Share News

పేదల పొట్టకొట్టారు

ABN , Publish Date - May 09 , 2024 | 12:31 AM

ఏ ప్రభుత్వమైనా.. పేదల సంక్షేమం కోసం ఆలోచించాలి. వారికి ఉపాధి మార్గాలు చూపి.. కడుపు నింపేలా.. ఆర్థికంగా నిలదొక్కుకునేలా తోడ్పడాలి. కానీ వైసీపీ ప్రభుత్వం.. తన సైకోయిజంతో పేదలకు కడుపు నిండా దొరికే భోజనాన్ని దూరం చేసింది. టీడీపీ హయాంలో ఎందరికో ఆకలి తీర్చిన అన్నక్యాంటీన్లను ఎత్తివేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వ తీరుపై అణగారిన వర్గాలు మండిపడుతున్నాయి.

పేదల పొట్టకొట్టారు
శ్రీకాకుళం ఏడురోడ్లజంక్షన్‌లో మూతపడిన అన్నక్యాంటీన్‌

- వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నక్యాంటీన్లు మూత

- టీడీపీ హయాంలో రూ.5తో కడుపునిండా భోజనం

- చంద్రబాబుకు పేరొస్తుందనే మూయించేసిన జగన్‌ సర్కారు

- రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజల మండిపాటు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఏ ప్రభుత్వమైనా.. పేదల సంక్షేమం కోసం ఆలోచించాలి. వారికి ఉపాధి మార్గాలు చూపి.. కడుపు నింపేలా.. ఆర్థికంగా నిలదొక్కుకునేలా తోడ్పడాలి. కానీ వైసీపీ ప్రభుత్వం.. తన సైకోయిజంతో పేదలకు కడుపు నిండా దొరికే భోజనాన్ని దూరం చేసింది. టీడీపీ హయాంలో ఎందరికో ఆకలి తీర్చిన అన్నక్యాంటీన్లను ఎత్తివేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వ తీరుపై అణగారిన వర్గాలు మండిపడుతున్నాయి. ‘నేను పేదల పక్షపాతిని. మీ బిడ్డను. మీ సంక్షేమం నా బాధ్యత’ అంటూ ఎప్పటికప్పుడు ఊకదంపుడు ప్రసంగాలు చేసే సీఎం జగన్‌వి అన్నీ ఉత్తుత్తి మాటలేనని ఆరోపిస్తున్నాయి. 2014లో నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించాక పేదల కోసం ప్రతిష్ఠాత్మకంగా ‘అన్న క్యాంటీన్‌’లను ప్రవేశపెట్టారు. ఈ క్యాంటీన్‌లో రూ.5తోనే కడుపునిండా భోజనం చేసే సదుపాయం కల్పించారు. పేదలు, విద్యార్థులు, కార్మికులు, దినసరి కూలీలు.. చిరుద్యోగులు.. ఇలా అన్నివర్గాల వారు అన్న క్యాంటీన్‌లను వినియోగించుకునేవారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసేవారు. రోజంతా ఆహారం కోసం రూ.15లోపు మాత్రమే ఖర్చయ్యేది. ఎన్నో కుటుంబాలకు ఊరట లభించేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నక్యాంటీన్లను మూసివేయించారు. వాటి స్థానంలో కొన్నిచోట్ల భవనాలను ఇతర వాణిజ్య కార్యక్రమాలకు ఇచ్చేశారు. మరికొన్ని భవనాలను సచివాలయ భవనాలుగా మార్పుచేశారు. దీంతో అణగారిన వర్గాల ప్రజలు.. కార్మికులంతా ఉసూరుమన్నారు. పేదల గురించి ఆలోచించకుండా చంద్రబాబుకు పేరు వస్తుందన్న కారణంతో క్యాంటీన్‌లను ఎత్తివేశారంటూ సీఎం జగన్‌ తీరును దుయ్యబడుతున్నారు.

జిల్లాలో నాలుగు క్యాంటీన్లు మూత..

