Share News

వైసీపీలో ఓటమి భయం!

ABN , Publish Date - May 09 , 2024 | 12:33 AM

పోలింగ్‌కు గడువు దగ్గరపడే కొద్దీ వైసీపీ శ్రేణులు బరితెగిస్తున్నాయి. ఓటమి భయంతో కూటమి నాయకులపై వరుస దాడులకు పాల్పడుతున్నాయి. ఎలాగైనా గెలవాలని కత్తులు, రాళ్లతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వైసీపీకి జై కొట్టాలంటూ బెదిరిస్తున్నాయి.

వైసీపీలో ఓటమి భయం!
ఎన్‌జీఆర్‌ పురంలో ప్రచారం చేస్తున్న ఎన్‌ఈఆర్‌.. (ఇన్‌సెట్‌లో) వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన జనసేన కార్యకర్త

- అందుకే కూటమి శ్రేణులపై వరుస దాడులు

- జిల్లాలో రెచ్చిపోతున్న అధికారపార్టీ నేతలు

- కత్తులు, రాళ్లతో దాడిచేసి భయభ్రాంతులు

- ఎన్నికల్లో అడ్డుగోలుగా గెలవాలన్న ఉద్దేశం

- వారంలో రెండు ఘటనలతో కలకలం

- పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు

- తాజాగా ఎచ్చెర్ల అభ్యర్థి ఎన్‌ఈఆర్‌పై దాడి

- జనసేన పార్టీ కార్యకర్తకు గాయాలు

రణస్థలం, మే 8 : పోలింగ్‌కు గడువు దగ్గరపడే కొద్దీ వైసీపీ శ్రేణులు బరితెగిస్తున్నాయి. ఓటమి భయంతో కూటమి నాయకులపై వరుస దాడులకు పాల్పడుతున్నాయి. ఎలాగైనా గెలవాలని కత్తులు, రాళ్లతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వైసీపీకి జై కొట్టాలంటూ బెదిరిస్తున్నాయి. ఈనెల 6న ఆమదాలవలస టీడీపీ అభ్యర్థి రవికుమార్‌ సతీమణిపై కత్తితో దాడి మరువకముందే బుధవారం రాత్రి మరో ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రచారానికి వెళ్లిన ఎచ్చెర్ల అభ్యర్థి ఎన్‌ఈఆర్‌, కార్యకర్తలపై అధికారపార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ యువకుడికి గాయాలయ్యాయి.

ఇంతజరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. అధికారపార్టీ శ్రేణులు ఎంత రెచ్చిపోతున్నా.. బెదిరిస్తున్నా.. దాడులు చేస్తున్నా ఎన్డీఏ కూటమి శ్రేణులు ఎక్కడా తగ్గడం లేదు. వారికి వెరవకుండా ప్రజల్లోకి దూసుకు పోతున్నారు. అధికారపార్టీ ఆగడాలను ఎండగడుతున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో వివరిస్తున్నారు.

త్రుటిలో తప్పించుకున్న ఎన్‌ఈఆర్‌

ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున ఎన్‌.ఈశ్వరరావు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓటర్లను కలుసుకుంటున్నారు. అయితే దీన్ని వైసీపీ నాయకులు తట్టుకోలేక పోతున్నారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు ఆత్మీయ కలయికలో భాగంగా ఎన్‌ఈఆర్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు ఎన్‌జీఆర్‌ పురానికి వెళ్లారు. గ్రామంలో ప్రచారం చేసుకుంటూ వెళ్తుండగా.. స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. అప్రమత్తమైన కార్యకర్తలు ఎన్‌ఈఆర్‌ను వెంటనే కారులో ఎక్కించి వెనక్కి పంపించారు. దీంతో ఎన్‌ఈఆర్‌ రాళ్ల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అయితే ఒక జనసేన కార్యకర్తకు మాత్రం గాయాలు అయ్యాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలిగానీ, ఇలా రాళ్లదాడికి దిగడం శోచనీయమని కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తొలి నుంచి చెబుతున్నా..

ప్రస్తుతం ఎచ్చెర్ల ఎన్డీఏ అభ్యర్థి ఎన్‌ఈఆర్‌పై దాడి చేసిన గ్రామంలోనే 12 రోజుల క్రితం వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఎన్‌జీఆర్‌పురం పంచాయతీ పరిధిలో చీకటిపేట, గురయ్యపేట, పాతయ్య పేట గ్రామాల్లో టీడీపీ, జనసేనపార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ 1,450మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామాలకు చెందిన వారు ఎచ్చెర్ల బీజేపీ అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు తరపున ఎన్నికల ప్రచారానికి, పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీన్ని ఆయా గ్రామాల వైసీపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోయారు. టీడీపీ, జనసేనపార్టీ సానుభూతిపరులపై దాడులకు తెగబడ్డారు. వారిని భయపెట్టారు. ‘మమ్మల్నే ఎదిరిస్తార్రా?’ అంటూ గద్దించారు. దీంతో కొన్ని కుటుంబాలు వేరే గ్రామాల్లో తలదాచుకుంటున్నాయి. ఈ ఘటనలపై ఫిర్యాదులు వెళ్లడంతో ఆ గ్రామాల్లో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.

ఈనెల 6న కూన ప్రమీలపై కత్తితో..

ఈనెల 6వ తేదీన సోమవారం ఆమదాలవలస టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌ సతీమణి కూన ప్రమీల పొందూరు మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థుల గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇది అధికారపార్టీ జీర్ణివంచుకోలేక పోయింది. ప్రమీల రాత్రి 8 గంటల సమయంలో కోటిపల్లి పంచాయతీ మజ్జిలపేట గ్రామానికి వెళ్లి ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. ఇంతలో కొందరు వైసీపీకి చెందినవారు టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. అయినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారిని పట్టించుకోలేదు. ఇల్లిల్లూ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇంతలోనే గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త గురుగుబెల్లి రమణ కత్తితో కూన ప్రమీలపై దాడికి పాల్పడ్డాడు. అయితే అక్కడే ఉన్న ప్రమీల కారుడ్రైవర్‌ సింగూరు కసవయ్య రమణను అడ్డుకోవడంతో అతని చేతికి తీవ్ర గాయమైంది. టీడీపీ నాయకులు రమణను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ముందస్తు పథకం ప్రకారమే గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేసి తమపై దాడికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

టీడీపీలో చేరామని ఇంటిని కాల్చేశారు

పోలీసులకు బాధితుల ఫిర్యాదు

సంతబొమ్మాళి: టీడీపీలో చేరామన్న కక్షతో ఇంటిని దహనం చేశారని హెచ్‌ఎన్‌పేట పంచాయతీ పోతునాయుడుపేటకి చెందిన బేతల ఈశ్వరరావు, కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి మరమ్మతుల కోసం పాత రేకలు తొలగించి కొత్త రేకులు వేస్తున్నామని, మంగళవారం రాత్రి ఇంటిని వైసీపీ నాయకుడి ప్రోద్బలంతో ఆ పార్టీ కార్యకర్తలు దహనం చేశారని వారు ఆరోపించారు. ఐదుగురు అనుమానితులపై నౌపడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నౌపడ ఎస్‌ఐ కిషోర్‌ వర్మ ఘటన స్థలానికి చేరుకుని ఆరా తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఇది రాజకీయ కక్షతో జరిగిన ఘటన కాదని, ఏడాదిగా ఈ ఇంటి కోసం తగాదా ఉందని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - May 09 , 2024 | 12:33 AM