Share News

Vellampalli VS Malladi Vishnu: సొంతవారిని కాదని.. పక్క పార్టీలవైపు చూపులు

ABN , Publish Date - Apr 12 , 2024 | 08:37 AM

సెంట్రల్‌ నియోజకవర్గంలో 21 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 16 డివిజన్లకు వైసీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అన్ని డివిజన్లకు కార్పొరేటర్లతో పాటు కో–ఆర్డినేటర్లు ఉన్నారు. వీరంతా మల్లాది విష్ణు (Malladi Vishnu) మనుషులు కావడంతో వెలంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) వారిపై అపనమ్మకంతో పశ్చిమానికి చెందిన తన సొంత మనుషులను నియమించుకున్నారు.

Vellampalli  VS Malladi Vishnu: సొంతవారిని కాదని.. పక్క పార్టీలవైపు చూపులు

సిటింగ్‌ ఎమ్మెల్యే మల్లాది అనుచరులకు తగ్గిన ప్రాధాన్యం

● స్థానిక వైసీపీ కార్పొరేటర్లు, నేతల నుంచి నిరసన

● ఊరించి ఉసూరుమనిపించారంటూ ఆగ్రహం

● వెలంపల్లి పర్యటనలకు నామమాత్రంగా హాజరు

● అనుచరుడు బుజ్జిబాబుదే హవా అంతా..

● డివిజన్‌ ఇన్‌చార్జులందరూ పశ్చిమవారే..

● సొంతవారిని కాదని.. పక్క పార్టీలవైపు చూపులు

అనుకున్నదొకటి.. అయినదొకటి.. అన్నట్టుగా ఉంది వైసీపీ సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు పరిస్థితి. ఏదో చేద్దామని వస్తే.. అంతా తలకిందులై.. మరేదో జరిగినట్టు ఆయన తెగ సతమతమవు తున్నారు. పొరుగు నుంచి వచ్చి తమపై పెత్తనమేమిటంటూ సెంట్రల్‌లోని వైసీపీ కార్పొరేటర్లు, స్థానిక నేతలు అసలే అగ్గి మీద గుగ్గిలమవుతుంటే.. వారి స్థానే పశ్చిమ నుంచి వచ్చిన తన అనుయాయులకు వెలంపల్లి బాధ్యతలు అప్పగించడం, తాజాగా పేరున్న పక్క పార్టీ నాయకులతో తెరవెనుక మంత్రాంగాలు జరుపుతుండ టంతో మరింత రగిలిపోతున్నారు. వెలంపల్లి పర్యటనలకు కాస్త దూరం పాటిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఇంట గెలవడమేమో కానీ, ఈ రచ్చ గెలిచేసరికి వెలంపల్లికి ముచ్చెమటలు పడుతున్నాయని సొంత పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు.

(విజయవాడ–ఆంధ్రజ్యోతి): సెంట్రల్‌ నియోజకవర్గంలో 21 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 16 డివిజన్లకు వైసీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అన్ని డివిజన్లకు కార్పొరేటర్లతో పాటు కో–ఆర్డినేటర్లు ఉన్నారు. వీరంతా మల్లాది విష్ణు (Malladi Vishnu) మనుషులు కావడంతో వెలంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) వారిపై అపనమ్మకంతో పశ్చిమానికి చెందిన తన సొంత మనుషులను నియమించుకున్నారు. 29వ డివిజన్‌కు ఇన్‌చార్జిగా నియమితుడైన కొండపల్లి బుజ్జి ప్రస్తుతం వెలంపల్లి తరఫున అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు.

