Share News

ఉత్సాహంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

ABN , Publish Date - May 09 , 2024 | 01:17 AM

సార్వత్రిక ఎన్నికల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగింది. గురువారం కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేసే అవకాశం ఎన్నికల కమిషన్‌ కల్పించింది. జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ స్థానాల పరిధిలో మొత్తం 9,188 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు.

ఉత్సాహంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌
పాడేరులో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు

- అధిక సంఖ్యలో ఓట్లేసిన ప్రభుత్వ ఉద్యోగులు

- కనిపించిన ప్రభుత్వంపై వ్యతిరేకత

- జిల్లా వ్యాప్తంగా 9,188 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలింగ్‌

- నేడు ఓటు వేసే అవకాశం

పాడేరు, మే 8(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగింది. గురువారం కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేసే అవకాశం ఎన్నికల కమిషన్‌ కల్పించింది. జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ స్థానాల పరిధిలో మొత్తం 9,188 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. వారిలో 8,952 మంది మూడు నియోజకవర్గాలకు చెందినవారు కాగా, 236 మంది వివిధ జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులున్నారు. గతానికి భిన్నంగా ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. గతంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌పై ప్రభుత్వ ఉద్యోగులు పెద్దగా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. అలాగే ఎలక్షన్‌ కమిషన్‌ సైతం పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. ఈసారి ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్‌ సూచించడంతోపాటు అందుకు అవసరమైన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించింది. దీంతో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం ఊహించని విధంగా పెరిగింది. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు అవసరమైన ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయడంతోపాటు అర్హత కలిగిన ఉద్యోగులు రాష్ట్రంలో ఏ జిల్లాలో వారైన తాము పని చేస్తున్న ప్రాంతం నుంచే ఓటింగ్‌ చేసే అవకాశం కల్పించారు. దీంతో మన్యంలో పని చేస్తున్న ఇతర జిల్లాలకు చెందిన 236 మంది ఉద్యోగులు సైతం తమ ఓటును వినియోగించుకున్నారు.

ప్రభుత్వంపై కసితో ఓట్లేసిన ప్రభుత్వ ఉద్యోగులు

వైసీపీ ప్రభుత్వంపై కసితో ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేశారు. ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం మేలు చేయకపోగా అనేక ఇబ్బందులను గురిచేయడంతో అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు కసి, ఆవేదనతో ఉన్నారు. ఈక్రమంలో తమ ఓటుతోనే ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. జీతాలు మొదలుకుని డీఏలు, ఇతర రాయితీలు, ఫిట్‌మెంట్‌, పీఆర్‌సీ, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాలు పొందడంలో సైతం తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదనతో చెబుతున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశం ఇవ్వకపోగా, పోలీసులతో కేసులు పెట్టించడం, గృహ నిర్బంధాలు, మెమోలు, సస్పెన్షన్లతో బెదిరింపులకు పాల్పడ్డారని ఉద్యోగులు వివరిస్తున్నారు. అన్నివిధాలా తమను ఇబ్బందులకు గురి చేసిన ఈ ప్రభుత్వానికి ఓట్లు వేయబోమని ఉద్యోగులు బహిరంగంగానే చెబుతున్నారు. తమకున్న అవకాశం మేరకు ప్రభుత్వ వ్యతిరేక పార్టీలకే ఓట్లేస్తామని అంటున్నారు. ఇదే కసితో దూర ప్రాంతాల నుంచి సైతం సొంతంగా వాహనాలను అద్దెకు తీసుకుని మరీ పాడేరు వచ్చి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను వేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద పటిష్ఠ పోలీసు బందోస్తును ఏర్పాటు చేశారు.

------------------

జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ వివరాలు

వ. సం. అసెంబ్లీ స్థానం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

1. పాడేరు 2,882

2. అరకులోయ 2,840

3. రంపచోడవరం 3,466

----------------------------------------------------------------------

మొత్తం 9,188

----------------------------------------------------------------------

Updated Date - May 09 , 2024 | 01:17 AM