గంగపత్రుల.. మరణమృదంగం
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:57 PM
రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం జిల్లా సొంతం. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది.
- ప్రతిఏటా పెరుగుతున్న ప్రమాదాలు
- మృత్యువాత పడుతున్న మత్స్యకారులు
- అందుబాటులోకి రాని హార్బర్లు, జెట్టీలు
- అమలుకాని ప్రభుత్వాల హామీలు
- నేడు ప్రపంచ మత్స్యకార దినం
రణస్థలం/ఎచ్చెర్ల, నవంబరు 19(ఆంధ్రజ్యోతి ):
- రణస్థలం మండలం అల్లివలస గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ అనే మత్స్యకారుడు ఈనెల 18న చేపలవేటకు వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. వేట ముగించుకుని వస్తుండగా బోటు బోల్తా పడింది. ఊపిరాడక అతను మృత్యువాత పడ్డాడు. వయసు 34 సంవత్సరాలు మాత్రమే. ఏడాది వయసున్న కుమారుడు, భార్య, వృద్ధులైన తల్లిదండ్రులు నిరాశ్రయులయ్యారు.
- ఈ నెల 6న వజ్రపుకొత్తూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుడుపల్లి జగదీష్ అనే మత్స్యకారుడు వేటకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. స్థానికంగా వేట గిట్టుబాటు కాక విశాఖ వెళ్లాడు. అక్కడ బోటులో వేటకు వెళ్లి సముద్రంలో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. తర్వాతి రోజు మృతదేహం ఒడ్డుకు చేరింది. అతని వయసు 40 సంవత్సరాలు. జగదీష్ అకాల మరణంతో భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు వీధినపడ్డారు.
- సెప్టెంబరు 2న ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు పంచాయతీ పాత దిబ్బపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు జంగమయ్య మృత్యువాత పడ్డాడు. నాగావళి నదీ సంగమం వద్ద సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. వయసు 53 ఏళ్లు. పెళ్లీడుకు వచ్చిన కుమార్తెలు, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. దీంతో భార్య బాధ వర్ణనాతీతం.
- జూలై 8న సోంపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు పలిశెట్టి జోగారావు మృత్యువాత పడ్డాడు. చేపల వేటకు వెళ్లిన జోగారావు సంద్రం మధ్యలో ప్రమాదానికి గురయ్యాడు. కేవలం 48 సంవత్సరాలు. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. కుమార్తెకు వివాహం చేయాల్సి ఉంది. దీంతో భార్య, వృద్ధ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
.. ఇలా జిల్లాలో ఏదో ఒకచోట మత్స్యకారుల మరణ మృదంగం కొనసాగుతునే ఉంది. ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్నారు. వారి కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా మత్స్యకారుల తలరాతలు మారడం లేదు. వారికి లబ్ధి చేకూరే శాశ్వత ప్రాజెక్టులేవీ జిల్లాలో నిర్మాణం కావడం లేదు.
ఇదీ పరిస్థితి..
రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం జిల్లా సొంతం. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్తలం మండలం దోనిపేట వరకూ 104 మత్స్యకార గ్రామాలున్నాయి. లక్షకుపైగా జనాభా ఉన్నారు. మొత్తం 6,211 మత్స్యకారులు వేటకు వెళ్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే జిల్లాలో ఫిషింగ్ హార్బర్లు కానీ, జెట్టీలు కానీ అందుబాటులో లేక మత్స్యకారులు సంప్రదాయ వేటకే పరిమితమయ్యారు. ఇప్పటికీ నాటు పడవలపై ప్రమాదకర స్థితిలో వేట సాగిస్తున్నారు. స్థానికంగా వేట గిట్టుబాటు గాక వేలాది మంది చెన్నై, గుజరాత్, ముంబై, కలకత్తా, పారాదీప్ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కాంట్రాక్టర్ల వద్ద పనికి కుదురుతున్నారు. కొన్నిసార్లు విదేశీ జలాల్లోకి ప్రవేశించి అక్కడి కోస్టుగార్డులకు చిక్కుతున్నారు. ఖైదీలుగా మారుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అలాంటి విషాద సమయాల్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలుయ గుప్పిస్తున్నారు. ఆతరువాత వాటి గురించే మరిచిపోతున్నారు.
పనుల్లో పురోగతి ఏదీ?
టీడీపీ ప్రభుత్వ హయాంలో భావనపాడు హార్బర్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయింది. ఇంతలో ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో హార్బర్ నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. అయితే ఈ ఎన్నికలకు ముందు భావనపాడు హార్బర్‌ను మూలపేటకు మార్చారు. అప్పటి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కానీ అదో ఎన్నికల స్టంట్‌గా మిగిలిపోయింది. అప్పట్లో వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణంతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి వైసీపీ ప్రజాప్రతినిధులు హడావుడిగా శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం ప్రారంభించలేదు. తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వీటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది.
