Rajamahendravaram : తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
ABN , Publish Date - Sep 13 , 2024 | 04:38 AM
గోదావరి నీటిమట్టం గురువారం తగ్గుముఖం పట్టింది. వరద తగ్గినప్పటికీ ఇంకా ఉగ్రంగానే ప్రవహిస్తోంది.
ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి)/పోలవరం, సెప్టెంబరు 12: గోదావరి నీటిమట్టం గురువారం తగ్గుముఖం పట్టింది. వరద తగ్గినప్పటికీ ఇంకా ఉగ్రంగానే ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద బుధవారం రాత్రే రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించగా, గురువారం ఉదయం 10 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించారు. రాత్రి 8 గంటలకు 41.20 అడుగులకు తగ్గడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం పట్టినా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 14.30 అడుగులు ఉండగా 13,63,243 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం ఎగువన లక్ష్మీ బ్యారేజీ నుంచి వరద నీరు వస్తుందని చెబుతున్నారు. ఇక్కడ వరద పోటెత్తితే కొద్దిరోజులు గోదావరి వరద ఉగ్రంగానే ఉండే అవకాశం ఉంది. రాజమహేంద్రవరం అఖండ గోదావరిలోని లంకలన్నీ మునిగే ఉన్నాయి. కోనసీమ జిల్లాలోని లంక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టు స్పిల్వేలోకి వస్తున్న 11,66,581 క్యూసెక్కులను అధికారులు దిగువకు విడుదల చేశారు. స్పిల్వే ఎగువన 33.410 మీటర్లు, దిగువన 25.310 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు ఈఈ మల్లికార్జునరావు తెలిపారు.