Share News

Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా

ABN , Publish Date - Jan 19 , 2024 | 05:08 PM

Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు.

Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా
Supreme Court Adjourns Skill Scam Case

న్యూఢిల్లీ, జనవరి 19: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. స్కిల్ కేసులో 17A పై ఇటీవలే తీర్పు వెలువడిన నేపథ్యంలో కౌంటర్‌కు సమయం కావాలని చంద్రబాబు తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాదులు గుంటూరు ప్రేరణ, గుంటూరు ప్రమోద్ కుమార్‌లు సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. దీంతో విచారణను ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ గడువులోగా ఇరు పక్షాలూ తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాదాపు 52 రోజులకు పైగా జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఆ తరువాత ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తోంది.

Updated Date - Jan 19 , 2024 | 05:08 PM