Share News

ఈసీ నిబంధనలు పక్కాగా అమలు చేయాలి

ABN , Publish Date - May 09 , 2024 | 01:20 AM

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అరకులోయ పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకుడు(సాధారణ)ప్రమోద్‌కుమార్‌ మెహర్డ సూచించారు.

ఈసీ నిబంధనలు పక్కాగా అమలు చేయాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ విజయసునీత, ఎస్‌పీ తుహిన్‌సిన్హా, ఆర్వోలు

- పార్లమెంట్‌ స్థానం పరిశీలకుడు(సాధారణ) ప్రమోద్‌కుమార్‌ మెహర్డ

పాడేరు, మే 8(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అరకులోయ పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకుడు(సాధారణ)ప్రమోద్‌కుమార్‌ మెహర్డ సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, సాలూరు, కురుపాం, పాలకొండ పాడేరు, అరకులోయ, రంపచోడవరం, పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, రాజకీయ పార్టీల అభ్యర్థులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్ల సహకారంతో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తయినందున బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్ల నంబర్లను సరిచూసుకోవాలని ఆయన సూచించారు. శాంతిభద్రతలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అతిక్రమించిన వారిపై తగిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఆర్థిక లావాదేవీలను బ్యాంక్‌ చెక్కులు, ఆర్‌టీజీఎస్‌ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎక్కడైనా ఘర్షణలు జరిగితే పోలీసులకు తక్షణమే సమాచారం అందించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాలకు సకాలంలో ఈవీఎంలు, పోలింగ్‌ సిబ్బంది తరలింపునకు పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయసునీత మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలను వేరే ప్రాంతాలకు తరలించిన గ్రామాల్లోని ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. జిల్లా ఎస్‌పీ తుహిన్‌ సిన్హా మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టామని ఎస్‌పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల రిటర్నింగ్‌ అధికారులు భావనా వశిష్ఠ, వి.అభిషేక్‌, జిల్లా రెవెన్యూ అధికారి బి.పద్మావతి, సీపీఎం ఎంపీ అభ్యర్థి పి.అప్పలనర్స, భారత్‌ ఆదివాసీ పార్టీ అభ్యర్థి ఎం.రాజబాబు, స్వతంత్ర అభ్యర్థి ఎస్‌.బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:20 AM