Share News

పరిశ్రమలపై జగన్నాటకం!!

ABN , Publish Date - May 09 , 2024 | 02:05 AM

విశాఖ చరిత్రలో అతి పెద్ద ప్రమాదం అది! గోపాలపట్నం సమీపాన ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి స్టైరిన్‌ విష వాయువులు విడుదలై 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

పరిశ్రమలపై జగన్నాటకం!!

ప్రజలకు, కంపెనీలకు ఐదేళ్లూ కాళరాత్రే

ఎల్జీ ప్రమాదంలో 12మంది దుర్మరణం

ఆ కంపెనీపై విశాఖలో తీవ్ర ప్రజాగ్రహం

దీంతో దేశం వదిలిపోవాలనుకున్న ఎల్జీ

కానీ, యాజమాన్యానికి జగన్‌ మద్దతు

శ్రీసిటీలో కొత్త ప్లాంటు నడిపేందుకు సమ్మతి

ఆ తరువాత ఏమైందో ఎల్జీపై తేల్చని వైనం

నాలుగేళ్లయినా చార్జిషీట్‌ పెట్టని పోలీసులు

కేసు ముగిస్తే తప్ప ఆ సంస్థ కదలలేని పరిస్థితి

కావాలనే అడ్డంకులు..ఎక్కడో డీల్‌ చెడిందని సమాచారం!

టీడీపీ హయాంలో జింక్‌ భూముల అభివృద్ధికి ఎంఓయూ

వైసీపీ వచ్చాక డీల్‌ కుదరక పెండింగ్‌లో ఆ ఫైల్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ చరిత్రలో అతి పెద్ద ప్రమాదం అది! గోపాలపట్నం సమీపాన ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి స్టైరిన్‌ విష వాయువులు విడుదలై 12 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది అస్వస్థతకు గురయ్యారు. ప్రాణభయంతో చీకట్లో పారిపోతూ కాలువల్లో పడి చనిపోయినవారూ ఉన్నారు. అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆ కంపెనీపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమైంది. కానీ, యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్‌ అండగా నిలిచారు. బాధితులను మరోసారి గాయపరిచేలా వ్యవహరించారు. అంతమాత్రమే కాదు, చివరకు ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీతోనూ జగన్నాటకం ఆడిన తీరు విశాఖలో చర్చనీయాంశంగా మారింది.

