Share News

నిధులు దోచేశారు..!

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:12 PM

కొందరు అక్రమార్కులు అధికారం ముసుగులో నిధులను అడ్డంగా దోచేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని పంచాయతీల్లోని కొంతమంది సర్పంచ్‌లు, అధికారులు తాము చెప్పిందే రాజ్యాంగమన్న విధంగా వ్యవహరించారు. నిధులను ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేశారు. అందుకు సంబంధించిన రికార్డులు, రసీదులు సక్రమంగా లేనేలేవు. ముఖ్యంగా ఒంగోలు డివిజన్‌ పరిధిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. మేజర్‌ పంచాయతీలైన సింగరాయకొండ, ఉప్పుగుండూరు, దొడ్డవరంల గ్రామాల్లో లక్షల రూపాయల నిధులను అక్రమంగా వినియోగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు విచారణ జరిపిన అధికారులు అవినీతికి పాల్పడిన ఒక్కొక్కరిపై వేటు వేస్తున్నారు. అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేస్తుండగా, సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ రద్దుచేస్తున్నారు.

నిధులు దోచేశారు..!
సింగరాయకొండ గ్రామ పంచాయతీ

గ్రామ పంచాయతీల్లో అంతా గోల్‌మాల్‌

కరెంటు సామగ్రి, బ్లీచింగ్‌ పేరుతో వినియోగం

లెక్కాపక్కా లేని రికార్డులు

పంచాయతీల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి

పంచాయతీ కార్యదర్శి, జూనియర్‌ సహాయకులకు షోకాజ్‌ నోటీసులు

సింగరాయకొండ గ్రామ పంచాయతీ జూనియర్‌ సహాయకులు సీహెచ్‌ విజయకృష్ణ పంచాయతీ రికార్డులు అప్పగించకుండా విధులకు గైర్హాజరు కావడంతో సస్పెండ్‌ చేస్తూ డీపీవో ఉషారాణి ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ సర్పంచ్‌ తాటిపర్తి వనజకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.

సింగరాయకొండ గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగంపై చేసిన విచారణ నివేదికను సకాలంలో ఇవ్వకపోవడంతో ఒంగోలు, కనిగిరి డివిజనల్‌ పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు ఇస్తూ ఈనెల 16న డీపీవో ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు.

మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామపంచాయతీ వాటర్‌ స్కీం నిధులను దుర్వినియోగం చేశారని ఈనెల 16న సర్పంచ్‌ చెక్‌పవర్‌ను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే పంచాయతీ కార్యదర్శిని తాజాగా శుక్రవారం సస్పెండ్‌ చేశారు.

నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామపంచాయతీ జూనియర్‌ సహాయకులుగా ఉంటూ ఇన్‌చార్జి కార్యదర్శిగా పనిచేసిన ఎం.శ్రీరామమూర్తి సర్పంచ్‌తో కలిసి రూ.42.70 లక్షల నిధులను అసాధారణంగా ఖర్చుచేసినట్లు డివిజనల్‌ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారు. ఆ మేరకు కార్యదర్శికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

కొందరు అక్రమార్కులు అధికారం ముసుగులో నిధులను అడ్డంగా దోచేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని పంచాయతీల్లోని కొంతమంది సర్పంచ్‌లు, అధికారులు తాము చెప్పిందే రాజ్యాంగమన్న విధంగా వ్యవహరించారు. నిధులను ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేశారు. అందుకు సంబంధించిన రికార్డులు, రసీదులు సక్రమంగా లేనేలేవు. ముఖ్యంగా ఒంగోలు డివిజన్‌ పరిధిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. మేజర్‌ పంచాయతీలైన సింగరాయకొండ, ఉప్పుగుండూరు, దొడ్డవరంల గ్రామాల్లో లక్షల రూపాయల నిధులను అక్రమంగా వినియోగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు విచారణ జరిపిన అధికారులు అవినీతికి పాల్పడిన ఒక్కొక్కరిపై వేటు వేస్తున్నారు. అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేస్తుండగా, సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ రద్దుచేస్తున్నారు.

