Share News

YS Jagan: నీకో దండం సామీ!

ABN , Publish Date - Aug 10 , 2024 | 03:05 AM

సౌమ్యులు, వివాదరహితులు, పార్టీకి నిబద్ధులుగా పనిచేసినవారు, మృదుస్వభావులుగా పేరున్న నేతలు సైతం వైసీపీని వీడిపోతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం పాలైనా తమ అధినేత జగన్మోహన్‌రెడ్డి తీరులో మార్పు రాకపోవడం.. ఆయన నిరంకుశ వైఖరిని తట్టుకోలేక దండం పెట్టి మరీ వెళ్లిపోతున్నారు...

YS Jagan: నీకో దండం సామీ!

  • జగన్‌ తీరుతో వైసీపీకి ముఖ్య నేతలు టాటా

  • మొన్న ధర్మాన.. నిన్న పెండెం.. నేడు ఆళ్ల

  • అధినేత నిరంకుశ వైఖరిపై అసంతృప్తి

  • ఓటమిపాలైనా ఆయన మారలేదని గుర్రు

  • తమను పట్టించుకోవడం లేదని ఆవేదన

  • ఇలాగైతే జనం లెక్కచేయరని ఆందోళన

  • వైసీపీలో ఉంటే భవిష్యత్‌ ఉండదని ఇంకొందరు

  • కొన్ని చోట్ల పార్టీ కార్యాలయాలు మూత

  • పలు నియోజకవర్గాల్లో చిరుహోటళ్లుగా మార్పు

  • కేంద్ర కార్యాలయమూ తాడేపల్లి నివాసంలోకి..

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సౌమ్యులు, వివాదరహితులు, పార్టీకి నిబద్ధులుగా పనిచేసినవారు, మృదుస్వభావులుగా పేరున్న నేతలు సైతం వైసీపీని వీడిపోతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం పాలైనా తమ అధినేత జగన్మోహన్‌రెడ్డి తీరులో మార్పు రాకపోవడం.. ఆయన నిరంకుశ వైఖరిని తట్టుకోలేక దండం పెట్టి మరీ వెళ్లిపోతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉత్తరాంధ్ర నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మొన్నటికి మొన్న ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాగా.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచే తప్పుకొంటున్నానని మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా రాజకీయ వైరాగ్యంతో వైదొలిగారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులను, ఎమ్మెల్యేలను కలవడానికి కూడా ఇష్టపడని జగన్‌.. ఇప్పుడు ఓటమితో గద్దె దిగిపోయినా మారలేదని.. తమను పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇలాగైతే జనం తమను కూడా పట్టించుకోవడమే మానేస్తారని.. రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు అధికార కూటమి వైపు చూస్తుండగా.. ఇంకొందరు ప్రత్యక్ష రాజకీయాల నుంచే నిష్క్రమిస్తున్నారు. ప్రజాతీర్పును జగన్‌ ఆమోదించకపోవడం.. కొత్త ప్రభుత్వం కుదురుకోకముందే అనవసర విమర్శలు చేయడం.. శవరాజకీయాలు, శాంతిభద్రతలు క్షీణించాయంటూ గగ్గోలు పెడుతుండడం వంటివి చాలామందికి మింగుడుపడడం లేదు. ఆయనిక మారరని అర్థమై.. పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.


అజ్ఞాతంలోకి మాజీలు..

ఎన్నికలకు ముందు టీడీపీ నేతలపై ఒంటికాలితో లేచి వారిని అణచివేయాలని చూసిన పలువురు వైసీపీ నాయకులు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆచూకీ తెలియడం లేదు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే.. తాను రాజకీయాలు వదిలేసి జీవితాంతం ఆయన బూట్లు తుడుస్తూ బతికేస్తానంటూ ప్రకటించిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇప్పుడు బహిరంగంగా కనిపించడమే లేదు. కొందరు నేతలు చంద్రబాబుపై బూతులవర్షం కురిపించారు. ఇంకొందరు ఆయన ఇంటిపైకే దండయాత్ర చేశారు. వీరిలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ ప్రముఖుడు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లినందుకు ఇప్పుడు కేసు నమోదైంది. ఏ క్షణంలోనైనా అరెస్టు తప్పదన్న భయంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. సకలం తానే అన్నట్లుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మీడియా ముందుకు రావడమే మానేశారు.


కూటమి వైపు ద్వితీయ శ్రేణి నాయకత్వం!

ఇక ద్వితీయశ్రేణి నాయకుల్లో పలువురు పాలక కూటమి వైపు చూస్తున్నారు. చాలా మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు. కుప్పంలో వైసీపీ ఖాళీ అయింది. పలువురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. విశాఖకు చెందిన చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల్లో చేరారు. ఫలితంగా తాజాగా జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీలు మొత్తాన్నీ కూటమి కైవసం చేసుకుంది. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏకంగా జగన్‌ తాడేపల్లి నివాసంలోకి మార్చడం విశేషం. మంగళగిరిలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన కార్యాలయాన్ని వదిలేశారు. ఇప్పుడిక్కడ హోటల్‌ నడుస్తోంది.

Updated Date - Aug 10 , 2024 | 07:10 AM