విశాఖపట్నంలో పరిశ్రమల వ్యవహారంలో తెర వెనుక ‘జగన్నాటకం’ నడిచింది. లొసుగులను అడ్డం పెట్టుకొని యాజమాన్యాల నుంచి భారీగా లబ్ధి పొందేందుకు పాలకులు ప్రయత్నిస్తూ వచ్చారు. అందినంత దండుకొని...ఆఖరి నిమిషంలో వారికి సహకారం అందించకుండా ముప్పుతిప్పలు పెట్టారు. నాలుగేళ్ల క్రితం విష వాయువులు వెదజల్లి 12 మందిని పొట్టబెట్టుకున్న ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ విశాఖపట్నం నుంచి వెళ్లిపోతామన్నా వెళ్లకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ ఘోరం జరిగినప్పుడు యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్‌ అండగా నిలిచారు. చనిపోయినవారికి కోటి రూపాయల చొప్పున, అస్వస్థతకు గురైనవారికి రూ.25 వేలు, ఐదు గ్రామాల్లో ప్రతి వ్యక్తికి రూ.10 వేలు చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. కానీ, అస్వస్థతకు గురైన చాలామందికి సాయం అందలేదు. ఇక ఈ విషవాయువుల ప్రభావం జీవితాంతం ఆ గ్రామాల ప్రజలపై ఉంటుందని నిపుణులు చెప్పగా, వారి కోసం అక్కడే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని వైసీపీ పాలకులు ప్రకటించారు. బాధిత గ్రామాల ప్రజలకు హెల్త్‌ కార్డులు ఇచ్చి, జీవితాంతం వారికి ఉచితంగా వైద్యం చేస్తామని చెప్పారు. కానీ ఆస్పత్రి కట్టలేదు. వారికి చికిత్సా అందించలేదు. ప్రమాదం జరిగిన నెలలోనే మరో ముగ్గురు చనిపోతే వారికి పరిహారమూ ఇవ్వలేదు. ఆ సంస్థలో రూ.100 కోట్ల విలువైన స్టైరిన్‌ ఉంటే...దానికి రక్షణ కల్పించి, విశాఖపట్నం నుంచి సముద్ర మార్గం గుండా నౌకలో సింగపూర్‌ తీసుకొని వెళ్లేందుకు జగన్‌ ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎల్జీ పాలిమర్స్‌ ఎండీ, సీఈఈ, మరో ఇద్దరు డైరెక్టర్లను అరెస్టు చేయగా, విదే శీయులైన వారు త్వరగా బయటకు వచ్చి, స్వదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రభుత్వ పెద్దలు సహకరించారు. ఎల్జీ పాలిమర్స్‌ మళ్లీ ఇక్కడ కార్యకలాపాలు జరపకూడదని స్థానికులు ఆందోళన చేస్తే...ఈ పరిశ్రమను శ్రీసిటీలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. విశాఖ ప్రజలు ఎల్జీ పాలిమర్స్‌ పీడ వదిలిపోయిందని ఊపిరి పీల్చుకుంటే...దానికి ఆఖరి నిమిషంలో అడ్డంకులు సృష్టించారు. వారితో డీల్‌ ఎక్కడ చెడిందో తెలియదు గానీ ఈ కేసుపై ఇప్పటివరకూ పోలీసులు చార్జిషీట్‌ ఫైల్‌ చేయలేదు. కోర్టులో నడుస్తున్న ఈ కేసు ముగిస్తే తప్ప...ఆ సంస్థ ఇక్కడి నుంచి శ్రీసిటీకి తరలి వెళ్లలేదు. ప్రమాదం జరిగిన మొదటిరోజు నుంచి ఇప్పటివరకు ఈ సంస్థకు సంబంధించిన అన్ని నిర్ణయాలు సీఎంవో ఆదేశాల మేరకే జరిగాయి. అక్కడి నుంచి సరైన ఆదేశం అందకే చార్జిషీట్‌ వేయలేదని, ఇది కావాలనే చేసిందేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు చార్జిషీట్‌ వేస్తే...కేసు ముగిసిపోయి ఆ సంస్థ ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోతుంది. విశాఖ ప్రజలకు బాధ తప్పుతుంది. కానీ జగన్‌ నిర్ణయం కారణంగా దానికి అడ్డంకులు ఏర్పడ్డాయి.

జింక్‌ భూముల అభివృద్ధికి విఘాతం

విశాఖపట్నంలో హిందూస్థాన్‌ జింక్‌ సంస్థ కొన్ని దశాబ్దాల క్రితం మూతపడింది. అందులో వాటాలన్నీ చేతులు మారాయి. వేదాంత కంపెనీ అందులో అధిక వాటా దక్కించుకుంది. మింది, చుక్కవానిపాలెం తదితర ప్రాంతాల్లో సుమారుగా 350 ఎకరాల భూములను అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం హయాంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఎంవోయూ చేసుకుంది. ఆ తరువాత రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా మార్చేసి అమ్మకానికి పెట్టింది. అందులో కన్వెన్షన్‌ సెంటర్లు, స్టార్‌ హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టింది. ఆ భూముల విలువ రూ.3,500 కోట్లు. ఆ సంస్థ ప్రతిపాదనలకు అనుమతులు ఇచ్చి ఉంటే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించేవి. కానీ జగన్‌ ప్రభుత్వంతో సరైన డీల్‌ కుదరకపోవడంతో వారికి అనుమతులు రాలేదు. దాంతో ఆయా ప్రాంతాల యువతకు ఉపాధి లేకుండా పోయింది.

Updated Date - May 09 , 2024 | 02:05 AM