Chandrababu Naidu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ.. వాయిదా వేసిన సుప్రీంకోర్టు..
ABN , Publish Date - Feb 26 , 2024 | 12:36 PM
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. మూడు వారాల తర్వాత పిటిషన్‌పై తదుపరి విచారణ ఉంటుందని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం తెలిపింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. మూడు వారాల తర్వాత పిటిషన్‌పై తదుపరి విచారణ ఉంటుందని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం తెలిపింది. చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. అందుకు సంబంధించిన వివరాలతో ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
"చంద్రబాబు కుటుంబం ఒక డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తోంది. వారు అధికారంలోకి వస్తే అందరిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తోంది. ఈ కేసులో బెయిల్ మంజూరు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులను, దర్యాప్తు సంస్థను బెదిరిస్తున్నారు. వెంటనే బెయిల్ రద్దు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి" అని ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ అన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది. దానికి సమాధానంగా బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నట్లు ముకుల్ రోహత్గి చెప్పారు.
మరోవైపు.. ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి తాము సమాధానం ఇస్తామని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే అన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మూడు వారాల తరువాత తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.