ఉక్కులో ఉద్రిక్తత
ABN , Publish Date - Oct 02 , 2024 | 01:14 AM
స్టీల్‌ప్లాంటు కాంట్రాక్టు కార్మికులు మంగళవారం ఉదయం పది గంటల నుంచి ఈడీ (వర్క్స్) కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
ఆందోళనకు దిగిన కాంట్రాక్టు కార్మికులు
ఈడీ (వర్క్స్) కార్యాలయం వద్ద బైఠాయింపు
విధుల నుంచి తొలగించేందుకు యత్నించడంపై నిరసన
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నం
అడ్డుకున్న పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది
యాజమాన్యం నుంచి హామీ లభించకపోవడంతో రాత్రి 11 గంటలకు కూడా నిరసన కొనసాగింపు
ఉక్కుటౌన్‌షిప్, అక్టోబరు 1:
స్టీల్‌ప్లాంటు కాంట్రాక్టు కార్మికులు మంగళవారం ఉదయం పది గంటల నుంచి ఈడీ (వర్క్స్) కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రద్దు చేసిన గేటు పాస్‌లను పునరుద్ధరించాలని, బయోమెట్రిక్ యంత్రంలో తొలగించిన కార్మికుల వివరాలు తిరిగి నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు యాజమాన్యం నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో రాత్రి పదకొండు గంటలకు కూడా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
ప్లాంటులో 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా...అందులో నాలుగు వేల మందిని తొలగించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. వారి వివరాలను గత నెల 27న బయోమెట్రిక్ యంత్రాల నుంచి తొలగించింది. ఈ విషయమై చర్చించేందుకుగాను కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు, కొంతమంది కార్మికులు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఈడీ (వర్క్స్) కార్యాలయానికి వెళ్లారు. కొద్దిసేపటికి వేల సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించరాదని ఆన్‌లైన్‌లో యథావిధిగా గేటు పాస్‌లు రెన్యువల్ చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆ సమయంలో అధికారులు వచ్చి మాట్లాడేందుకు యత్నించినప్పటికీ కార్మికులు ఒప్పుకోలేదు. ముందు గేటు పాస్‌లు ఇవ్వాలని, అప్పటివరకూ మాట్లాడొద్దని అడ్డుకున్నారు. దఫధఫాలుగా కార్మిక సంఘ నాయకులతో అధికారులు చర్చలు జరిపారు. అయితే కార్మిక నాయకుల డిమాండ్‌లను యాజమాన్యం అంగీకరించకపోవడంతో రాత్రి పదకొండు కూడా గంటలకు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు ఉద్యోగ సంఘ నాయకులు మద్దతు తెలిపి కార్యాలయం ముందు బైఠాయించారు.
తెలుపు రంగు పాస్‌లు ఇస్తామనడంతో ఆందోళన
స్టీల్‌ప్లాంటులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మూడు నెలల కాలపరిమితితో కూడిన పసుపు రంగు గేటు పాస్ ఇచ్చేవారు. అయితే ఇటీవల యాజమాన్యం సుమారు నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికుల గేటు పాస్‌లను ఆన్‌లైన్‌లో రద్దు చేసింది. వీరికి నెల రోజుల వ్యవధితో తెలుపు రంగులో ఉండే గేటు పాస్‌లు ఇస్తామని చెప్పడంతో ఆందోళన చేపట్టారు.
ఈడీ (వర్క్స్) కార్యాలయం అద్దాలు ధ్వంసం
గతంలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టు కార్మికులు వేలాది మంది తరలివచ్చి అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు అక్కడ నుంచి కదిలేది లేదని ఈడీ కార్యాలయం వద్ద కూర్చున్నారు. ఒకానొక దళలో కార్యాలయం లోపలకు వెళ్లెందుకు యత్నించగా పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలకు తోపులాట చోటు చేసుకుంది. ఆ సమయంలో కొంతమంది కార్మికులు కార్యాలయంపైకి రాళ్లు విసరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆందోళన క్రమంలో ఈడీ (వర్క్స్) కార్యాలయం అధికారులను, ఉద్యోగులను కాంట్రాక్టు కార్మికులు నిర్బంధించారు. కాగా కాంట్రాక్టు కార్మికుల ఆందోళనతో సౌత్ ఏసీపీ టి.త్రినాథ్ పర్యవేక్షణలో పలు స్టేషన్‌ల సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది భారీగా మోహరించారు.
కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు
- ఆన్‌లైన్‌లో రద్దు చేసిన గేటు పాస్‌లను తక్షణమే పునరుద్ధరించాలి
- బయోమెట్రిక్ యంత్రంలో వివరాలు తిరిగి నమోదు చేయాలి.
- ఉద్యోగ భద్రత కల్పించాలి
- ఏ ఒక్క కాంట్రాక్టు కార్మికుడిని తొలగించబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలి
- పాత పద్ధతిలోనే గేటు పాస్‌లు మంజూరుచేయాలి
- పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలి
యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది
అఖిలపక్ష కార్మిక నాయకులు
కాంట్రాక్టు కార్మికుల విషయంలో యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈడీ (వర్క్స్) కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న కార్మిక వర్గాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ యాజమాన్యం చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేదని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికుల విషయంలో కుట్ర జరుగుతుందన్నారు. భారీ ఉద్యమాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆందోళనలో కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు మంత్రి రవి, పీవీ నగేష్, శ్రీనివాసరావు, అవతారం, ఎల్.సోంబాబు, నమ్మి రమణ, రామిరెడ్డి, ఉరుకూటి వెంకటరమణ, ఉద్యోగ సంఘ నాయకులు కేఎస్‌ఎన్ రావు, అయోధ్యరాం, బొడ్డు పైడిరాజు, నీరుకొండ రామచంద్రరావు పాల్గొన్నారు.