Share News

పంచ గ్రామాల సమస్య పరిష్కారం దిశగా...

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:52 AM

సింహాచల దేవస్థానంతో ముడిపడి ఉన్న పంచ గ్రామాల భూ వివాదం పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది.

పంచ గ్రామాల సమస్య పరిష్కారం దిశగా...

భూ వివాదంపై దేవదాయ శాఖా మంత్రి ఆనం అధ్యక్షతన అమరావతిలో విస్తృతస్థాయి సమావేశం

ఉమ్మడి జిల్లా కూటమి ఎమ్మెల్యేలు హాజరు

నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు

ప్రత్యామ్నాయంగా సింహాచలం దేవస్థానానికి భూములు

ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్‌కు ఆదేశం

న్యాయస్థానంలో అఫిడవిట్‌కు ఏర్పాట్లు

సింహాచలం, జూలై 26:

సింహాచల దేవస్థానంతో ముడిపడి ఉన్న పంచ గ్రామాల భూ వివాదం పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి నగరంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో లక్షలాది మందికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం నడుంబిగించింది.

పంచ గ్రామాల భూ సమస్యపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని సమావేశ మందిరంలో దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమావేశం ఏర్పాటుచేసి, సమగ్రంగా చర్చించారు. ఆ వివరాలను దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ పత్రికలకు విడుదల చేశారు. రాష్ట్ర హైకోర్టులో 2019లో దాఖలైన వ్యాజ్యానికి లోబడి జీవో 229లో పేర్కొన్న రేట్ల ప్రకారం 12,149 నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టాలని, అందుకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులపై నివేదిక సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ క్రమబద్ధీకరణ వల్ల సింహాచలం దేవస్థానానికి కలిగే నష్టాన్ని భర్తీ చేయనున్నారు. సుమారు 421 ఎకరాలకు సమాన విలువ ఉండే విధంగా ప్రాథమికంగా గుర్తించిన 853.6 ఎకరాల బదలాయింపుతో పాటు అవసరాల నిమిత్తం రహదారికి అనుసంధానంగా ఉన్న మరికొంత భూమిని గుర్తించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సత్వరం సమర్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరీంధిర్‌ ప్రసాద్‌ను మంత్రి రామనారాయణరెడ్డి ఆదేశించారు. దాని ఆధారంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనుమతితో హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి కోర్టు నుంచి ఉత్తర్వులు పొంది కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు తగిన చర్యలు చేపడతామని సమావేశంలో మంత్రి వెల్లడించారు. అదేవిధంగా పంచ గ్రామాల భూవివాదంలో అంతర్భాగమైన రైతుల సమస్యకు సంబంధించి 1,947 ఎకరాల వ్యవసాయ భూములకు చెందిన అప్పీళ్ల విషయంలో కూడా పరిష్కారం కనుగొనేందుకు త్వరలో విశాఖ జిల్లా కలెక్టర్‌ సారథ్యంలో మరొక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పీవీజీఆర్‌ నాయుడు (గణబాబు), వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, పి.విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్‌, దేవదాయ శాఖ అదనపు కమిషనర్‌ కోడూరి అచ్యుత రామచంద్రమోహన్‌, ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌, 98వ వార్డు కార్పొరేటర్‌ పివి నరసింహం, వార్డు టీడీపీ అధ్యక్షులు పంచదార్ల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:52 AM