Share News

జన జీవనం అస్తవ్యస్తం

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:00 AM

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు గిరిజన ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులు పైబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గిరిజనులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచాయి. అధిక సంఖ్యలో గిరిజనులు ఇళ్లకే పరిమతమయ్యారు. ఏజెన్సీలో వారపు సంతలు జరగకపోవడంతో గిరిజనులు నిత్యావసర సరకులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈదురుగాలులకు చెట్లు పడిపోతుండడంతో విద్యుత్‌ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతున్నది.

జన జీవనం అస్తవ్యస్తం
పెదబయలు మండలం జామిగెడ్డ గెడ్డను దాటేందుకు ఆనప డిప్పలు కట్టుకుంటున్న గిరిజనులు

వరదలతో మన్యం వాసుల అవస్థలు

వారం రోజులు పైబడి ముంచెత్తుతున్న వర్షం

ఈదురుగాలులతో కూలుతున్న చెట్లు,

తెగుతున్న విద్యుత్‌ తీగలు

ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు,

కొట్టుకుపోతున్న రోడ్లు

రాకపోకలకు గిరిజనుల తిప్పలు

మన్యంలో జరగని వారపు సంతలు

నిత్యావసర సరకులకు ఇక్కట్లు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు గిరిజన ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులు పైబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గిరిజనులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచాయి. అధిక సంఖ్యలో గిరిజనులు ఇళ్లకే పరిమతమయ్యారు. ఏజెన్సీలో వారపు సంతలు జరగకపోవడంతో గిరిజనులు నిత్యావసర సరకులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈదురుగాలులకు చెట్లు పడిపోతుండడంతో విద్యుత్‌ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతున్నది.

జిల్లాలో వెయ్యికి పైబడి ఇళ్లు ధ్వంసం

జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలకు వెయ్యికి పై బడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రధానంగా వారం పైబడి వర్షం కొనసాగుతుండడంతో గోడలు నానిపోయి ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. దీంతో అనేక మంది తాత్కాలిక నివాసాల్లో, పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ముఖ్యంగా చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిల్లో ఈ సమస్య అధికంగా ఉండగా, పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఒక మోస్తరుగా ఉంది. శుక్రవారం పాడేరు మండలం డి.గొందూరు పంచాయతీ మర్రిపాలెం గ్రామంలో ముక్తమ్మ అనేగిరిజన మహిళ ఇల్లు కూలిపోయింది. అయితే ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగనప్పటికీ ఆ గిరిజన కుటుంబం తలదాచుకునేందుకు గూడు లేకుండా పోయింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా ఘటనలున్నాయి.

పొంగుతున్న గెడ్డలతో జనం అవస్థలు

జిల్లాలో వరదల ప్రభావంతో పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 11 మండలాల్లో గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికీ వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో గెడ్డలు ఉధృతంగా ఉన్నాయి. ముఖ్యంగా ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, డుంబ్రిగుడ మండలాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. గెడ్డలు ఉధృతంగా ప్రవహించడంతో అవతల ఉన్న గిరిజనులు వారం రోజులుగా ఊళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో పెదబయలు మండలం జామిగుడ గెడ్డను దాటేందుకు గిరిజనులు ఆనపకాయ డిప్పలను మొలకు కట్టుకుని గెడ్డను దాటుకుంటూ వెళుతున్నారు. ఇదే విధానాన్ని ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం. బుంగాపుట్టు పంచాయతీలకు చెందిన గిరిజనులు అనుసరిస్తున్నారు. పదుల సంఖ్యలో గిరిజన పల్లెలకు చెందిన గిరిజనులు గెడ్డల సమస్య కారణంగా ఇళ్లలోనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా వరదల కారణంగా మారుమూల ప్రాంతాల్లోని రోడ్లు సైతం ధ్వంసమయ్యాయి. చిన్నచిన్న కాజ్‌వేలు, కల్వర్టులు సైతం దెబ్బతింటున్నాయి. వర్షాలు కొనసాగడం, రోడ్లు పాడవడం వంటి ఘటనలతో ఏజెన్సీలో వారపు సంతలు సరిగా జరగని పరిస్థితి కొనసాగుతున్నది. వాస్తవానికి గిరిజనులకు వారపు సంతలు ఎంతో ప్రధానం. వారి అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకోవడం, అదే క్రమంలో వారికి అవసరమైన నిత్యావసర సరకులను కొనుగోలు చేసుకోవడం వంటి ముఖ్యమైన క్రయవిక్రయాలు సంతలోనే జరుగుతాయి. అవన్నీ ప్రస్తుతం నిలిచిపోయాయి. అలాగే అక్కడక్కడ చెట్లు కూలిపోవడం వంటి ఘటనలతో పాటు విద్యుత్‌ తీగలు తెగిపోవడం వంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. దీంతో తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్‌ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తూ విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. అలాగే వరద నీటితో వరి నాట్లు పూర్తయిన పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. అలాగే అనేక ప్రాంతాల్లో వరి పంట కొట్టుకుపోతున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలతో గిరిజనుల జీవనానికి ఇలా తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. దీంతో ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయేనని గిరిజనులు ఎదురు చూస్తున్నారు.

నేడు జిల్లాలో ప్రాథమిక పాఠశాలకు సెలవు

జిల్లాలో వరదల తీవ్ర తగ్గకపోవడంతో శనివారం జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే సెలవును పొడిగిస్తున్నామని, ప్రాథమికోన్నత, ఉన్నత, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు యథావిధిగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వరద ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలోని చింతూరు, కూనవరం, వీఆర్‌.పురం, ఏటపాక మండలాల్లో అన్ని విద్యాలయాలకు సెలవులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ మార్పును విద్యాశాఖాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు గ మనించాలన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 01:00 AM