Share News

భూ రికార్డులకు భద్రత

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:54 AM

మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో విలువైన రెవెన్యూ రికార్డులు దగ్ధమైన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

భూ రికార్డులకు భద్రత

  • మదనపల్లె ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలు

  • కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో కార్యాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో

  • సీసీ కెమెరాలు ఏర్పాటుకు నిర్ణయం

  • నైట్‌ వాచ్‌మన్‌ కూడా...

  • విశాఖలోనూ గతంలో రికార్డులు దహనం చేసిన ఉదంతాలు

విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):

మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో విలువైన రెవెన్యూ రికార్డులు దగ్ధమైన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తహసీల్దార్‌, రెవెన్యూ డివిజనల్‌, కలెక్టర్‌ కార్యాలయాలు, సర్వే విభాగంలో భూముల రికార్డుల భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులకు కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ ఆదేశాలు ఇచ్చారు. ఆర్డీవో/తహసీల్దార్‌/సర్వే శాఖల పరిధిలో రికార్డులు భద్రపరిచే గదులు, కలెక్టరేట్‌లో రికార్డు రూమ్‌లో రికార్డుల రక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ప్రతిచోట సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.

జిల్లాలో కలెక్టరేట్‌, విశాఖ, భీమిలి ఆర్డీవో కార్యాలయాలు, 11 మండలాల్లో తహసీల్దార్‌, సర్వే శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికే కలెక్టరేట్‌, విశాఖ ఆర్డీవో, గాజువాక, విశాఖ రూరల్‌ మండల తహసీల్దారు కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. మిగిలినచోట్ల సీసీ కెమెరాల ఏర్పాటుచేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. అలాగే ప్రతి కార్యాలయంలో నైట్‌ వాచ్‌మన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో వీఆర్‌ఏలకు డ్యూటీలు వేయాలని నిర్ణయించారు. ఏడెనిమిదేళ్ల క్రితం భీమిలి, విశాఖపట్నం రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూముల రికార్డులు మార్చిన కొందరు అధికారులు, సిబ్బంది...ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని నిప్పు పెట్టి, అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రచారం చేసినట్టు అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం నగరంలో ఒక ప్రముఖుడి ప్రోద్బలంతో అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ రికార్డులకు నిప్పు పెట్టేశారు. మదనపల్లె తరహా ఘటనలు గతంలో ఇక్కడ చోటుచేసుకున్న నేపథ్యంలో రికార్డులు సురక్షితంగా ఉండేందుకు కలెక్టరేట్‌తోపాటు, ఆర్డీవో కార్యాలయం, పెందుర్తి, గాజువాక, పెదగంట్యాడ తహసీల్దారు కార్యాలయాల్లో కాంపాక్టర్లు (బీరువా మాదిరిగా) ఏర్పాటుకు నిర్ణయించారు. విశాఖ ఆర్డీవో కార్యాలయంలో భూమి రికార్డుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్డీవో డి.హుస్సేన్‌ సాహెబ్‌ తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉందని, తన పరిధిలో మండల తహసీల్దారు కార్యాలయాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:54 AM