Share News

గిరిజన మహిళకు ప్రసవ వేదన

ABN , Publish Date - May 09 , 2024 | 12:41 AM

గ్రామానికి రహదారి సౌకర్యం లేక అర్నాడ పంచాయతీ అర్నాడవలస గ్రామ గిరిజన మహిళ ఆరిక అర్జన్ని తీవ్ర ప్రసవ వేదన పడాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది.

 గిరిజన మహిళకు ప్రసవ వేదన

జియ్యమ్మవలస: గ్రామానికి రహదారి సౌకర్యం లేక అర్నాడ పంచాయతీ అర్నాడవలస గ్రామ గిరిజన మహిళ ఆరిక అర్జన్ని తీవ్ర ప్రసవ వేదన పడాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. మంగళవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభ మయ్యాయి. అత్యవసర 108కు ఫోన్‌ చేద్దామన్నా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. ఎంతో కష్టం మీద పురిటి నొప్పులతోనే ఆటోలో 4 కిలో మీటర్లు ఉన్న జియ్యమ్మ వలస పీహెచ్‌సీకి ఆ గ్రామ గిరిజనులు తీసుకొని వెళ్లారు. వెళ్లగానే ఆమె ఆసుపత్రి లో ప్రసవించింది. అయితే ఆటోలో గతకుల ప్రయాణం వల్ల తీవ్ర రక్తస్రావం అయ్యింది. అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉండటంతో పీహెచ్‌సీ వైద్యాధికారి పి.జగదీష్‌ అక్కడి నుంచి జిల్లా కేంద్రాసుపత్రికి అత్యవసర చికిత్స నిమిత్తం తరలించారు.

కాలినడకే శరణ్యం

ఈసందర్భంగా గ్రామ పెద్ద మెల్లక సురేష్‌ మాట్లాడుతూ గ్రామానికి ఒకవైపు అర్నాడ, మరోవైపు డంగభద్ర పంచాయతీ కేంద్రం ఉన్నాయన్నారు. ఎటువైపు వెళ్లాలన్నా కాలినడకే శరణ్యమని వాపోయారు. ఉపాధి హామీ పథకం ద్వారా కనీసం గ్రావెల్‌ రోడ్డు నిర్మించాలని ఎన్నో సార్లు అధికారుల చుట్టూ తిరిగినా కనీసం ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దయనీయ పరిస్థితి చూసైనా కలెక్టర్‌ గానీ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గానీ స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆ గ్రామ గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - May 09 , 2024 | 12:41 AM