కంటితుడుపు చర్యలే
ప్రభుత్వ రాయితీలు, పథకాల విషయంలో మత్స్యకారులు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నారు. వేట నిషేధ సమయంలో అందించే మత్స్యకార భరోసా ఇప్పటికీ చాలామంది అర్హులకు అందలేదు. సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల్లో పథకం పక్కదారి పట్టినట్లు విమర్శలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో చాలామంది అనర్హులు దక్కించుకున్నారు. నాయకులు బినామీల పేరుతో లక్షలాది రూపాయలు అవినీతికి పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదులు వచ్చినా దర్యాప్తులు లేవు. వేటలో భాగంగా మత్స్యకారులు చిన్న వయసులోనే కంటి సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఇటువంటి వారిని గుర్తించి పింఛన్లు అందిస్తామన్న ప్రభుత్వ హామీ బుట్టదాఖలైంది. సరిగ్గా వేట సాగక ఏటా వేలాది మంది మత్స్యకారులు కుటుంబాలను గ్రామాల్లో విడిచిపెట్టి సుదూర ప్రాంతాలు వలసపోతున్నారు. స్థానికంగా ప్రత్యామ్నాయ ఉపాధి లేక కొంతమంది రహదారుల పక్కన కళ్లద్దాలు, బొమ్మలు విక్రయిస్తున్నారు. జిల్లాలో హైవేతో పాటు ప్రధాన రహదారుల వెంబడి కనిపించే దుకాణాలు ఎక్కువగా మత్స్యకారులవే. కనీసం మత్స్యకార గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కూడా జరగని దుస్థితి. కనీసం పక్క గ్రామాలు, మైదాన ప్రాంతాల్లోనైనా ఉపాధి పనులు కల్పించాలని మత్స్యకారులు ఎప్పటి నుంచో కోరుతున్నా ఫలితం లేదు.
వాటికి దూరంగా..
జిల్లా మత్స్యకారులు అత్యాధునిక బోట్లు, స్టీమర్లకు దూరంగా ఉన్నారు. లైఫ్ జాకెట్లు వంటివి లేకపోవడంతో ప్రమాదకర వేట సాగిస్తున్నారు. విశాఖ, కాకినాడ, పారాదీప్నకు చెందిన మత్స్యకారులు స్టీమర్లు, ఇతర ఆధునిక పరికరాలతో వేట సాగిస్తున్నారు. ఇక్కడి మత్స్యకారులకు చేపలు చిక్కడం లేదు. దీంతో ఎనిమిది నాటికల్ మైళ్ల దూరం వెళ్లి వేట సాగించాల్సి వస్తోంది. సంప్రదాయ పడవల్లోనే అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వేటకు వెళుతున్నారు. రాకాసి అలలతో పాటు విపత్తులకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. జూలై నుంచి నవంబరు వరకూ సముద్రంలో ఎక్కువగా గాలులు వీస్తాయి. ఆ సమయంలోనే మత్స్యకారులు ఎక్కువగా ప్రమాదాల బారినపడుతుంటారు. ఇంజను పడవపై ఆరుగురు వెళ్లాల్సి ఉండగా.. 18 మంది వేటకు వెళుతున్నారు. ఇక కర్ర పడవపై ముగ్గురు వెళ్లాల్సి ఉండగా.. ఆరుగురు వెళుతున్నారు. ఈ క్రమంలో పడవలు ఒడిదుడుకులకు లోనై బోల్తా పడుతున్నాయి.
ఇవి చేయాలి..
- వేటకు వెళ్లే మత్స్యకారులకు లైఫ్ జాకెట్లు ఇవ్వాలి
- రాయితీపై స్టీమర్లు (మరబోట్లు) అందించాలి.
- జాప్యం చేయకుండా జిల్లాలో ప్రతిపాదించిన ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలను వీలైనంత త్వరగా నిర్మించాలి.
- తీరంలో పడవలు, వేట సామగ్రి సంరక్షణ చర్యలు చేపట్టాలి.
- ప్రతీ తీర ప్రాంతానికి రహదారుల నిర్మాణం చేపట్టాలి.
- చేపలు ఆరబెట్టేందుకు ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేయాలి.
- చేపలను నిల్వ చేసుకునేందుకు వీలుగా కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటుచేయాలి.
- వేట నిషేధ సమాయానికి చెల్లించాల్సిన భృతిని సకాలంలో అందివ్వాలి.
- వేట లేని సమయంలో మత్స్యకార గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమలుచేయాలి.
బుడగట్లపాలెం హార్బర్ నిర్మాణమైతే..
