Share News

విశాఖ ఉక్కును కాపాడండి..!

ABN , Publish Date - May 09 , 2024 | 02:08 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

విశాఖ ఉక్కును కాపాడండి..!

దయచేసి బొగ్గు విడుదల చేయండి

అదానీ పోర్టు నిర్వాసిత కార్మికులకు ఉక్కు ఉన్నతాధికారుల విజ్ఞప్తి

కాలినడకన వెళ్లి చేతులెత్తి నమస్కారం

...సహకరించలేమన్న కార్మికులు

విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత నెల 12వ తేదీ నుంచి అదానీ గంగవరం పోర్టులో సమ్మె కారణంగా బొగ్గు సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఉత్పత్తి 80 శాతానికిపైగా పడిపోయింది. తక్షణమే బొగ్గు అందించకపోతే వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లడంతో పాటు తిరిగి కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై విశాఖ ఉక్కు అధికారుల సంఘం హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చినా జిల్లా యంత్రాంగం ఎటువంటి సహకారం అందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోవడం లేదు. అదానీ యాజమాన్యం ముందుకురావడం లేదు. కార్మికులు సమ్మె విరమించడం లేదు. కోర్టు ధిక్కారణ కేసు కూడా నమోదైంది. అయితే ఉత్తర్వులు, ఆదేశాలతో పనులు జరగవని గుర్తించిన స్టీల్‌ప్లాంటు ఉన్నతాధికారులు నేరుగా సమ్మె చేస్తున్న కార్మికులతోనే చర్చించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్టీల్‌ప్లాంటు నుంచి సీజీఎంలు, జీఎంలు, ఇతర ఉన్నతాధికారులు సుమారుగా వేయి మంది బుధవారం ప్లాంటు దగ్గరున్న బాలచెరువు వెనుక గేటు నుంచి పోర్టు వరకు కాలినడకన వెళ్లి అక్కడ సమ్మె చేస్తున్న నిర్వాసిత కార్మికులను కలిశారు. పోర్టు నుంచి బొగ్గు తరలించడానికి సహకరించాలని, లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ప్లాంటును కాపాడాలని చేతులెత్తి వేడుకున్నారు. అభ్యర్థించారు. దీనికి పోర్టు కార్మికులు నిరాకరించారు. తాము పోర్టు కోసం ఇళ్లను, గ్రామాలను త్యాగం చేశామని, న్యాయం జరగలేదని, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు బొగ్గును తరలించడానికి అంగీకరించబోమని తెగేసి చెప్పారు. దాంతో అధికారులు నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయం తెలిసి సీఎండీ అతులభట్‌ జిల్లా అధికారులైన కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్లకు లేఖ రాశారు. తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, బొగ్గు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.

Updated Date - May 09 , 2024 | 02:08 AM