డబ్బు పంపిణీ మొదలు డివిజన్లలో వెలంపల్లి పర్యటన సమయంలో డివిజన్‌ కార్పొరేటర్‌కు, స్థానిక నాయకులకు నగదు ముట్టజెప్పడం వంటివన్నీ ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. తొలుత డివిజన్‌ పర్యటనల సమయంలో లక్ష రూపాయల వరకు ఖర్చు చేసిన వెలంపల్లి శిబిరం రానురానూ అందులో కోత పెడుతూ ప్రస్తుతం రూ.10 వేలు చేతిలో పెడుతుండటం స్థానిక నాయకత్వానికి మింగుడుపడటం లేదు. దీంతో వారు వెలంపల్లి పర్యటనల్లో హాజరుకు మాత్రమే పరిమితమవుతున్నారు. కనీసం తమ వెంట పట్టుమని పదిమంది అనుచరగణాన్ని కూడా తీసుకురావడం లేదు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాయకులు సెంట్రల్‌ నియోజకవర్గంలో తిష్టవేసి పెత్తనం చలాయించడాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు.

రగిలిపోతున్న మల్లాది వర్గం

సిటింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్గం అసంతృప్తితో రగలిపోతోంది. వెలంపల్లికి టికెట్‌ ఇచ్చిన వెంటనే విష్ణు పార్టీ మారిపోవాలని భావించారు. అయితే వైసీపీ పెద్దలు బుజ్జగించి ఆయనకు విజయవాడ నగర బాధ్యతలు అప్పగించారు. అయితే, అది ఎలాంటి ఉపయోగం లేని పదవిగా వైసీపీ నాయకులు భావిస్తుంటారు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీచేసి ఓడిపోయిన బొప్పన భవకుమార్‌కు కొంతకాలం ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. ఎప్పుడైతే దేవినేని అవినాశ్‌ వైసీపీలోకి వచ్చారో విజయవాడ నగర పార్టీ బాధ్యతలు అప్పగించారు.

ఉత్సవ విగ్రహంలాంటి ఆ పదవిలో కొంతకాలం కొనసాగిన బొప్పన చివరికి టీడీపీలో చేరారు. మల్లాది విష్ణు సైతం ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నారు. తనకు నగర పార్టీ బాధ్యతలు అప్పగించి చేతులు కట్టేసి కూర్చోబెట్టారన్న భావన విష్ణుతో పాటు ఆయన అనుచరుల్లో ఉంది. దీనికంతటికీ కారణం వెలంపల్లి అని రగిలిపోతున్నారు. దీంతో వారెవరూ మనస్ఫూర్తిగా వెలంపల్లికి పనిచేయడం లేదు. ఆయన సెంట్రల్‌లో పాతుకుపోకుండా చూడాలన్న ఆలోచనతో పలువురు వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. వెలంపల్లి ఇక్కడ తిష్ట వేసుకుంటే తమకు రాజకీయంగా ఎదుగుదల ఉండదన్న ఆలోచనలో వారున్నారు.

ప్రత్యర్థులకు ఎర

జరుగుతున్న పరిణామాలన్నీ వెలంపల్లికి గుక్క తిప్పుకోనివ్వడం లేదు. దీంతో సొంత ఇంటిని చక్కదిద్దుకోవడం కంటే ప్రత్యర్థులకు గేలం వేయడమే బెటర్‌ అన్న నిర్ణయానికి వెలంపల్లి వచ్చినట్టు సమాచారం. టీడీపీలో డివిజన్‌ స్థాయిలో కాస్త బలమున్న నాయకులపై ఆయన దృష్టి సారించారు. వారికి కాసులు ఎరవేసి లోపాయికారిగా తనకు పనిచేసేలా మాట తీసుకుంటున్నారు. ఈ తంతు కూడా సొంత పార్టీ నాయకుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. తమను నమ్మకుండా వేరే నియోజకవర్గం వారిని తమపై పెత్తనం చేయించడం.. ఇతర పార్టీ నాయకులకు డబ్బులు ఇస్తూ తమను పట్టించుకోకపోవడం వారిలో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. మొత్తం మీద సెంట్రల్‌ నియోజకవర్గ వైసీపీలో వెలంపల్లికి సానుకూలాంశాలు ఏమీ కనిపించడం లేదు.

Updated Date - Apr 12 , 2024 | 08:38 AM