Share News

వారిలో వణుకు!

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:24 PM

వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ బడాస్థాయి నేతల నుంచి గ్రామస్థాయి చోటా నాయకుల వరకూ అక్రమాలకు పాల్పడ్డారు. వారి అక్రమాలకు కొంతమంది అధికారులు కూడా సహకరించారు. గత ఐదేళ్లలో ‘నాడు-నేడు’ పేరిట రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేసినట్టు వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు.

వారిలో వణుకు!
ఆమదాలవలస నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు సరఫరా చేసిన నాణ్యత లేని గ్రానైట్‌

- నాడు-నేడు పనులపై సీఐడీ ఫోకస్‌

- వైసీపీ నాయకుల్లో అలజడి

- సహకరించిన అధికారుల్లో ఆందోళన

- నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు

- త్వరలో దర్యాప్తునకు రంగం సిద్ధం

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ బడాస్థాయి నేతల నుంచి గ్రామస్థాయి చోటా నాయకుల వరకూ అక్రమాలకు పాల్పడ్డారు. వారి అక్రమాలకు కొంతమంది అధికారులు కూడా సహకరించారు. గత ఐదేళ్లలో ‘నాడు-నేడు’ పేరిట రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేసినట్టు వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. ఓటర్ల మెప్పు పొందేందుకు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనూ దీనిపై ప్రసంగాలు చేశారు. కాగా.. ‘నాడు-నేడు’ అభివృద్ధి పనుల పేరిట భారీగా అక్రమాలు జరిగాయని ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం భావిస్తోంది. సీఐడీ దర్యాప్తు ద్వారా ఈ అక్రమాలను బయటకు తీసేందుకు సన్నద్ధమవుతోంది. దీంతో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకుల్లో అలజడి రేగుతోంది. అప్పట్లో వైసీపీ నాయకులతో అంటకాగి.. నిబంధనలు విస్మరించి.. సామగ్రి విషయంలో సంబంధం లేనట్లు వ్యవహరించిన అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది.

- జిల్లాలో ఇదీ పరిస్థితి

గత ప్రభుత్వం ‘నాడు-నేడు’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలల్లో రన్నింగ్‌ వాటర్‌, కిచెన్‌ షెడ్‌, విద్యుత్‌ సదుపాయం, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టింది. అలాగే మైనర్‌, మేజర్‌ రిపేర్లు, కాంపౌండ్‌ వాల్‌, తాగునీటి సదుపాయం, పెయింటింగ్‌, గ్రీన్‌ చాక్‌బోర్డు, ఫర్నీచర్‌ వంటివి సమకూర్చింది. జిల్లాలో ఫేజ్‌-1లో 958 ప్రభుత్వ పాఠశాలలకుగాను రూ. 246,72,32,000 ఖర్చుచేశారు. ఫేజ్‌-2లో రూ.445,34,54,000 పనులు ప్రతిపాదించారు. కానీ ప్రస్తుతానికి 1,058 ప్రభుత్వ పాఠశాలలు, 38 జూనియర్‌ కళాశాలల్లో పనులు చేపట్టినందుకు రూ.175.26 కోట్లు ఖర్చు చేశారు. పనులు ఇంకా పూర్తికాలేదు. కొన్ని పాఠశాలలు బాగుచేసినా.. మదింపు పేరిట మూసివేశారు. కాగా.. ‘నాడు-నేడు’ పేరిట అభివృద్ధి పనుల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై విచారణ చేపట్టాలని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ స్పందిస్తూ... ‘నాడు-నేడు’ పనులపై త్వరలో సీఐడీ దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. దీంతో వైసీపీ నాయకులు, అక్రమాలకు సహకరించిన అధికారుల్లో టెన్షన్‌ నెలకొంది.

- పేరు పేరెంట్స్‌ కమిటీది... పెత్తనం మరొకరిది...

పేరెంట్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ‘నాడు-నేడు’ పనులు జరగాల్సి ఉన్నా.. పేరుకు మాత్రమే కమిటీ అన్నట్లు వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. పనులను స్థానిక వైసీపీ నాయకులు తీసుకుని నిర్వహించారు. ఇందులో స్థానిక నాయకుల కంటే.. వైసీపీ బడానేతలు.. భారీగా లబ్ధి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. పనులు చేపట్టినట్లు ఇంజనీరింగ్‌ అధికారులు పేరెంట్స్‌ కమిటీ నుంచి సంతకాలు సేకరించేవారు. కానీ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న ఫర్నిచర్‌, పెయింట్స్‌, గ్రానైట్‌ పలకలు.. ఇటువంటివన్నీ గత ప్రభుత్వ పెద్దలు స్పష్టంచేసిన వాటినుంచే కొనుగోలు చేసేవారు. తెలివిగా పేరెంట్స్‌ కమిటీ నుంచి ఆర్డర్లు తీసుకున్నారు.. కానీ అంతిమంగా లబ్ధిపొందింది అప్పటి వైసీపీ పెద్దనాయకులే. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు గ్రానైట్‌ పలకల సమకూర్చే అనధికార కాంట్రాక్టులో వైసీపీ ఎమ్మెల్సీకి లబ్ధి కలిగింది. నాసిరకమైన పలకలు.. పాఠశాలలకు సరఫరా చేసి.. బిల్లులు మాత్రం ఠంచన్‌గా తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఐడీ రంగంలోకి దిగితే.. ప్రభుత్వ పాఠశాలలకు ఐదేళ్లలో సరఫరా చేసిన రంగులు, గ్రానైట్‌, ఫర్నిచర్‌.. ఇలా తెరవెనుక ఉన్న నాయకుల బాగోతం బట్టబయలవుతుంది.

- వారిని పక్కన పెడితేనే.. సమగ్ర విచారణ...

ప్రభుత్వ కార్యక్రమాల్లోని అక్రమాల్లో అప్పటి నాయకుల పాత్ర ఎంతుందో.. అదేస్థాయిలో అధికారులదీ ఉంది. బిల్లుల రికార్డు చేయడం నుంచి.. వారికి సహకరించి.. ‘పీసీ’ల రూపంలో తీసుకున్న అధికారులు.. వారితో పాటు.. పెద్దఎత్తున ఆరోపణలు ‘మూట’కట్టుకున్న అధికారి కూడా ప్రస్తుతం జిల్లాలోనే కొనసాగుతున్నారు. ఇటువంటివారిని పక్కనబెట్టి.. లేదంటే మరోచోటుకు బదిలీచేసి.. సీఐడీ దర్యాప్తు ఆరంభిస్తే గతప్రభుత్వ తప్పిదాలు మొత్తం వెలుగులోకి వచ్చే అవకాశముంది. అప్పట్లో ఉన్నత పదవులు వెలగబెట్టిన బడానేతల అక్రమాల చిట్టా సైతం.. బయటపడనుంది. దీనిపై జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి సారించి.. సమగ్ర విచారణకు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:24 PM