Share News

గర్భిణుల నిలిచిన వైద్య సేవలు

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:56 AM

చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు వైద్య సేవలు అందడం లేదు. ఆస్పత్రిలో పేరుకు ముగ్గురు స్త్రీ వైద్యనిపుణులు ఉన్నప్పటికీ ఒక్కరూ అందుబాటులో లేరు. ఒకరు చైల్డ్‌ కేర్‌ సెలవుపై వెళ్లగా.. మరో ఇద్దరు పాడేరు జిల్లా ఆస్పత్రిలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఈ కారణంగా ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు అలా్ట్ర సౌండ్‌ స్కానింగ్‌, నెల వారి ఆరోగ్య తనిఖీలు నిలిచిపోయాయి.

గర్భిణుల నిలిచిన వైద్య సేవలు
చికిత్స కోసం నిరీక్షిస్తున్న గర్భిణులు

అందుబాటులో లేని స్త్రీ వైద్య నిపుణులు

ఏరియా ఆస్పత్రిలో పేరుకు ముగ్గురు వైద్యులు

ఒకరు చైల్డ్‌ కేర్‌ సెలవు, మరో ఇద్దరు డిప్యూటేషన్‌

నిలిచిన అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌, ఆరోగ్య తనిఖీలు

ప్రసవం కష్టమైతే నర్సీపట్నం తరలింపు

పట్టించుకోని అధికారులు

చింతపల్లి, జూలై 26: చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు వైద్య సేవలు అందడం లేదు. ఆస్పత్రిలో పేరుకు ముగ్గురు స్త్రీ వైద్యనిపుణులు ఉన్నప్పటికీ ఒక్కరూ అందుబాటులో లేరు. ఒకరు చైల్డ్‌ కేర్‌ సెలవుపై వెళ్లగా.. మరో ఇద్దరు పాడేరు జిల్లా ఆస్పత్రిలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఈ కారణంగా ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు అలా్ట్ర సౌండ్‌ స్కానింగ్‌, నెల వారి ఆరోగ్య తనిఖీలు నిలిచిపోయాయి.

స్థానిక ఏరియా ఆస్పత్రికి చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలు చికిత్స కోసం వస్తుంటారు. గర్భిణులను ప్రసవం కోసం ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. దీంతో పాటు ప్రతి రోజు 50 నుంచి 100 మంది గర్భిణులు ఆరోగ్య తనిఖీలకు వస్తున్నారు. అలాగే శివారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన సీలేరు, ధారకొండ, పెదవలస, జీకేవీధి, కోరుకొండ, తాజంగితో పాటు ఇతర పీహెచ్‌సీల నుంచి గర్భిణులు అలా్ట్ర సౌండ్‌ స్కానింగ్‌ కోసం ఇక్కడకు వస్తున్నారు. ప్రతి నెల 9, 10 తేదీల్లో ప్రధాన మంత్రి సురక్షిత మంత్రిత్వ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రిలో గర్భిణులకు ఆరోగ్య తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఏరియా ఆస్పత్రిలో కొంత కాలంగా కేవలం ఒకే ఒక్క స్త్రీ వైద్యనిపుణురాలు అందుబాటులో ఉండడంతో పని భారం పెరిగిపోతున్నది. ప్రస్తుతం ఆమె కూడా సెలవుపై వెళ్లిపోవడంతో గర్భిణులకు వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

పేరుకు ముగ్గురు స్త్రీ వైద్యనిపుణులు..

ఏరియా ఆస్పత్రిలో అధికారికంగా ముగ్గురు స్త్రీ వైద్యనిపుణులు ఉన్నారు. సివిల్‌ సర్జన్‌ సుధాశారద ఒక్కరు మాత్రమే ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె కూడా చైల్డ్‌ కేర్‌ సెలవుపై వెళ్లారు. ఇక్కడ ఉండాల్సిన మరో ఇద్దరు స్త్రీ వైద్యనిపుణులు శ్రీలత, ప్రవీణలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులతో పైరవీలు చేసుకొని పాడేరు జిల్లా ఆస్పత్రికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. ప్రస్తుతం వారు జిల్లా ఆస్పత్రి నుంచి ఇక్కడ ఏరియా ఆస్పత్రికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇక్కడ స్త్రీ వైద్యనిపుణులు అందుబాటులో లేకపోయినా వైద్య విధాన పరిషత్‌, జిల్లా అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు.

గర్భిణులకు తప్పని ప్రసవ వేదన..

ప్రసవం కష్టమైతే గర్భిణులకు వేదన తప్పడం లేదు. చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో కేవలం సహజ ప్రసవాలు మాత్రమే జరుగుతున్నాయి. సిజేరియన్‌ అవసరమైతే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూనే 50 కిలోమీటర్లు వాహనంలో ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో గర్భిణులను అంబులెన్స్‌లో నర్సీప్నటం తరలిస్తుండగా మార్గ మధ్యలో తల్లి, శిశువు మరణించిన సందర్భాలు ఉన్నాయి.

నిలిచిపోయిన సిజేరియన్‌లు

చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో కొన్ని నెలలుగా సిజేరియన్‌లు నిలిచిపోయాయి. ఆస్పత్రిలో కేవలం ఒక స్త్రీ వైద్యనిపుణులు ఒక్కరే విధుల్లో ఉండడం, అనస్థీషియా(మత్తు) వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడంతో సిజేరియన్‌లు జరగడం లేదు. ఆస్పత్రిలో పేరుకు ఇద్దరు అనస్థీషియా వైద్యులు ఉన్నప్పటికీ కొన్ని నెలలుగా ఇద్దరూ విధులకు గైర్హాజరవుతున్నారు. ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదు. అలాగని కొత్తవారిని నియమించడం లేదు.

Updated Date - Jul 27 , 2024 | 12:56 AM