వైసీపీ పాలనలో జిల్లాలో నాలుగు అన్నక్యాంటీన్లు మూతపడ్డాయి. శ్రీకాకుళంలో ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద ఒకటి, కళింగ రోడ్డులో మరొక అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు పనుల కోసం ఎదురుచూసేవారు. మేస్ర్తీ పిలిస్తే పనులకు వెళ్లేవారు. లేదంటే ఈసురోమంటూ ఉండేవారు. అటువంటి వారందరికీ అన్నక్యాంటీన్‌లు అత్యంత ప్రయోజనకరమయ్యాయి. వారితో పాటు నగరంలో పలు దుకాణాల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు, విద్యార్థులు, షాపింగ్‌మాల్స్‌లో పనిచేసే మహిళలు.. ఇలా అందరూ వేలాదిగా మూడుపూటలా అన్నక్యాంటీన్లలో కడుపునిండా తినేవారు. ఆమదాలవలస, పలాసలో కూడా అన్న క్యాంటీన్‌లు నెలకొల్పి.. అక్కడ కార్మికులు, ఇతరత్రా వర్గాల ప్రజలకు రూ. 5తో భోజన సదుపాయం కల్పించారు. పలాసలో తితలీ తుఫాన్‌ సమయంలో అన్నక్యాంటీన్‌లు ఎందరినో ఆదుకున్నాయి. ఇచ్ఛాపురంలో కూడా అన్నక్యాంటీన్‌ కోసం భవనం నిర్మించారు. ప్రారంభిద్దామన్న సమయంలో ఎన్నికల కోడ్‌ వచ్చేయడంతో.. నిలిపివేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రాగా.. అన్నక్యాంటీన్లను ఎత్తేశారు. శ్రీకాకుళం ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద అన్యక్యాంటీన్‌ను మూసేసి.. ఆ స్థానంలో వైసీపీ నాయకుడొకరు ఓ చైనీస్‌ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. జనం నవ్వుకున్నా.. ప్రజల నుంచి వైసీపీ నాయకులు ఛీత్కారాలు అందుకున్నా.. దర్జాగా రెండేళ్లపాటు రెస్టారెంట్‌ను నిర్వహించారు. ప్రజల నుంచి ఆదరణ లేకపోవడంతో ఆ రెస్టారెంట్‌ను మూసివేశారు. కళింగరోడ్డులో ఉన్న అన్నక్యాంటీన్‌ను మూసేసి.. ఆ భవనాన్ని వార్డు సచివాలయం కోసం కేటాయించారు. పలాస, ఆమదాలవలసలలో క్యాంటీన్లు కూడా మూసివేయించి వాటిని వేటికోసం వినియోగించలేదు. ఇచ్ఛాపురంలో కూడా భవనం నిరూపయోగంగా ఉంది.

మళ్లీ టీడీపీ వస్తే తెరుస్తారని హామీ..

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇటీవల జిల్లాకు వచ్చారు. తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్‌లను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌.. తన సొంత ఖర్చులతో రెండేళ్లపాటు మొబైల్‌ వాహనంతో అన్నక్యాంటీన్‌లు నిర్వహించారు. శ్రీకాకుళంలో పేదలు, కార్మికులు ఉండే ప్రాంతంలో క్యాంటీన్‌లు ఏర్పాటు చేసి ఉచితంగానే భోజనం పెట్టారు.

..........................

తినేది పేదలు.. చంద్రబాబు కాదుగా..

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీరు చాలా విచిత్రంగా ఉంది. అన్న క్యాంటీన్‌లు తీసుకువచ్చింది పేదల కోసం. అందులో లాభపడేది పేదలు మాత్రమే. చంద్రబాబు కాదు. ఈ విషయంలో రాజకీయాలకు పోయి సైకోయిజం చూపిస్తూ వైసీపీ ప్రభుత్వం క్యాంటీన్‌లను మూసివేసింది. పేదలు కడుపుకొట్టింది. ఇప్పుడు పేదలే ఓట్లతో వైసీపీకి బుద్ధి చెబుతారు.

- సిమ్మ శ్యామసుందరరావు, శ్రీకాకుళం

..........................

వేలాదిమందికి ప్రయోజనంగా ఉండేది

అన్న క్యాంటీన్‌లతో వేలాదిమందికి ప్రయోజనంగా ఉండేది. ఉదయానే కేరేజీ తీసుకురావాల్సిన అవసరం లేకుండా రూ.5తో భోజనం తినేవాళ్లం. ఆటోడ్రైవర్లకు ఎంతగానో ఉపయోగపడింది. అన్నక్యాంటీన్‌లపై ప్రభుత్వం కక్షగట్టి మూసివేయించింది. పేరుమార్చి క్యాంటీన్‌లు కొనసాగించి ఉంటే బాగుండేది.

- కలమట శశిభూషణరావు, ఆటోడ్రైవర్‌

..............................

కార్మికుల ఆకలి తీర్చేవి

భవన నిర్మాణ కార్మికులకు నిర్ధిష్టంగా పని ఉండదు. చేతిలో కేరేజీ పట్టుకుని పని కోసం ఎదురుచూస్తారు. అన్నక్యాంటీన్‌లు వచ్చాక.. టిఫిన్‌, భోజనం చేసేవాళ్లం. పని కుదిరితే వెళ్లేవాళ్లం. భోజనం కోసం అదనంగా ఖర్చు ఉండేది కాదు. ఆకలితో ఉండాల్సిన పరిస్థితి ఏ కార్మికుడికి ఉండేది కాదు. టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ తెరుస్తామని హామీఇవ్వడం సంతోషంగా ఉంది.

- సాఽధు రామారావు, భవన నిర్మాణరంగ కార్మికుడు

Updated Date - May 09 , 2024 | 12:31 AM