Share News

చందనోత్సవం టికెట్లు పక్కదారి

ABN , Publish Date - May 09 , 2024 | 02:01 AM

సింహాచలేశుని చందనోత్సవం టికెట్లు చేతులు మారుతున్నాయి.

చందనోత్సవం టికెట్లు పక్కదారి

బ్యాంకుల్లో విక్రయించకుండా దొడ్డిదారిన కేటాయింపులు

ఆన్‌లైన్‌లో అమ్ముతున్నామని కాకి లెక్కలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలేశుని చందనోత్సవం టికెట్లు చేతులు మారుతున్నాయి. దేవస్థానం అధికారులే వాటిని పక్కదోవ పట్టిస్తున్నారు. ఎన్ని టికెట్లు ముద్రించారనే దానిపై రోజుకో మాట చెబుతున్నారు. పైకి ప్రొటోకాల్‌ లేదని చెబుతున్నా...అధికార పార్టీ నాయకులు అంతా ఒక్కొక్కరు 50 చొప్పున రూ.1,500 టికెట్లు కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు తమ అనుచరులను పంపి టికెట్లు తీసుకుంటున్నారు. గత ఏడాదిలాగే ఈసారి కూడా పెద్ద టికెట్లు (రూ.1,500) కలెక్టరేట్‌ నుంచి కొన్ని, ఈఓ కార్యాలయం నుంచి కొన్ని జారీ అవుతున్నాయి. ఆ లెక్కలన్నీ గుట్టుగా ఉంచుతున్నారు. మీడియాకు మాత్రం ఆన్‌లైన్‌లో అమ్ముతున్నామని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎంత ప్రయత్నించినా ఒక్క టికెట్‌ కూడా దొరకడం లేదు. ఒక్కోరోజు ఒక్కో సమయంలో అమ్ముతున్నామని బుకాయిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రూ.1,500 టికెట్లను అధికారులు పక్కాగా వీవీఐపీలు, నాయకులు, పైరవీకారులకే ఇస్తున్నారు. సామాన్యులకు ఇవ్వడం లేదు. సింహాచలం దేవస్థానంలో మహారాజపోషకుల జాబితాలో ఉన్న వారికి కూడా ఈ టికెట్లు ఇవ్వడం లేదు. నగరంలో సుమారుగా ఓ 500 మంది తమకు రూ.1,500 టికెట్లు కావాలని ఈఓకి లేఖలు రాశారు. ఇంకో 24 గంటల్లో చందనోత్సవం ప్రారంభం కానున్నా...ఇప్పటివరకు వారికి ఎవరికీ ఎటువంటి సమాచారం లేదు. జిల్లా అధికారులకు ఏదో ఒక పేరుతో విరాళాలు ఇచ్చిన వారికి మాత్రం ఇప్పటికే అన్ని రకాల టికెట్లు చేరిపోయాయి.

చిన్న టికెట్లు కూడా

వేయి రూపాయల టికెట్లను కూడా పక్కదోవ పట్టిస్తున్నారు. సింహాచలంలోని ఎస్‌బీఐ, యూబీఐ బ్యాంకుల్లో వేయి రూపాయల టికెట్ల విక్రయానికి ఏర్పాట్లు చేశారు. బుధవారం 700 టికెట్లు అమ్మాలని ఆదేశించారు. బ్యాంకు సిబ్బంది విక్రయించేలోపు ఏఈఓ కల్పించుకొని వాటిని పక్కదోవ పట్టించారు. టికెట్లు అయిపోయాయని ప్రకటించారు. గత ఏడాది ఒక ఏఈఓ ఇలా పక్కదోవ పట్టించిన టికెట్లను బ్లాకులో అమ్ముకున్నారు. విచారణ చేసినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. దాంతో దేవస్థానం సిబ్బంది తప్పు చేసినా ఎవరూ ఏమీ చేయరనే ధీమాతో వందలాది టికెట్లను పక్కదోవ పట్టిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో అమ్ముతున్నాం: శ్రీనివాసమూర్తి, ఈఓ

నిజరూప దర్శనం టికెట్లు రూ.1,500 విలువైనవి 5 వేలు ముద్రించాం. వేయి టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించాం. 2,400 టికెట్లు ఈఓ ద్వారా దాతలు, దేవదాయ శాఖకు కేటాయించారు. మరో వేయి టికెట్లు దేవస్థానానికి సేవలు అందిస్తున్న వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు కేటాయించాం. గురువారం కూడా మరో 300 టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించనున్నాం.

విచారణ చేస్తాం: మల్లికార్జున, కలెక్టర్‌

సింహాచలం బ్యాంకుల్లో బుధవారం టికెట్లు విక్రయించకుండా పక్కదోవ పట్టించిన ఏఈఓపై విచారణ చేస్తామని కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు.

Updated Date - May 09 , 2024 | 07:45 AM