ఈ ఏడాది కూడా మత్స్యకారులు గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు వలసపోయారు. గుజరాత్లో వీరావల్, కాండ్లా, పోరుబందర్‌తో పాటు కర్ణాటకలోని మంగుళూరుకు వెళ్లారు. ఏటా ఆగస్టులో వెళ్లి తిరిగి ఏప్రిల్ నెలలోనే స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. జిల్లాలో సుదూర సముద్ర తీరమున్నా గుజరాత్ రాష్ట్రానికి వలసపోవడానికి కారణం మత్స్యకారుల ఆర్ధిక పరిస్ధితులే. ఈ ప్రాంతంలో మత్స్యకారులు సంప్రదాయ తెప్పలతో, మోటారు బోట్లతో వేట సాగిస్తున్నారు. ఐదారుగురు జాలర్లు చేపల వేటకు వెళితే కనీస ఖర్చులు కూడా రాని పరిస్ధితి ఉంది. ఇల్లు కట్టాలన్నా, ఆడపిల్లల పెళ్ళిళ్లు చేయాలన్నా వీరికి పెద్ద సమస్యగా ఉంది. గుజరాత్‌లోని బోటు యజమానితో ముందుగా ఒప్పందం కుదుర్చుకుని వలసవెళ్తారు. ఒక్కో బోటులో 7 నుంచి 9 మంది వరకు వెళ్తుంటారు. చేపల వేట ఆశించిన స్థాయిలో సాగితేనే ఒప్పందం మేరకే డబ్బులు చెల్లిస్తారు. గుజరాత్‌కు వెళ్లిన మత్స్యకారులు పడరాని కష్టాలు పడుతున్నారు. గుజరాత్లో వీరావల్‌లోని అరేబియా సముద్రంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున సరిహద్దు దాటితే పాక్ కోస్ట్‌గార్డులకు చిక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2018 సంవత్సరం నవంబరు నెలలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు పాక్‌కు బందీలుగా చిక్కి ఏడాదిన్నర తర్వాత విముక్తులయ్యారు. అంతకు మునుపు కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి మత్స్యకారులు కొంతమంది కర్ణాటక రాష్ట్రానికి వలసలు ప్రారంభించారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణమైతే మత్స్యకారులకు వలస నివారణకు అవకాశం ఉంటుంది. అన్ని అనుమతులు ఉన్నా ఇంకా పనులు ప్రారంభం కాలేదు.
మత్స్యకారుల సంక్షేమానికి కృషి
మత్స్యకారుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. వేట నిషేధ సమయంలో అర్హులందరికీ మత్స్యకార భరోసా అందించింది. జిల్లాలో భావనపాడు, బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నాం. మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మితం కానుంది. ఇందుకు సంబంధించి పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
- మత్స్యశాఖ డీడీ శ్రీనివాసరావు, శ్రీకాకుళం
వేటకు వెళ్లేనే పూట గడిచేది
వేటకు వెళ్తేనే కుటుంబానికి పూట గడిచేది. లేకుంటే పస్తులే మిగులుతాయి. తుఫాన్లు, వాతావరణం సరిగ్గా లేనప్పుడు రోజుల తరబడి ఇంటి వద్దే ఉండిపోతాం. కనీసం ఉపాధి హామీ పనులు ఉంటే కొంత ఇబ్బందులు తీరుతాయి. ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పూర్తి స్థాయిలో ఉపాధి పనులు మాత్రం కల్పించలేదు.
- మైలపల్లి కామరాజు, మత్స్యకారుడు, జీరుపాలేం
చాలా ఇబ్బందులు పడుతున్నాం
స్థానికంగా వేట గిట్టుబాటు కలగడం లేదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. తప్పనిసరైతే సుదూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. ఉన్న గ్రామాల్లో కుటుంబాలను విడిచిపెట్టి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం జిల్లాలో హార్బర్లు, జెట్టీల నిర్మాణం పూర్తిచేయాలి.
- అప్పారావు, మత్స్యకారుడు, కొవ్వాడ
లైఫ్ జాకెట్లు ఇవ్వాలి
మత్స్యకారులు లైఫ్ జాకెట్లు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిని కొనుగోలుచేసే స్థోమత మత్స్యకారులకు లేదు. అటు సంప్రదాయ పడవల్లోనే సముద్రంలో ఎనిమిది నాటికల్ మైళ్లు దాటి వేట సాగించాల్సి వస్తోంది. అర్ధరాత్రి బయలుదేరితే కానీ సముద్రంలోకి వెళ్లలేం. ఆ సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆధునిక వేట పద్ధతులను ప్రోత్సహించాలి.
- దుమ్ము అశోక్, మత్స్యకారుడు, జీరుపాలేం