Share News

ఒలింపిక్స్‌లో తెలుగు తేజం

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:49 AM

పారిస్‌ ఒలింపిక్స్‌లో నగరానికి చెందిన అంతర్జాతీయ మెరుపు అథ్లెట్‌ ఎర్రాజీ జ్యోతి పాల్గొనడం విశాఖ క్రీడా రంగానికి గర్వ కారణంగా నిలిచింది.

ఒలింపిక్స్‌లో తెలుగు తేజం

  • 100 మీటర్ల హర్డిల్స్‌లో ఎర్రాజీ జ్యోతి

  • ఈ ఈవెంట్‌కు భారత్‌ నుంచి అర్హత సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డు

  • ఆగస్టు 7న రౌండ్‌-1 పోటీలు

  • పతకంపై క్రీడా వర్గాల్లో కోటి ఆశలు

విశాఖపట్నం (స్పోర్ట్సు), జూలై 26:

ఒలింపిక్స్‌లో నగరానికి చెందిన జ్యోతి వెలుగులు విరజిమ్మనుందా...అంతర్జాతీయ యవనికపై పసిడి పతకంతో మెరుపులీననుందా...క్రీడా వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. వందమీటర్ల హర్డిల్స్‌లో రికార్డులు తిరగరాయడాన్ని మంచినీళ్ల ప్రాయంలా చేసుకుని, పతకాలను కొల్లగొడుతున్న ఎర్రాజీ జ్యోతి ఒలింపిక్స్‌లోనూ అద్భుత ప్రతిభతో సత్తా చాటుతుందని, నగర ఖ్యాతిని విశ్వవీధిలో ఎగురవేస్తుందనే ఆశాభావంలో క్రీడా రంగం ఉంది.

పారిస్‌ ఒలింపిక్స్‌లో నగరానికి చెందిన అంతర్జాతీయ మెరుపు అథ్లెట్‌ ఎర్రాజీ జ్యోతి పాల్గొనడం విశాఖ క్రీడా రంగానికి గర్వ కారణంగా నిలిచింది. 100 మీ. హర్డిల్స్‌లో రికార్డులు తిరగరాస్తున్న జ్యోతి విశ్వక్రీడల్లో పతకం వైపు పరుగు తీసేందుకు సన్నద్ధమవుతోంది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో జిల్లాస్థాయి నుంచి ఆసియా క్రీడల వరకు తాను ప్రాతినిథ్యం వహించిన ప్రతి రేస్‌లో పతకం సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న జ్యోతి ఒలింపిక్స్‌ 100 మీటర్ల హర్డిల్స్‌ రేస్‌ ఈవెంట్‌లో పరుగు తీయనున్న తొలి భారత్‌ మహిళా అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. విశాఖ నుంచి నేరుగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న తొలి అథ్లెట్‌గానూ ప్రత్యేకతను సంతరించుకుంది.

పోర్టు స్కూల్‌ నుంచి పారిస్‌ వరకు

పోర్టు స్కూల్‌ గ్రౌండ్‌లో అథ్లెట్‌గా క్రీడా జీవితాన్ని ప్రారంభించిన జ్యోతి తాజాగా ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థాయికి చేరింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా సాధన కొనసాగించింది. జిల్లా, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి క్రీడా నిపుణులను ఆకట్టుకుంది. అక్కడి నుంచి గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శాప్‌ ఏర్పాటుచేసిన స్పోర్ట్సు ఎక్స్‌లెన్సీ సెంటర్‌లో చేరి ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నది. రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న అకాడమీకి ఎంపికైన తర్వాత జ్యోతి పరుగు ప్రస్థానంలో చోటుచేసుకున్న మార్పులు ఆమె దశ, దిశను నిర్దేశించాయి. అనతికాలంలోనే 100 మీ. హర్డిల్స్‌లో టాప్‌ అథ్లెట్‌గా ఎదిగి పతకమే లక్ష్యంగా ఆమె తీసిన పరుగుకు జాతీయ రికార్డులు దాసోహమయ్యాయి. అంతర్జాతీయ ట్రాక్‌అండ్‌ఫీల్డ్‌లో ఆసియా క్రీడల వరకు ప్రతి మీట్‌లో దేశానికి పతకాలు అందించి అత్యున్నత అథ్లెట్లలో ఒకరిగా ఎదిగి ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించే స్థాయికి చేరింది.

ఆగస్టు 7న రౌండ్‌-1 పోటీల్లో

ఆగస్టు 7న మహిళల 100 మీ. హర్డిల్స్‌లో రౌండ్‌-1 (హీట్స్‌) పోటీల్లో జ్యోతి పాల్గొననుంది. ఆగస్టు 8న జరిగే రిపిచేజ్‌ రేస్‌ (హీట్స్‌లో క్యాలిఫై కానివారిలో బెస్ట్‌ టైమింగ్‌ ఉన్న అథ్లెట్లకు మరో అవకాశంగా నిర్వహించేది) ఉంటుంది. ఆగస్టు 9న సెమీఫైనల్‌, 10న ఫైనల్‌ రేస్‌ జరగనుంది.

పతకం సాధిస్తుందనే నమ్మకం ఉంది

- నారాయణరావు, అథ్లెటిక్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి

ఒలింపిక్స్‌ మహిళల 100 మీ. హర్డిల్స్‌లో పాల్గొనే స్థాయికి ఎదగడం జ్యోతి ప్రతిభకు నిదర్శనం. ఆమెకు ఒలింపిక్స్‌లో పతకం సాధించే సత్తా ఉంది. ఆసియా క్రీడల్లో ఆమె చూపిన ప్రతిభతో అంచనాలు పెరిగాయి. జాతీయ రికార్డులు, అంతర్జాతీయ పతకాలు ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తుందనే నమ్మకం ఉంది.

సంకల్పమే ఒలింపిక్స్‌కు చేర్చింది

- కంచరాన సూర్యనారాయణ, ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి

ఎర్రాజీ జ్యోతి సంకల్పమే ఆమెను ఒలింపిక్స్‌ స్థాయికి చేర్చింది. ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌పై దృష్టిసారించి పతకమే లక్ష్యంగా ఆమె తీసిన పరుగు పారిస్‌ చేర్చింది. జాతీయ రికార్డులు నెలకొల్పడమే కాకుండా వాటిని తిరగ రాయడం అసాధారణం. ప్రతిభా నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ సాగిన ఆమె పరుగుకు ఒలింపిక్స్‌ పతకం దాసోహమవుతుందని భావిస్తున్నా.

Updated Date - Jul 27 , 2024 | 12:49 AM