కార్డుదారుల కష్టాలకు చెక్
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:51 PM
జిల్లాలో రేషన్ డిపోల సంఖ్య పెరగనుంది. డీలర్ల పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. కార్డుదారులకు మెరుగైన సేవలందించాలనే కూటమి ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కదిలింది. డిపోల పెంపునకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు.
రేషన్ డిపోల పెంపునకు ప్రతిపాదనలు
డీలర్ల పోస్టుల భర్తీకి సన్నాహాలు
కూటమి సర్కారు నిర్ణయంపై జిల్లావాసుల హర్షం
గరుగుబిల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్ డిపోల సంఖ్య పెరగనుంది. డీలర్ల పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. కార్డుదారులకు మెరుగైన సేవలందించాలనే కూటమి ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కదిలింది. డిపోల పెంపునకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే పట్టణ, పల్లె ప్రాంతాల్లో నూతన డిపోలను ఏర్పాటు చేయనున్నారు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందించేందుకు జిల్లాలో 196 వాహనాలు (ఎండీయూ)ను కేటాయించింది. ఇంటింటికీ రేషన్ సరుకులు అందించనున్నట్లు ప్రకటించినా, దూర ప్రాంతాల్లోనే వాహనాలను నిలుపుదల చేయడం వల్ల కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇకపై కార్డుదారులు ఈ కష్టాలు పడరాదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నూతన చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో 578 రేషన్ డిపోల పరిధిలో 2.81 లక్షలకు పైగా కార్డుదారులున్నారు. వారికి ప్రతినెలా పౌర సరఫరాలశాఖ నుంచి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అదనంగా 49 దుకాణాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో రేషన్ డిపోల సంఖ్య 627కు చేరనుంది. జిల్లా పరిధిలో నూతనంగా డిపోలు ఏర్పాటు చేస్తే ఒక దుకాణానికి రూ. 41,500 ఖర్చవుతుంది. అయితే నిత్యావసర సరుకుల పంపిణీలో జాప్యం ఉండరాదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. దీనిపై ఇప్పటికే అధికారులు సర్వే చేపడుతున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
- గ్రామీణ ప్రాంతాల్లో ఒక డిపో పరిధిలో 400 నుంచి 450 కార్డులు, పట్టణ ప్రాంతాల్లో 500 నుంచి 550, కార్పొరేషన్ పరిధిలో 600 నుంచి 650, పంచాయతీ పరిధిలో కనీసం 400 కార్డులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. రేషన్‌కార్డులు అధికంగా ఉన్న దుకాణాలను విభజించనున్నారు. 800 కార్డులు కన్నా అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా దుకాణాల విభజనపై అభ్యంతరాలుంటే తెలియపర్చాలని ఇప్పటికే కొంతమంది రేషన్ డీలర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
- కార్డుదారులకు రాయితీపై అందిస్తున్న రేషన్ బియ్యం దళారుల చేతికి చేరుతుంది. గ్రామస్థాయిలో వారు బియ్యం మొత్తం సేకరించి.. రాత్రి సమయంలో ఒడిశా ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ తరలింపులో కొంతమంది డీలర్లు, ఎండీయూ వాహన డ్రైవర్ల హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ఖాళీల భర్తీకి చర్యలు
జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డిపో డీలర్ల నియామకానికి చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం మన్యంలో 33 ఖాళీలు ఉండగా.. రోస్టర్ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. డివిజన్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో నియామకాలు జరగనున్నాయి.
ఎండీయూలతో ఇబ్బందులు
ఎండీయూ వాహనాల నిర్వహణలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆపరేటర్లు ఇంటింటికీ సరుకులు సరఫరా చేయలేకపోతున్నారు. డీలర్ల వ్యవస్థను బలోపేతం చేయాలి. పాత విధానమే అమలుపరిస్తే కార్డుదారులకు ఉపయుక్తంగా ఉంటుంది.
- డి.శ్రీనివాసరావు, డీలర్ల సంఘ అధ్యక్షుడు, పార్వతీపురం
==========================================
డిపోల పెంపు, డీలర్ల భర్తీకి చర్యలు
జిల్లాలో రేషన్ కార్డుదారులకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం ఉన్న 578 డిపోలతో పాటు మరో 49 దుకాణాల కోసం ప్రతిపాదనలు పంపించాం. 33 చౌక ధరల దుకాణాలకు డీలర్ల నియామకానికి చర్యలు చేపడుతున్నాం. కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. డీలర్ల సమస్యలను ఉన్నతాధికారులకు తెలియపర్చాం. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టాం. ఎండీయూ వాహనాలపై ఎటువంటి సమాచారం రాలేదు.
- పి.శ్రీనివాసరావు, సివిల్ సప్లైస్, పార్వతీపురం మన్యం జిల్లా