Share News

నగరానికి నీటి గండం

ABN , Publish Date - May 09 , 2024 | 02:03 AM

నగరానికి తాగునీటి గండం పొంచి ఉంది. నగరానికి ప్రధాన నీటి వనరు అయిన ఏలేరు రిజర్వాయర్‌లో నిల్వలు అడుగంటిపోయాయి.

నగరానికి నీటి గండం

డెడ్‌ స్టోరేజీకి ఏలేరు రిజర్వాయర్‌లో నిల్వలు

పది మోటార్లతో కాలువలోకి నీరు పంపింగ్‌

నగర అవసరాల్లో మూడొంతులు అక్కడి నుంచే రాక

మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే నీటి కష్టాలే

ఇప్పటికే నీటి సరఫరాకు తరచూ అంతరాయం

సాంకేతిక కారణాలంటూ ప్రజలను మభ్యపెడుతున్న అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరానికి తాగునీటి గండం పొంచి ఉంది. నగరానికి ప్రధాన నీటి వనరు అయిన ఏలేరు రిజర్వాయర్‌లో నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో మోటార్లు పెట్టి నీటిని కాలువలోకి పంపింగ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటిలో మూడొంతులు ఏలేరు రిజర్వాయర్‌ నుంచే సరఫరా అవుతోంది. రిజర్వాయర్‌ డెడ్‌ స్టోరేజీకి చేరడం వల్ల నగరంలో నీటి సరఫరాపై ప్రభావం చూపుతోందంటున్నారు. గత వారం రోజులుగా నగరంలో ఏదో ఒక ప్రాంతానికి నీటి సరఫరా నిలిపివేతకు అదే కారణమనే వాదన వినిపిస్తోంది.

నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రతిరోజూ 80 మిలియన్‌ గ్యాలన్లు (ఎంజీడీ) నీరు అవసరం. ఇదికాకుండా స్టీల్‌ప్లాంట్‌, ఏపీఐఐసీ, గంగవరం పోర్టు, ఎన్‌టీపీసీ వంటి పరిశ్రమల అవసరాలకు మరో 50 ఎంజీడీల నీరు అవసరం. మొత్తం 130 ఎంజీడీల నీటిని జీవీఎంసీ అధికారులు సమీకరించి, కావాల్సిన వారికి సరఫరా చేస్తున్నారు. అయితే ఈ నీటిలో దాదాపు 90 ఎంజీడీలు కేవలం ఏలేరు రిజర్వాయర్‌ నుంచే తీసుకుంటున్నారు. అందులో 50 ఎంజీడీలు ప్రజల తాగునీటి అవసరాలకు, 30 ఎంజీడీలను స్టీల్‌ప్లాంటుకు మిగిలిన పది ఎంజీడీల నీటిని పోర్టు, ఏపీఐఐసీ, గంగవరం పోర్టు, ఎన్‌టీపీసీ వంటి పరిశ్రమలకు కేటాయిస్తున్నారు. మరో 40 ఎంజీడీల నీటిని రైవాడ, ముడసర్లోవ, తాటిపూడి, గంభీరం రిజర్వాయర్లతోపాటు గోస్తనీ నది నుంచి తీసుకువస్తున్నారు.

ఇదిలావుండగా గత ఏడాది వర్షాభావం కారణంగా రిజర్వాయర్లలో ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. దీనికితోడు ఈ ఏడాది వేసవి సీజన్‌ ముందుగానే ప్రారంభమవ్వడం, ఎండలు తీవ్రంగా ఉండడంతో రిజర్వాయర్లలో నీటి మట్టాలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. నగరానికి ప్రధాన నీటి వనరుగా గుర్తింపుపొందిన ఏలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం డెడ్‌ స్టోరేజీకి పడిపోవడంతో గ్రావెటీ ద్వారా నీరు కాలువలోకి ప్రవహించడం లేదు. దీంతో జీవీఎంసీ అధికారులు పది మోటార్లను ఏర్పాటుచేసి రిజర్వాయర్‌లోని నీటిని కాలువలోకి పంపింగ్‌ చేయిస్తున్నారు. రిజర్వాయర్‌లో నీటి మట్టం కనిష్ఠ స్థాయి 71.5 మీటర్లు కాగా, ప్రస్తుతం 69.09 మీటర్లకు తగ్గిపోయింది. పరిస్థితి మరో నెలరోజులుపాటు ఇలాగే కొనసాగితే నీటి మట్టం మరింతగా తగ్గిపోవడం ఖాయమని జీవీఎంసీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. 66 మీటర్లకు నీటిమట్టం చేరితే రెండు స్థాయిల్లో నీటిని పంపింగ్‌ చేయాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.

నగరంలో మొదలైన తాగునీటి కష్టాలు

ఏలేరు రిజర్వాయర్‌ నుంచి గతంలో కాలువ ద్వారా 300 క్యూసెక్కులు నీరు నగరానికి చేరితే ఇప్పుడు పంపింగ్‌ కారణంగా 150 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో గోదావరి నది నుంచి కాటేరు వద్ద మరో 100 క్యూసెక్కులు వరకూ నీటిని పంపింగ్‌ చేసి ఏలేరు కాలువ ద్వారానే నగరానికి తరలిస్తున్నారు. ఏలేరు కాలువ ద్వారా నగరానికి చేరుతున్న నీరు 50 క్యూసెక్కులు వరకూ తగ్గిపోతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం నగరంలో నీటి సరఫరాపై పడుతోంది. పరిశ్రమలకు కేటాయింపులు తగ్గించి ప్రజల తాగునీటి అవసరాలకు కేటాయింపు పెంచినప్పటికీ గతంలో మాదిరిగా సరఫరా చేయడానికి కొరత ఏర్పడుతోంది. దీంతో జీవీఎంసీ అధికారులు ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతానికి సరఫరాను నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీఎం పాలెంలో ఏదో ఒక ప్రాంతానికి నిత్యం నీటి సరఫరా నిలిచిపోతోంది. గత రెండు రోజులుగా శివాజీపాలెం, మద్దిలపాలెం ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. అయితే జీవీఎంసీ అధికారులు మాత్రం నీటి కొరత ఉందని కాకుండా...పైప్‌లైన్‌ పగిలిపోవడం, లీకేజీలు, డ్రైనేజీ నీరు పైప్‌లైన్‌లోకి కలిసిపోతుండడం వంటి సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే సరఫరాకు అంతరాయం కలుగుతోందని చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వేసవి ఇంకా రెండు నెలలుపాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు ఒక వైపు హెచ్చరిస్తుండడం భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవనే ఆందోళన నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. ఏలేరుతోపాటు తాటిపూడి రిజర్వాయర్‌ కూడా డెడ్‌ స్టోరేజీకి చేరుకుంటే నగరంలో కొళాయిల ద్వారా రోజువిడిచి రోజు నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని జీవీఎంసీ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - May 09 , 2024 | 02:03 AM