Share News

భవిష్యత్తు అభివృద్ధికి అనుగుణంగా ప్రణాళికలు

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:17 AM

విశాఖను మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యతను జీవీఎంసీ అధికారులే తీసుకోవాలని ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు.

భవిష్యత్తు అభివృద్ధికి అనుగుణంగా ప్రణాళికలు

విశాఖను మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యత జీవీఎంసీదే

అధికారులతో సమీక్షలో ఎంపీ ఎం.శ్రీభరత్‌

కొండవాలు ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెస్తా

2026 నాటికి మురుగునీరు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి

నగర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

విశాఖపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి):

విశాఖను మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యతను జీవీఎంసీ అధికారులే తీసుకోవాలని ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు. జీవీఎంసీ పరిధిలో అమలవుతున్న ప్రాజెక్టులు, నగరంలోని సమస్యల పరిష్కారంపై ఆయన మంగళవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సర్క్యూట్‌హౌస్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నగర భవిష్యత్తు అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేసేందుకు జీవీఎంసీ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు జీవీఎంసీ కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌ నగరంలో చేపట్టిన ప్రాజెక్టులను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రజా ప్రతినిధులకు వివరించారు. జీవీఎంసీ ఆదాయ, వ్యయాలతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, నగరంలో రోడ్లు అభివృద్ధి, నీటి సరఫరా ప్రణాళికలు, క్రీడా మైదానాలు, పార్కుల అభివృద్ధి, కాలుష్య నియంత్రణ, ఇంజనీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌, ప్రజారోగ్యం, యూసీడీ విభాగాలకు సంబంఽదించిన ముఖ్యమైన అంశాలను వివరించారు. అనంతరం ఎంపీ శ్రీభరత్‌ మాట్లాడుతూ నగరంలో తాగునీరు ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీధి దీపాల సమస్య నగరమంతా ఉందని, అన్నిచోట్ల లైట్లు వెలిగేలా చూడడంతోపాటు బ్లాక్‌స్పాట్లుగా గుర్తించిన 157 చోట్ల కొత్తగా లైట్లు ఏర్పాటుచేయాలని సూచించారు. కొండవాలు ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణం అవసరమని, నిధులు సమస్య ఉందని ఎంపీకి కమిషనర్‌ వివరించగా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు వచ్చేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. నగరంలో క్రీడా మైదానాల అభివృద్ధి, క్రీడలను ప్రోత్సహించడం కోసం ‘ఖేలో ఇండియా’ కింద కేంద్రం నుంచి నిధులను రాబట్టేందుకు కృషిచేస్తానన్నారు. గెడ్డల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు టౌన్‌ప్లానింగ్‌ విభాగం కృషిచేయాలని ఎంపీ సూచించారు. డ్రైనేజీల నుంచి మురుగునీరు సముద్రంలో కలుస్తోందని, 2026 నాటికి దీనికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. గ్రామకంఠంలో ఉండే ఇళ్లకు ఆస్తి పన్ను విధించే అవకాశాలను పరిశీలించాలని కమిషనర్‌ను కోరారు. నగరంలో రోడ్లపై బడ్డీలు పెడుతున్నారని, దీనివల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతున్నందున వాటిని తొలగించాలని, జీవీఎంసీ స్థలాలు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. అత్యవసరంగా చేపట్టాల్సిన ముఖ్యమైన ప్రాజెక్టులపై నివేదిక ఇస్తే సీఎస్‌ఆర్‌ ద్వారా నిధులు సమీకరించేందుకు కృషిచేస్తామన్నారు. యూసీడీ ద్వారా టిడ్కో ఇళ్లను అర్హులైన వారికి సత్వరం అందజేయాలని ఆదేశించారు. ఫుడ్‌కోర్ట్‌లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీవీఎంసీ వెబ్‌సైట్‌, చాట్‌బాట్‌ను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు యువత నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నగర అభివృద్ధికి తమ సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు సమస్యలను కూడా కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, పెతకంశెట్టి గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, పంచకర్ల రమేశ్‌బాబు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, దువ్వారపు రామారావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, జీవీఎంసీ ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు, ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవిందసత్యనారాయణ, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 01:17 AM