AP News: విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ
ABN , Publish Date - Nov 18 , 2024 | 08:38 AM
వాల్తేరు రైల్వే డివిజన్‌లో ఆదివారం కలకలం రేగింది. లంచం తీసుకుంటూ డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్ ముంబైలో సీబీఐ అధికారులకు చిక్కారనే వార్త డివిజన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు నగర వాసుల్లోనూ సంచలనం కలిగింది. డివిజన్ చరిత్రలో డీఆర్‌ఎం స్థాయి అధికారి సీబీఐకి పట్టుబడడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
విశాఖ: రూ. 25 లక్షలు లంచం తీసుకున్న విశాఖ డివిజన్ డీఆర్ఎం (Visakha Division DRM) సౌరబ్ ప్రసాద్ (Saurabh Prasad) అరెస్టు (Arrest)ను సీబీఐ (CBI) అధికారులు ధ్రువీకరించారు. ఆయనతోపాటు మరో ఇద్దరు కాంట్రాక్టర్లు సునీల్ రాథోడ్ 9Sunil Rathod), ఆనంద్ భగత్ (Anand Bhagat)లను అరెస్టు చేశారు. డీఆర్ఎం విశాఖలో ఉన్న ఇంటిని, కార్యాలయం, ముంబై, వడోదరో.. ఇలా మొత్తం 11చోట్ల సీబీఐ సోదాలు చేసింది. సౌరబ్ ఇంటిలో ఇండియన్, ఫారిన్ కరెన్సీ 87.60 లక్షల నగదు, 72 లక్షల విలువ చేసి బంగారు ఆభరణాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ముంబైకు చెందిన డిఎన్ కంపెనీ, పూణేకు చెందిన హెచ్‌ఆర్‌కే సొల్యూషన్స్ ప్రైవేట్ కంపెనీలకు రైల్వే కాంట్రాక్టర్లకు పనులు మంజూరు చేశారు. పనుల్లో జాప్యతకు జరిమానా, 3.17 కోట్లు విలువ చేసే బిల్లుల క్లియరెన్స్‌కు లంచం డిమాండ్ చేశారు. పనులు జాప్యం కారణంగా రైల్వే శాఖ కాంట్రాక్టర్లకు భారీగా జరిమానా విధించింది. కాంట్రాక్టర్లకు విధించిన భారీ జరీమాన తగ్గించేందుకు రూ. 3.17 కోట్ల బిల్లులకు క్లియరెన్స్ ఇవ్వడానికి డిఆర్ఎంతో కాంట్రాక్టర్లు డీల్ కుదుర్చుకున్నారు. జరిమానా తగ్గించేందుకు, బిల్లులు క్లియర్ చేసేందుకు డీఆర్ఎం చెరో కంపెనీ తనకు రూ. 25 లక్షలు లంచంగా ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లతో డీల్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఓ కాంట్రాక్టర్ ముంబైలో డీఆర్ఎంకు రూ. 25 లక్షలు ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పూర్తి వివరాలు..
వాల్తేరు రైల్వే డివిజన్‌లో ఆదివారం కలకలం రేగింది. లంచం తీసుకుంటూ డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్ ముంబైలో సీబీఐ అధికారులకు చిక్కారనే వార్త డివిజన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు నగర వాసుల్లోనూ సంచలనం కలిగింది. డివిజన్ చరిత్రలో డీఆర్‌ఎం స్థాయి అధికారి సీబీఐకి పట్టుబడడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. డీఆర్‌ఎంతో సహా మరో ఇద్దరిని సీబీఐ ఆదివారం రాత్రి అరెస్టు చేసినట్టు ప్రకటించడంతో ఇక్కడి సిబ్బందిలో ఆందోళన నెలకొంది.
నగరంలోని డీఆర్‌ఎం కార్యాలయం, అధికారిక నివాసంతో పాటు ముంబైలో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల వరకు సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో డివిజనల్ అధికారులు, సంబంధిత సిబ్బందిని కూడా వారు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వాల్తేరు డివిజన్ ప్రధాన కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిలో ఆందోళన నెలకొంది. కొందరు సిబ్బంది సెల్‌ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు.
జరిమానా తగ్గింపునకు లంచం డిమాండ్
వాల్తేరు డివిజన్‌లో చేపట్టిన నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంతో డీఆర్‌ఎం ఇద్దరు కాంట్రాక్టర్లకు భారీగా జరిమానా విధించారు. అంతేకాకుండా వారు చేపట్టిన ఇతర పనులకు సంబంధించిన బిల్లులు కూడా నిలిచిపోయాయి. దీంతో వారు డీఆర్‌ఎంను కలిసి, జరిమానా తగ్గించి, బిల్లులు మంజూరు చేయాలని కోరారు. దీంతో ఒక్కొక్కరు రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని డీఆర్‌ఎం కోరారు. ఈ మేరకు ముంబైలో డబ్బు ఇస్తుండగా అప్పటికే అందిన సమాచారంతో సీబీఐ అధికారులు పట్టుకున్నారు.
అసలేంజరిగింది...
గత డీఆర్‌ఎంలతో పోల్చితే సౌరభ్‌ప్రసాద్ వ్యవహారశైలి భిన్నంగా ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. ఇక్కడ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన చాంబర్‌లోకి ఇతరులను పరిమితంగా అనుమతించేవారని, శాఖాధికారులు మినహా ఇతరులు, కాంట్రాక్టర్లను రానివ్వలేదని సమాచారం. తన స్థాయిలో చేయాల్సిన పనులను మినహాయిస్తే మిగిలిన వాటికి సంబంధిత అధికారికి సిఫారసు చేసేవారని తెలిసింది. గత డీఆర్‌ఎం మాదిరిగా సిబ్బందిపై చర్యలు తీసుకోవడం, బదిలీలు చేయడం, అర్హత లేనివారికి సహకరించేవారు కాదంటున్నారు. వివిధ మార్గాల్లో ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించే వారిని కూడా డీఆర్‌ఎం దూరం పెట్టేవారని, కీలక అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకునేవారని సమాచారం. దీంతో కొంతమందిలో వ్యతిరేకత వచ్చిందంటున్నారు. అయితే కొందరికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన నేపథ్యంలో తన అనుచరులతో ఇలాంటి లావాదేవీలు జరిపి ఉంటారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ముషాయిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..
బాబు అరెస్టుకు.. నా స్టేట్‌మెంట్లతో లింకా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News