Share News

భారీగా ఉద్యోగుల ఓటింగ్‌

ABN , Publish Date - May 09 , 2024 | 02:10 AM

జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ఉద్యోగులు భారీగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

భారీగా ఉద్యోగుల ఓటింగ్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నవారు 15,450 మంది

ఇక్కడ పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటు ఉన్నవారు మరో 5,005 మంది

విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ఉద్యోగులు భారీగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం ఏయూలో ఏర్పాటుచేసిన రెండు పోలింగ్‌ కేంద్రాల్లో 3,722 మంది ఓటేశారు. దీంతో గడచిన నాలుగు రోజుల్లో 15,450 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టయ్యింది. ఇక్కడ పనిచేస్తూ...ఇతర జిల్లాల్లో ఓటు ఉన్న ఉద్యోగులు 5,005 మంది ఓటేశారు. జిల్లాలో పనిచేస్తూ ఇక్కడే ఓటు ఉన్న 13,076 మందిని తొలుత ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారు. వీరందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు ఫారం-12 జారీచేశారు. ఈనెల ఐదో తేదీ నుంచి ఏయూ ఉన్నత పాఠశాలల్లో బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. అయితే జిల్లాలో మరో 2,374 మందిని తరువాత ఎన్నికల విధుల్లోకి తీసుకోవడంతో ఆలస్యంగా ఆర్డర్లు ఇచ్చారు. ఈలోగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభం కావడంతో ఆలస్యంగా ఎన్నికల ఆర్డర్లు తీసుకున్న ఉద్యోగులు పోలింగ్‌ కేంద్రాలకు రాగా...అప్పటికప్పుడు ఫారం 12 జారీచేశారు. దీంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేసిన వారి సంఖ్య 15,450కు పెరిగింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న వారి వివరాలు చూస్తే...భీమిలి నియోజకవర్గంలో 2,366 మంది, విశాఖ తూర్పులో 2,716, దక్షిణంలో 1,429, ఉత్తరంలో 2,307, పశ్చిమలో 1,421, గాజువాకలో 2,401, పెందుర్తిలో 2,810 మంది ఉన్నారు. కాగా బుధవారంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ ముగిసింది. అయితే అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి గురువారం ఆయా ఆర్వో కార్యాలయాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు.

1,428 మంది హోమ్‌ ఓటింగ్‌

వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించే ప్రక్రియ బుధవారం కొనసాగింది. బుధవారం సుమారు 450 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గడచిన రెండు రోజుల్లో కలిపి 1,428 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. గురువారం కూడా హోమ్‌ ఓటింగ్‌ కొనసాగుతుంది.

Updated Date - May 09 , 2024 | 02:10 AM