అంతా మాయ!
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:52 PM
మార్కెట్లో మిల్లర్లు, వ్యాపారుల మాయాజాలంతో రైతులకు, వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర దక్కడం లేదు. మరోవైపు వినియోగదారులకు మార్కెట్లో బియ్యం ధర ఏ మాత్రం తగ్గడం లేదు.
- గిట్టుబాటు ధర లేని ధాన్యం
- భగ్గుమంటున్న బియ్యం
- విలవిల్లాడుతన్న వినియోగదారులు..
- ఆందోళనలో అన్నదాతలు
- మిల్లర్లు, వ్యాపారుల సిండికేట్‌తో ఇబ్బందులు
‘అమ్మబోతే నష్టం.. కొనబోతే కష్టం’ అన్న చందంగా ఉంది రైతులు, వినియోగదారుల పరిస్థితి. మార్కెట్లో మిల్లర్ల మాయాజాలంతో సన్న రకాల ధాన్యం మద్దతు ధర బస్తాకు రూ.500 వరకూ తగ్గింది. అదే సమయంలో బియ్యం ధర మాత్రం రూ.300 వరకూ పెరిగింది. దీంతో గిట్టుబాటు ధర లేదని అన్నదాతలు, బియ్యం ధరలు భగ్గుమంటున్నాయని వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
....................
నరసన్నపేట, , నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మార్కెట్లో మిల్లర్లు, వ్యాపారుల మాయాజాలంతో రైతులకు, వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర దక్కడం లేదు. మరోవైపు వినియోగదారులకు మార్కెట్లో బియ్యం ధర ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు, తర్వాత తెగుళ్ల బెడద వెంటాడినా.. ధాన్యం దిగుబడులు మాత్రం బాగానే వచ్చాయి. మంచి ధర వస్తుందని రైతులు ఆశించగా.. మార్కెట్లో వ్యాపారుల తీరు కారణంగా నిరాశే ఎదురవుతోంది. ఏటా ఈ సీజన్లో పాతధాన్యం సన్నాలకు మంచి ధర ఉంటుంది. ఈ ఏడాది మాత్రం సన్నాలు ధర తగ్గించారు. గత నెలలో పాతధాన్యం బస్తా(81 కేజీలు) రూ.2,700 ఉండగా.. ప్రస్తుతం రూ.2,200కు కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో బియ్యం ధర మాత్రం కిలోకి రూ.10చొప్పున పెంచుతూ భగ్గుమనిపిస్తున్నారు. నెల వ్యవధిలో బియ్యం ధర క్వింటాకు రూ.300 వరకు పెంచేశారు.
- ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు సుమారు 1.23 లక్షల ఎకరాల్లో సన్నాలు ధాన్యం సాగు చేశారు. ఎకరాకు 35 బస్తాల వరకూ దిగుబడి రాగా.. ఎంతో సంతోషించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా.. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో గతేడాది మాదిరి బస్తా గరిష్ఠంగా రూ.2,700 వరకూ విక్రయించవచ్చని భావించారు. కానీ ఈఏడాది మిల్లర్లు సిండికేట్‌గా వ్యవహరించి రైతుల నుంచి సాంబ రకం(బీపీటీ 5304) బస్తా రూ.1,850కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇతర రకాలు రూ.1,750 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో సన్నరకాలు సాగు చేసే ధాన్యం రైతులు దిగులు చెందుతున్నారు.
