసీపీ నేతల ఒత్తిళ్లకు గురవుతున్న నిజాయితీ గల అధికారులూ లేకపోలేదు. ఇలాంటి పరిస్థితిలో జిల్లాకు ఎనిమిది మంది శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లను ఎన్నికల కమిషన్‌ కేటాయించింది. వారు బుధవారం ఒంగోలు చేరుకున్నారు.

విశ్రాంత పోలీసు అధికారుల హల్‌చల్‌

ఒంగోలు లోక్‌సభ పరిధిలో రిటైర్డ్‌ అయిన పోలీసు లు, ఒకస్థాయి అధికారులు వైసీపీ తరఫున ముమ్మ రంగా పనిచేస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి వారిని నియమిం చుకున్నట్లు తెలిసింది. పార్లమెంట్‌ పరిధిలోని నియోజ కవర్గాల్లో వారు తిరుగుతూ ఆయా ప్రాంతంలో పోలింగ్‌ రోజు సహకరించేందుకు అనుగుణంగా ప్రస్తుతం డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులను మచ్చిక చేసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో కొందరు టీడీపీ నేతలు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. రాయలసీమ ప్రాంతం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న నాయకుడు పొదిలి కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆయన అన్ని నియోజకవర్గాలకు తన వ్యక్తిగత సిబ్బందిని దూతలుగా పంపారు. అయితే వీరిలో విశ్రాంత పోలీసులు, ఉద్యోగులు అధికంగా ఉన్నారు. అందునా జిల్లాలో ప్రత్యేకించి ఒంగోలు లోక్‌సభ పరిధిలో పనిచేసి రిటైర్‌ అయిన వారిని కూడా ప్రత్యే కించి వేతనం ఇచ్చి తీసుకున్నట్లు తెలిసింది. వారంతా ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలను గమనించడంతోపాటు వ్యతిరేకులను అనుకూలంగా తీసుకొచ్చేందుకు పోలీస్‌ తరహా సలహాలు ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయా నియోజకవర్గాల్లో కొందరు పోలీసు అధికారులు, సిబ్బందిని లోబర్చుకుని వారి ద్వారా ఈ వ్యవహారాల ను సాగిస్తున్నారు. ఒంగోలుకు బాగా సుపరితుడైన డీఎస్పీ కేడర్‌ పోలీసు అధికారి కొద్దిరోజులుగా నగరంలో మకాం వేశారు. ఆయన రిటైర్‌ అయిన తర్వాత కూడా మంగళగిరి పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌లో సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది. దీంతో ఒంగోలులో తిష్ఠవేసిన ఆయన ఒంగోలు, కొండపి, ఎస్‌ఎన్‌పాడు నియోజక వర్గాలపై దృష్టిసారించారు. ఆయా నియోజకవర్గాలలో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాట్లాడుతూ అవసరమైన పనులు చక్కబెడుతున్నారు. ఆయనకు పరిచయం లేని పోలీసు అధికారి లేకపోవడంతో తనదైన శైలిలో వ్యవ హారం నడిపిస్తున్నారు. పొదిలి కేంద్రంగా పనిచేస్తున్న ఎంపీ అభ్యర్థికి సహకరించాలని విశ్రాంత డీఎస్పీ అక్కడికి సమీపంలోని మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని ఒక ఎస్సై, దర్శి నియోజకవర్గంలోని ఒక ఎస్సై ద్వారా టీడీపీ శ్రేణులను బెదిరిస్తున్నట్లు సమా చారం. పోలింగ్‌ సందర్భంగా కొన్నిగ్రామాల్లో అలజ డులు సృష్టించి వైసీపీ అభ్యర్థికి పరిస్థితి అనుకూలంగా చేసేలా కుట్ర చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన ఒక సాధారణ వ్యక్తి ఎన్నికల కమిషన్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయా నియోజకవ ర్గాల్లోని కూటమి అభ్యర్థుల తరఫున కూడా ఫిర్యాదు లు వెళ్లాయి. కాగా సీఈసీ ఇప్పటికే డీజీపీని మార్చింది. డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయిల వరకు అధికారులను నేరు గా బదిలీ చేస్తోంది. ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ లక్ష్మణ్‌ పవర్‌ తగ్గించి వేరే సీఐని అక్కడ నియ మించడంలో ఆంతర్యం కూడా అదేనని సమాచారం. ఇంకోవైపు ఈ వ్యవహారంలో పాలుపంచుకుంటున్న రిటైర్డ్‌ పోలీసు అధికారులు, ఉద్యోగులను కట్టడి చేసే అంశంపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. ప్రభుత్వపరంగా వారికి అందే పెన్షన్‌, ఇతరత్రా సౌక ర్యాల విషయంలో ఎంత వరకు జోక్యం చేసుకోవచ్చన్న అంశంపై పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం.

నగదు పంపిణీలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు

వైసీపీ తరఫున నగదు పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు నేరుగా రంగంలోకి దిగారు. తమకు ఉద్యోగాలు ఇచ్చినందుకు సచివాలయ ఉద్యోగులు బాహాటంగా అధికారపార్టీతో అంటకాగుతూ నగదు పంపిణీలో భాగస్వామ్యం అవుతున్నారు. రెండు రోజులుగా ఒంగోలులో ఈ వ్యవహారం అంతా సచివాలయ సిబ్బంది ద్వారా జరుగుతోంది. వారే ఇంటింటికీ తిరిగి ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. అవే స్లిప్పుల ప్రకారం నగదు పంపిణీ బాహాటంగా చేశారు. ఉన్నతాధికారులు మారినా కిందిస్థాయి అధికారులలో మార్పు రాలేదు. వలంటీర్లు కొంతమంది రాజీనామా చేసి, మరికొంతమంది ఉద్యోగం చేస్తూనే వైసీపీ కార్యకర్తల మాదిరిగా నగదు పంపిణీలో పాలుపంచుకుంటున్నారు.

జిల్లాకు 8 మంది ట్రైనీ ఐపీఎస్‌లు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల విధుల నిర్వహణ కోసం ఎనిమిది మంది శిక్షణ ఐపీఎస్‌లను నియమించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అబ్జర్వర్‌ హసీబ్‌ ఉర్‌ రెహమాన్‌ ఎన్నికల సమయంలో నిర్వహించాల్సిన విఽధులను వారికి వివరించారు. జిల్లాకు వచ్చిన శిక్షణ ఐపీఎస్‌లతో అనన్య అవస్థి, మీరాపీఆర్‌, ఎస్‌.అరుణ్‌కుమార్‌, నిఖిల్‌ బసవరాజ్‌ పాటిల్‌, నివ్రాన్షుహన్స్‌, కునాల్‌ జైన్‌, కునాల్‌ ఉత్తమ్‌ శ్రోతే ఉన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:52 AM