Share News

నాటుసారాపై వైసీపీ దృష్టి

ABN , Publish Date - May 08 , 2024 | 11:47 PM

రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించేందుకు అధికార వైసీపీ తొక్కని అడ్డదారులు లేవు. ఎన్నికలలో ఓటర్లకు మద్యం పంపిణీ చేసి ఓట్లు రాబట్టుకోవడానికి ఒక వైపు ప్రణాళికలు అమలు చేస్తూనే మరోవైపు నాటుసారా పంపిణీపై దృష్టి సారించింది. ముఖ్యంగా గిరిజన గూడేలు ఉన్న ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల పరిధిలోని అటవీ గ్రామాలలో నాటుసారా తయారీ, పంపిణీపై దృష్టి సారించింది.

నాటుసారాపై వైసీపీ దృష్టి

గిరిజన తాండాల్లో గుట్టుగా తయారీ

మార్కాపురం, మే 8 : రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించేందుకు అధికార వైసీపీ తొక్కని అడ్డదారులు లేవు. ఎన్నికలలో ఓటర్లకు మద్యం పంపిణీ చేసి ఓట్లు రాబట్టుకోవడానికి ఒక వైపు ప్రణాళికలు అమలు చేస్తూనే మరోవైపు నాటుసారా పంపిణీపై దృష్టి సారించింది. ముఖ్యంగా గిరిజన గూడేలు ఉన్న ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల పరిధిలోని అటవీ గ్రామాలలో నాటుసారా తయారీ, పంపిణీపై దృష్టి సారించింది. అయినప్పటికీ, ఎస్‌ఈబీ అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెట్టుకుంటున్నారన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ నాయకులు అక్రమంగా నాటుసారా తయారీని కొనసాగిస్తూనే ఉన్నారు. నాటుసారాతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి చేసుకునేందుకు అక్కడి వ్యాపారులతో ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం.

గిరిజన తాండాలే ఉత్పత్తి కేంద్రాలు

మార్కాపురం డివిజన్‌లో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన తాండాలను నాటుసారా తయారీకి కేంద్రాలుగా ఎంపిక చేసుకున్నారు. ఎక్కువగా పుల్లలచెరువు, ఎర్రగొండపాలెం, దోర్నాల, అర్ధవీడు మండలాల్లోని తాండాలలో నాటుసారా ఉత్పత్తి ఎక్కువగా తయారు చేస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలో మద్యంతోపాటు నాటుసారాను కూడా మందుబాబులకు ఎరవేస్తున్నారు.

నాటుసారా తయారీ చేస్తున్నారిలా...

తెల్లతుమ్మచెక్క, నల్లబెల్లం మిశ్రమాన్ని డమ్ములో కలిపి ఊటను తయారు చేస్తారు. దానిని 10 రోజులు అలానే పులియబెడతారు. ఆ తర్వాత మిశ్రమాన్ని కుండలో పోసి కింద మంటబెడతారు. కుండకు పైన ఒక రంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ రంద్రం నుంచి ఒక పైపును బయటకు పెడతారు. బెల్లం ఊట మరిగి వచ్చిన ఆవిరి చుక్కలు పైపు ద్వారా బయటకు వచ్చేలా ఏర్పాటు చేస్తారు. అలా వచ్చిన ఆవిరి చుక్కలే నాటుసారా. ఇలా ఒక లీటరు నాటుసారా తయారు చేయడానికి సుమారు రూ.500 వరకూ ఖర్చవుతుంది. కొంతమంది వైసీపీ నాయకులు తయారీకి అవసరమైన వస్తువులన్నీ వారే తీసుకువచ్చి తయారీదారులకు కూలీలు చెల్లిస్తున్నారు. మరికొందరు తయారీదారులతో క్యాన్ల చొప్పున ఒప్పందాలు చేసుకొని కొనుగోలు చేస్తున్నారు.

కన్నెత్తిచూడని ఎస్‌ఈబీ అధికారులు

అక్రమ మద్యం, నాటుసారా తయారీలను అడ్డుకోవాల్సిన ఎస్‌ఈబీ అధికారులు ఆవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. ప్రతిపక్ష నాయకులు ఎవరైనా జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తే వారి ఆదేశాల మేరకే దాడులు చేస్తున్నారు. అప్పుడు కూడా నామమాత్రపు కేసులు నమోదు చేస్తున్నారు. అధికారపార్టీ నాయకులు కావడం, మామూళ్ల మత్తులో ఎస్‌ఈబీ అధికారులు ఉండడంతో వైసీపీ నాయకుల నాటుసారా తయారీ, పంపిణీలు ఎటువంటి ఆటకాలు లేకుండా యధేచ్ఛగా సాగుతున్నాయి.

Updated Date - May 08 , 2024 | 11:47 PM