భగ్గుమంటున్న బియ్యం ధరలు
మార్కెట్లో ధాన్యం ధర తగ్గడంతో బియ్యం ధరలు కూడా తగ్గుతాయని వినియోగదారులు ఆశించారు. కానీ క్వింటా బియ్యం ధర రూ.వందకు పెంచారు. గత నెలరోజులుగా సాంబమసూరి(సీసీలు), కర్నూలు సన్నాలు, స్వర్ణమసూరి, జగత్యాల రకాల బియ్యం ధరలు పెరుగుతున్నాయి. సాంబ మసూరు క్వింటా రూ.5,400 నుంచి రూ.5,600కు విక్రయిస్తున్నారు. అంటే బస్తా(26కేజీలు)రూ.1400 వరకు లోకల్ మిల్లువి అమ్మకాలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కంపెనీ బియ్యం రూ.1,600 నుంచి రూ.1,650 వరకూ విక్రయిస్తున్నారు. క్వాలిటీ పేరుతో పలు రకాల బియ్యాన్ని అధిక ధరకు అమ్ముతున్నారు. వ్యాపారులు, మిల్లర్లు కుమ్మక్కవడంతో మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణమైందనే వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
మిల్లర్ల కుచ్చుటోపీ
80 కేజీలు ధాన్యం మరపెడితే కనీసం 50 కేజీల నుంచి 60 కేజీల వరకు బియ్యం దిగుబడి వస్తాయి. 80 కేజీల ధాన్యం మరపెట్టేందుకు మిల్లరుకు అయ్యే ఖర్చు కేవలం రూ.80మాత్రమే. బస్తాధాన్యం నుంచి వచ్చే ఊక, తవుడు, నూకలు.. విద్యుత్, హామాలీ ఖర్చులకు సరిపోతాయి. ఇక రవాణా చార్జీలు అంటే రైతుల మీద వేస్తారు. ధాన్యం బస్తాలను మిల్లుకు తెచ్చిన సమయంలో అన్లోడింగ్ కూడా రైతులే భరించుకోవాలి. ఈ లెక్క ప్రకారం 80 కేజీల ధాన్యం పెట్టుబడి రూ.1,850, ఇతర ఖర్చులు రూ.100 బస్తాకు వేసుకున్నా మొత్తంరూ.1,950 గిట్టుబాటు అవుతుంది. ధాన్యం మరపెట్టగా బస్తాకు సరాసరి 55కేజీల దిగుబడి వస్తుంది. అంటే బియ్యం విక్రయాల ద్వారా బస్తా ధాన్యానికి రూ.3,200 ఆదాయం వస్తుంది. మిల్లర్లు 70శాతం మేరకు లాభాలు వేసుకుని.. బియ్యం ధరలు పెంచేసి విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు ధాన్యం ధర మాత్రం దయనీయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండిన పంట దాచుకోవడానికి సరైన వసతులు లేవని వాపోతున్నారు. మార్కెట్ కమిటీ ఉన్నా ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
బియ్యం ప్యాకెట్ రూ.1400
సన్నరకాల ధాన్యం ధర తగ్గినా మిల్లర్లు బియ్యం ధర తగ్గించడం లేదు. 26కేజీల బియ్యంబస్తా రూ.1400కు విక్రయిస్తున్నారు. ధాన్యం ధర తక్కువ ఉన్నప్పుడు బియ్యం 26కేజీల ప్యాకెట్లు రూ.1100కు విక్రయించేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు బియ్యం ధర పెరుగుదల ఇబ్బందిగా ఉంది.
- జె.రమణయ్య, ప్రైవేటు కళాశాల అధ్యాపకుడు, నరసన్నపేట
......................
సన్నాలు ధర తగ్గించి కొనుగోలు
గతేడాది సన్నాలు ధర బాగా ఉండటంతో ఈఏడాది సాగు చేశాం. పంట చేతికి వచ్చిన సమయంలో బస్తా రూ.1,850కే కొనుగోలు చేస్తున్నారు. నిల్వ చేసేందుకు గతం మాదిరిగా సదుపాయాలు లేక ఎప్పుడు పంట అప్పుడు మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం గ్రేడ్ -1 ధాన్యం నిల్వచేసేందుకు సదుపాయలు కల్పిస్తే బాగుంటుంది.
- వాగ గోవిందరావు, ల్యాండ్ లార్డ్, జమ్ము