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 26 : జిల్లాలోని పలు గ్రామపంచాయతీల్లో నిధుల వినియోగంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా మేజర్‌ పంచాయతీల్లో ఈ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులు వేగం పెంచారు. అక్రమార్కులపై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగించిన ఘటనలు బయటకు వస్తుండటంతో పాలకవర్గాల్లో ఆందోళన నెలకొంది. ఉప్పుగుండూరు గ్రామపంచాయతీలో అయితే ఏకంగా సర్పంచ్‌కు తెలియకుండానే అప్పటి వైసీపీ నాయకుల అండదండలు చూసుకొని పంచాయతీ కార్యదర్శి నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. పంచాయతీ నిఽధులు అక్రమం గా ఖర్చుచేశారని, వాటి వినియోగంపై విచారణ చేయాలని ఇటీవల ఆ గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఆ నిధుల వినియోగంపై విచారణకు ఆదేశించగా పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు వెలుగులోకి రావడంతో పంచాయ తీ కార్యదర్శి, జూనియర్‌ సహాయకులకు జిల్లా పంచాయతీ అధికారి ఉషారాణి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ఆ పంచాయతీలో సుమారు రూ.42లక్షల నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేసినట్లు తెలిసింది.

ఠ సింగరాయకొండలో భారీగా దుర్వినియోగం

సింగరాయకొండ మేజర్‌ పంచాయతీలో సుమారు రూ.40లక్షల మేరకు నిధులను డ్రా చేసినట్లు తెలిసింది. పంచాయతీ నిఽధుల వినియోగంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని జనసేన పార్టీ ఆ మండల నాయకుడితోపాటు మరికొంతమంది ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదుపై విచారణ చేయడంతో జనరల్‌ ఫండ్‌ నుంచి రూ.13 లక్షలు, 15 ఆర్థికసంఘం నిధులు సుమారు రూ.38.73 లక్షలు డ్రా చేయగా అందులో రూ.24.87 లక్షలు సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా జీతభత్యాలకు చెల్లించారు. మిగిలిన రూ.12లక్షల నిధులకు రికార్డులు లేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ పనిచేసే జూనియర్‌ అసిస్టెంట్‌ గత జనవరి నుంచి తన కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో ఇటీవల ఆ ఆఫీసు తాళాలు పగలగొట్టి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు దొడ్డవరం గ్రామపంచాయతీలో గత వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని భారీగా నిధులను దుర్వినియోగం చేసినట్లు సమాచారం.

పంచాయతీకార్యదర్శుల ద్వారా..

అనేక పంచాయతీల్లో ఉన్న అరకొర నిధులను పంచాయతీ కార్యదర్శుల ద్వారా సర్పంచ్‌లు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా గ్రామాల్లో ఏదైనా అత్యవసర పనులు ఉంటే వాటిని పూర్తిచేసి నిధులు డ్రా చేస్తారు. కానీ అందుకు భిన్నంగా పారిశుధ్య నిర్వహణ కోసం అవసరమయ్యే బ్లీచింగ్‌, కరెంటు సామగ్రిలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన రసీదులను కూడా ఇష్టారీతిన పెట్టినట్లు సమాచారం. సింగరాయకొండ గ్రామపంచాయతీలో అయితే పూర్వ పంచాయతీ కార్యదర్శుల సమయంలో విద్యుత్‌ సామగ్రి కొనుగోలు చేసినట్లు ఇప్పుడు బిల్లులు పెట్టారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయా గ్రామ పంచాయతీల్లో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో అక్రమార్కుల్లో అలజడి మొదలైంది.

పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామపంచాయతీ పూర్వ పంచాయతీ కార్యదర్శి ఎస్‌కే జాన్‌ బాషాను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. జాన్‌బాషా ప్రస్తుతం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం దైవాలరావురు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దొడ్డవరం గ్రామపంచాయతీలో వాటర్‌స్కీంకు సంబంధించి రూ.25.02 లక్షల నిధులు దుర్వినియోగమయ్యాయి. ఇటీవల ఆ విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఆ నిధులకు సంబంధించి జాన్‌బాషా అధికారులకు వివరాలు ఇవ్వలేదు. దీంతో వాటిని దుర్వినియోగం చేశారన్న అభియోగంతో ఆయనను సస్పెండ్‌ చేశారు. ఇప్పటికే ఆ పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై పంచాయతీ సర్పంచ్‌ చెక్‌పవర్‌ను కూడా రద్దుచేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు అరకొరగా ఉన్న నిధులను కూడా అధికారపార్టీ సర్పంచ్‌లు ఇష్టారీతిన ఎలాంటి బిల్లులు లేకుండా ఖర్చుచేశారు. ఆయా నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు రావడంతో వాటిపై విచారణ చేసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలకు ఉపక్రమించారు.

Updated Date - Jul 26 , 2024 | 11:12 PM