Share News

సన్విరా అడ్డదారి!

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:16 AM

గ్రామ పంచాయతీ నుంచి గానీ, పంచాయతీరాజ్‌ శాఖ నుంచి గానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ప్రైవేటు కర్మాగారం యాజమాన్యం తన సొంత అవసరాల కోసం దర్జాగా రహదారిని వెడల్పు చేస్తున్నది. పైగా పనులకు అయ్యే వ్యయాన్ని కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధుల నుంచి ఖర్చు చేయడం విశేషం.

సన్విరా అడ్డదారి!
రోడ్డు విస్తరణ పనుల కోసం ఉప్పు మడుల స్థలాన్ని చదును చేస్తున్న ఎక్సకవేటర్‌

పంచాయతీ అనుమతులు లేకుండా రోడ్డు విస్తరణ

పూడిమడక నుంచి ఫ్యాక్టరీ వరకు రెండు కి.మీ.ల మేర పనులు

భారీ వృక్షాలు సైతం నరికివేత

నిబంధనలకు విరుద్ధంగా సీఎస్‌ఆర్‌ నిధులు వినియోగం

అచ్యుతాపురం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ నుంచి గానీ, పంచాయతీరాజ్‌ శాఖ నుంచి గానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ప్రైవేటు కర్మాగారం యాజమాన్యం తన సొంత అవసరాల కోసం దర్జాగా రహదారిని వెడల్పు చేస్తున్నది. పైగా పనులకు అయ్యే వ్యయాన్ని కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధుల నుంచి ఖర్చు చేయడం విశేషం.

అచ్యుతాపురం- రాంబిల్లి మండలాల సరిహద్దులో పూడిమడక గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో సన్విరా ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ పేరుతో కర్మాగారం ఉంది. రాంబిల్లి మండలం చాటమెట్ట గ్రామ పరిధిలో సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ కాల్‌సైన్డ్‌ పెట్రోలియం కోక్‌ (సీపీసీ), ఇతర అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తారు. ఇందుకోసం పలు రకాల ముడిపదార్థాలను దిగుమతి చేసుకుని, తయారైన పదార్థాలను ఎగుమతి చేస్తుంటారు. రోజూ 80 నుంచి 100 వరకు భారీ వాహనాలు ఎగుమతులు, దిగుమతులతో రాకపోకలు సాగిస్తుంటారు. కాగా అచ్యుతాపురం జంక్షన్‌ నుంచి పూడిమడక వరకు నాలుగు వరుసల రహదారి వుంది. పూడిమడక ఉన్నత పాఠశాల నుంచి సన్విరా కర్మాగారం వరకు రెండు కిలోమీటర్ల మేర సింగిల్‌ రోడ్డు మాత్రమే ఉంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా వుందన్న ఉద్దేశంతో ఈ రోడ్డును వెడల్పు చేయాలని యాజమాన్యం భావించింది. అధికారులు పరోక్షంగా సహకరించడంతో రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. రోడ్డు నిర్మాణ పనులను రాజకీయ నేపథ్యం ఉన్న ఓ కాంట్రాక్టర్‌ చేపట్టడంతో అధికారులు ఎవరూ ఇటువైపు రావడంలేదు. వాస్తవంగా ఈ రెండు కిలోమీటర్ల రోడ్డు పూడిమడక పంచాయతీ పరిధిలో వుంది. పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రోడ్డు నిర్మిస్తున్నారని పూడిమడక సర్పంచ్‌ చేపల సుహాసిని, ఆమె భర్త చేపల వెంకట రమణ చెబుతున్నారు. అదే విధంగా పూడిమడక నుంచి సన్విరా కర్మాగారం వరకు రోడ్డు విస్తరణకు తాము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని పంచాయతీ రాజ్‌ డీఈ మునిశేణర్‌ తెలిపారు.

సీఎస్‌ఆర్‌ నిధులతో సొంత అవసరాలకు రోడ్డు నిర్మాణం

పూడిమడక నుంచి సన్విరా కర్మాగారం వరకు రోడ్డు విస్తరణ పనులను సీఎస్‌ఆర్‌ నిధులతో చేస్తున్నట్టు తెలిసింది. సీఎస్‌ఆర్‌ నిధులను గ్రామాల్లో సామాజిక కార్యక్రమాలకు వినియోగించాలి. కానీ సన్విరా కర్మాగారం యాజమాన్యం సీఎస్‌ఆర్‌ నిధులను తన సొంత అవసరాలకు వినియోగిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులను సుమారు రూ.2 కోట్లతో చేపట్టినట్టు సమాచారం. పాత రోడ్డుకి ఇరువైపులా భారీ వృక్షాలను నరికివేశారు. ఉప్పు మడులను చదును చేశారు. ఇది ప్రభుత్వ భూమి అయినప్పటికీ అనుమతులు లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:16 AM