Share News

పొగాకు మార్కెట్లో అదే జోరు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:14 PM

దక్షిణాది పొగాకు మార్కెట్లో అదే జోరు కొనసాగుతోంది. దాదాపు మూడు వారాల అనంతరం ఈ ప్రాంతంలోని 11 వేలం కేంద్రాల్లో శుక్రవారం పొగాకు కొనుగోళ్లు పునఃప్రారంభం కాగా గతంలో ఉన్న డిమాండ్‌ కొనసాగింది.

పొగాకు మార్కెట్లో అదే జోరు
వెల్లంపల్లి కేంద్రంలో కొనుగోళ్లను పరిశీలించిన ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు, సెక్రటరీ దివి వేణుగోపాల్‌

తిరిగి ప్రారంభమైన వేలం

వెల్లంపల్లిలో రైతులతో ఈడీ సమావేశం

గరిష్ఠ ధర కిలో రూ.360

బ్రౌన్‌, బీఎక్స్‌లకు భారీ డిమాండ్‌

అపరాధ రుసుం రద్దుతో రూ.83 కోట్ల మేర రైతులకు లబ్ధి

ఒంగోలు, జూలై 26(ఆంధ్రజ్యోతి): దక్షిణాది పొగాకు మార్కెట్లో అదే జోరు కొనసాగుతోంది. దాదాపు మూడు వారాల అనంతరం ఈ ప్రాంతంలోని 11 వేలం కేంద్రాల్లో శుక్రవారం పొగాకు కొనుగోళ్లు పునఃప్రారంభం కాగా గతంలో ఉన్న డిమాండ్‌ కొనసాగింది. మేలురకం గరిష్ఠ ధర కిలో రూ.360 లభించగా లోగ్రేడ్‌ల్లో నాణ్యమైన బ్రౌన్‌, బీఎక్స్‌గా పిలిచే గ్రేడ్‌లకు గతం కన్నా కిలోకు దాదాపు రూ.60 నుంచి 70కిపైగా పెరిగింది. అనుమతించిన మేర పంట కొనుగోళ్లు పూర్తి కాగా అధిక ఉత్పత్తి కొనుగోళ్లకు అనుమతి కోసం మూడు వారాల క్రితం వేలాన్ని బోర్డు అధికారులు నిలిపివేసిన విషయం విదితమే. అలాంటి పంటను అపరాధరుసుం కూడా లేకుండా తిరిగి కొనుగోలుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో శుక్రవారం వేలం కేంద్రాలు తెరుచుకున్నాయి. దక్షిణాదిలోని 11 కేంద్రాలలో తిరిగి కొనుగోళ్లు ప్రారంభం కాగా పొగాకు బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు, సెక్రటరీ దివి వేణుగోపాల్‌, ఆర్‌ఎం లక్ష్మణరావు ఇతర అధికారులు వెల్లంపల్లి కేంద్రంలో కొనుగోళ్లను పరిశీలించారు. రైతులతో ఈడీ సమావేశం నిర్వహించారు. అధిక పంట ఉత్పత్తికి అపరాధరుసుం లేకుండా కొనేలా ఉత్తర్వులు తీసుకురావడం కోసం కీలక ప్రజాప్రతినిధులు, బోర్డు అధికారులు చేసిన కృషిని వివరించారు.

ఠ అధికంగా పండిస్తే నష్టమే: ఈడీ

ఇలా అధికంగా పంట పండిస్తే వచ్చే సీజన్‌లో రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించిన ఈడీ శ్రీధర్‌బాబు బోర్డు అనుమతించిన మేరకే సాగు, ఉత్పత్తిని చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా కొనుగోళ్లు పునఃప్రారంభం రోజున కూడా భారీ డిమాండ్‌ మార్కెట్లో కనిపించింది. ఇంచుమించు అన్ని కేంద్రాల్లోనూ గరిష్ఠ ధరలు కిలో రూ.360 మేర పలికాయి. అదేసమయంలో లోగ్రేడ్‌ ధరలు భారీగా పెరిగాయి. గతంలో లోగ్రేడ్‌లో నాణ్యతగా భావించే బ్రౌన్‌ రకం కిలో రూ.250 నుంచి 270 వరకు, అలాగే బీఎక్స్‌ రకం కిలో రూ.220 నుంచి రూ.240వరకు ఉండగా శుక్రవారం నాటి మార్కెట్లో వాటి ధరలు భారీగా పెరిగాయి. అత్యధిక శాతం బ్రౌన్‌రకం కిలో రూ.320 నుంచి 330 వరకు పలుకగా బీఎక్స్‌ ధరలు కిలో రూ.300 పలికాయి. అంతేకాక ఆ రకం బేళ్ల కోసం బయ్యర్లు పోటీపడ్డారు.

రైతులకు రూ.83కోట్ల లబ్ధి

అఽధిక ఉత్పత్తిపై అపరాధ రుసుంను కేంద్రం రద్దుచేయడంతో దక్షిణాది ప్రాంత పొగాకు రైతులకు దాదాపు రూ.83 కోట్ల మేర లబ్ధిచేకూరనుంది. గతంలో అధికపంటపై ఐదుశాతం అపరాధ రుసుం వసూలు చేసేవారు. కాగా గత ఏడాది నుంచి వరుసగా రెండేళ్లు కర్ణాటకలో దానిని రద్దు చేశారు. ఈ ఏడాది కూడా రద్దుచేయాలని రైతులు కోరిన నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించింది. అలాగే కూడా రాష్ట్రంలో అపరాధ రుసుం రద్దు వల్ల రూ.111 కోట్ల మేర రైతులకు లబ్ధి చేకూరగా అందులో దక్షిణాదిలో దాదాపు రూ.83కోట్లు మేర లభించింది. ఒక్కొక్క రైతుకు సగటున సుమారు రూ.50వేల వరకు లబ్ధి చేకూరినట్లు బోర్డు అధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Updated Date - Jul 26 , 2024 | 11:14 PM