మసాజ్ సెంటర్లలో తనిఖీలు
ABN , Publish Date - Oct 02 , 2024 | 01:12 AM
నగరంలోని మసాజ్ సెంటర్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో సీపీ శంఖబ్రతబాగ్చి ఆదేశాల మేరకు పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
విశాఖపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని మసాజ్ సెంటర్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో సీపీ శంఖబ్రతబాగ్చి ఆదేశాల మేరకు పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు 200 మంది బృందాలుగా విడిపోయి నగరంలోని 83 స్పా/మసాజ్ సెంటర్లలో తనిఖీలకు ఉపక్రమించారు. అయితే వాటిలో 31 మాత్రమే తెరిచి ఉండగా, 52 కేంద్రాలు మూసివున్నాయి. తనిఖీ చేసిన వాటిల్లో రెండింటికి లేబర్ సర్టిఫికెట్ లేదని, 25 కేంద్రాలకు ఫైర్ ఎన్‌ఓసీ లేదని, పది స్పా/మసాజ్ కేంద్రాలకు ట్రేడ్ లైసెన్స్ లేదని, 18 సెంటర్లకు జీఎస్‌టీ సర్టిఫికెట్ లేదని, ఒక కేంద్రంలో సీసీ కెమెరాలు లేవని పోలీసుల తనిఖీల్లో తేలింది. అలాగే ఒక కేంద్రంలో నలుగురు విదేశీ యువతులు పనిచేస్తుండగా, మరొకచోట పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతి ఉన్నట్టు గుర్తించారు. మూడు స్పా/మసాజ్ కేంద్రాల్లోని గదుల్లో తలుపులకు గడియ ఉన్నట్టు గుర్తించారు. దీనిపై నివేదిక తయారుచేసి జీవీఎంసీతోపాటు అగ్నిమాపక శాఖ, జీఎస్టీ అధికారులకు పంపిస్తామని సీపీ ఒక ప్రకటనలో తెలిపారు. స్పా/మసాజ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నట్టయితే 7995095799 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
పింఛన్లు పంపిణీ 97.39 శాతం పూర్తి
విశాఖపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని మంగళవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగించారు. పింఛనుదారుల్లో 97.39 శాతం మందికి సొమ్ము అందజేశారు. బుధవారం...గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో మిగిలిన వారికి మూడో తేదీ అంటే గురువారం అందజేయడానికి ఏర్పాట్లు చేశారు. అక్టోబరుకు సంబంధించి జిల్లాలో 1,62,490 మందికి రూ.69,81,00,500 పంపిణీ చేయాల్సి ఉండగా, వారిలో 1,58,244 మందికి రూ.67,96,43,000 అందించారు.