Share News

టీడీఆర్‌ల జారీపై విచారణ

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:55 AM

వైసీపీ హయాంలో టీడీఆర్‌ల జారీ పేరిట జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది.

టీడీఆర్‌ల జారీపై  విచారణ

పురపాలక శాఖా మంత్రి ప్రకటన

వైసీపీ హయాంలో ఇష్టారాజ్యం

ఆ పార్టీ నేతలకు వందల కోట్ల రూపాయల విలువైన బాండ్లు

జీవీఎంసీ అధికారుల సహకారం

విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ హయాంలో టీడీఆర్‌ల జారీ పేరిట జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో పలు పట్ణణాలు, నగరాల్లో టీడీఆర్‌ బాండ్ల జారీ పేరిట ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించారన్న ఫిర్యాదులపై విచారణ జరపాలని నిర్ణయించింది. అసెంబ్లీలో గురువారం గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టీడీఆర్‌ల జారీపై ప్రస్తావించడంతో మంత్రి నారాయణ స్పందించారు. విశాఖపట్నంతో పాటు తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో టీడీఆర్‌ల జారీపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గుతేలుస్తామన్నారు.

నగరంలోని సిరిపురం జంక్షన్‌లోని సీబీసీఎన్‌సీ స్థలంలో కొంత భూమి భవిష్యత్తులో రోడ్డు విస్తరణలో పోతుందని రూ.65 కోట్లు టీడీఆర్‌ను మాజీ ఎంపీకి చెందిన సంస్థకు జీవీఎంసీ పాలకులు జారీచేశారు. అలాగే బక్కన్నపాలెంలో పదిహేనేళ్ల కిందట నిర్మించిన రోడ్డులో రెండెకరాలు పోయిందంటూ ఒక వ్యక్తి దరఖాస్తు చేయగా...రూ.208 కోట్ల విలువైన టీడీఆర్‌ను జారీచేశారు. ఇవికాకుండా వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. అయితే ప్రభుత్వం మారిన నేపథ్యంలో నగరంలో టీడీఆర్‌ బాండ్ల జారీలో అక్రమాలను వెలుగులోకి తేవాలని టీడీపీ ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీలో ప్రస్తావించగా మునిసిపల్‌ మంత్రి నారాయణ స్పందించారు. ఈ వ్యవహారంపై శుక్రవారం రాత్రి పల్లా శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ విశాఖలో టీడీఆర్‌ కుంభకోణం మొత్తం బయటకు తీస్తామన్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకునేలా విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోందని ఆశాభావం వ్యక్తంచేశారు.

రూ.222.43 కోట్లతో

పోర్టు ఆస్పత్రి అభివృద్ధి

పీపీపీ పద్ధతిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్పు

కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌

విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం పోర్టు ఆస్పత్రిని రూ.222.43 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్‌ లోక్‌సభలో శుక్రవారం ప్రకటించారు. కైలాసపురంలో 80 పడకలతో నడుస్తున్న పోర్టు ఆస్పత్రిని పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యంతో 300 పడకల మల్టీ డిసిప్లినరీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చనున్నట్టు వివరించారు. పోర్టు ఉద్యోగుల వైద్యం ఖర్చును తగ్గించడానికి ఈ ప్రతిపాదన చేశామన్నారు. అదొక్కటే కాకుండా వైద్య, అనుబంధ రంగాల్లో పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఇది దోహదపడుతుందన్నారు.

పని వేళల్లో

మీటింగ్‌లు వద్దు

తక్షణమే చెక్‌ పెట్టండి

స్టీల్‌ప్లాంటు సీఎండీకి ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశం

ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని ఆందోళన

యు-పాస్‌లు రద్దు చేయాలని ఆదేశాలు

ప్లాంటులో రిటైర్డ్‌ ఉద్యోగి మంత్రి రాజశేఖర్‌ సమావేశాలపై ఆరా

విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో కార్మికుల పని గంటలు వృథా అవుతున్నాయని, తక్షణమే దీనికి చెక్‌ పెట్టాలని సీఎండీ అతుల్‌భట్‌ను కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నాలుగు రోజుల క్రితం దీనిపై ఓ లేఖ పంపి, వివరణ కోరింది. రిటైరైన మంత్రి రాజశేఖర్‌ రోజూ ప్లాంటుకు వస్తూ ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు కార్మికులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, అందులో 50 మంది వరకూ పాల్గొంటున్నారని, ప్లాంటు పనివేళల్లో డ్యూటీ వదిలేసి వారంతా మీటింగ్‌లకు వెళ్లడం ఉత్పత్తి తగ్గిపోతున్నదని, తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఇకపై ఇలాంటివి కొనసాగడానికి వీల్లేదని స్పష్టంచేసింది. అలాగే కొంతమంది యూనియన్‌ నాయకులకు పర్సనల్‌ డిపార్టుమెంట్‌ ‘యు-పాస్‌లు’ జారీచేసిందని, వారంతా ఉదయం డ్యూటీకి వచ్చి హాజరు వేసుకొని వెళ్లిపోతున్నారని, తిరిగి సాయంత్రం వచ్చి బయోమెట్రిక్‌ వేస్తున్నారని, వారు పనిచేయకపోయినా జీతాలు అందుతున్నాయని పేర్కొంది. సుమారు 120 మందికి ఇలాంటి పాస్‌లు ఇచ్చారని తెలిపింది. వాటిని కొందరు ఉద్యోగులకు విక్రయించుకుంటున్నారని, వాటి ద్వారా విధులకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని పేర్కొంది. వీరి వల్ల ప్లాంటులో ఉత్పత్తి తగ్గిపోతున్నదని ఆరోపించింది. ఎక్కడా లేనివి పాటిస్తూ ప్లాంటుకు నష్టం కలిగిస్తున్నారని, తక్షణమే వీటిని నిలుపుచేసి కార్మికులు, ఉద్యోగుల డ్యూటీ సమయంలో ప్లాంటు దాటి బయటకు వెళ్లకుండా, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వీటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని ఉక్కు మంత్రిత్వ శాఖ కోరింది. ఈ ఉత్తర్వులపై కార్మిక సంఘాల్లో తర్జనభర్జన మొదలైంది. అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా?...అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇటీవల పర్సనల్‌ డైరెక్టర్‌ తన పదవికి రాజీనామా చేయడానికి ఇవి కూడా కొంత కారణమని ప్లాంటు వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jul 27 , 2024 | 12:55 AM