Share News

జీవో 3 రద్దుతో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం

ABN , Publish Date - May 09 , 2024 | 01:18 AM

ఆదివాసీల అభివృద్ధిలో ఎంతో కీలకమైన జీవో 3 రద్దుతో వారికి ఎంతో అన్యాయం జరిగిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ తెలిపారు.

జీవో 3 రద్దుతో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం
పాడేరులో సీపీఎం ర్యాలీలో పాల్గొన్న బృందాకారత్‌, నరసింగరావు, అప్పలనర్స, కార్యకర్తలు

- సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌

పాడేరు, మే 8(ఆంధ్రజ్యోతి): ఆదివాసీల అభివృద్ధిలో ఎంతో కీలకమైన జీవో 3 రద్దుతో వారికి ఎంతో అన్యాయం జరిగిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ తెలిపారు. ఇండియా కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఇక్కడ నిర్వహించిన రోడ్‌లో షో ఆమె మాట్లాడారు. జీవో 3 వల్లే ఎంతో మంది ఆదివాసీలు ఉద్యోగాలు పొంది, వారి జీవితాలను మెరుగుపరుచుకున్నారన్నారు. అటువంటి జీవో 3ని సుప్రీం కోర్టు ద్వారా బీజేపీ కొట్టించేసి వారి జీవితాలను నాశనం చేసిందన్నారు. జీవో 3, పెసా, గ్రామసభలతోనే ఆదివాసీల చట్టాలు, హక్కులకు రక్షణ ఉంటుందని, వాటిని సక్రమంగా అమలు చేయకుండా ఆదివాసీల జీవితాలను పాలకులు పాడుచేస్తున్నారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అరకులోయ ఎంపీ సీపీఎం అభ్యర్థి పి.అప్పలనర్స, అమ్‌ ఆద్మీపార్టీ నేత ఎస్‌.గంగరాజు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కంకిపాటి వీరన్నపడాల్‌ మాట్లాడారు. అంతకు ముందు జిల్లా కేంద్రం పాడేరు మెయిన్‌రోడ్డులో సీపీఎం నేతలు బృందాకారత్‌, నరసింగరావు, ఎంపీ అభ్యర్థి అప్పలనర్స, నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. సీపీఎం నేత బి.చిన్నయ్యపడాల్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు సీహెచ్‌ నరసింగరావు, కొత్తపల్లి లోకనాఽథం, కిల్లో సురేంద్ర, పాలికి లక్కు, ఎల్‌.సుందరరావు, సీపీఐ నేతలు కె.రాధాకృష్ణ, అమర్‌, అధిక సంఖ్యలో వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజలను మోసగించిన వైసీపీ

చింతపల్లి: రాష్ట్రంలో ఐదేళ్ల పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అన్ని విధాల మోసం చేసిందని సపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ఆరోపించారు. బుధవారం చింతపల్లిలో రోడ్‌ షో నిర్వహించిన ఆమె స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదుట గిరిజనులనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు 23 మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్‌కి పంపిస్తే జగన్మోహన్‌రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మోదీకి దాసోహం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం గిరిజన సంపదను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్‌. నరసింగరావు, కార్యదర్శివర్గ సభ్యుడు లోకనాథం, సురేంద్ర, పాడేరు ఇన్‌చార్జి బోనంగి చిన్నయ్య పడాల్‌, మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:18 AM