Share News

పోస్టింగ్‌ల కోసం పైరవీలు!

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:40 PM

ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లిన ‘మన్యం’ తహసీల్దార్లు త్వరలోనే సొంత జిల్లాకు రానున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. అయితే ఇదే సమయంలో కొందరు తహసీల్దార్లు పైరవీలు ప్రారంభించారు.

పోస్టింగ్‌ల కోసం పైరవీలు!

తమకు అనుకూల మండలాల కోసం తాపత్రయం

అధికారపార్టీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు

గత ఐదేళ్లూ వైసీపీ సేవలో.. తాజాగా టీడీపీ జపం

వారిపై ఆచితూచి వ్యవహరించాలంటున్న కూటమి శ్రేణులు

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లిన ‘మన్యం’ తహసీల్దార్లు త్వరలోనే సొంత జిల్లాకు రానున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. అయితే ఇదే సమయంలో కొందరు తహసీల్దార్లు పైరవీలు ప్రారంభించారు. ‘మన్యం’లో తమకు కావల్సిన మండలాలపై గురిపెట్టారు. ఈ మేరకు ఇతర జిల్లాల నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరికొంతమంది జిల్లాలో ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే గత ఐదేళ్లూ.. వైసీపీ సర్కారు సేవలో తరించిన సంబంఽఽధిత అధికారులపై అప్రమత్తంగా ఉండాలని కూటమి శ్రేణులు చెబుతున్నాయి. అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన తర్వాతే.. వారికి మండలాలను కేటాయించాలని ఎమ్మెల్యేలకు సూచిస్తున్నాయి.

ఇదీ పరిస్థితి..

వాస్తవంగా గత వైసీపీ సర్కారు హయాంలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కొంతమంది తహసీల్దార్లు ఆ పార్టీ నాయకుల్లా వ్యవహరించారు. ఏ మాత్రం భయం లేకుండా కొన్ని మండలాల్లో వైసీపీ రెవెన్యూ చట్టాన్నే అమలు చేశారు. ప్రభుత్వం ఉద్యోగులమని మరిచిపోయి.. నిబంధనలకు విరుద్ధంగా నడిచారు. అక్రమాలపై ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అక్రమార్కులకు కొమ్ము కాశారు. బాధితులకు అన్యాయం చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించారన్న ఆరోపణలు లేకపోలేదు. జిల్లాలో అనేకచోట్ల చెరువులు, ప్రభుత్వ భూములను కొందరు వైసీపీ నాయకులు ఆక్రమించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాల ప్రకారం కొంతమంది తహసీల్లార్లు రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో విలువైన ప్రభుత్వ భూములు చేతులు మారాయనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మొత్తంగా గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొంతమంది తహసీల్దార్లు తీరును ఇప్పటికీ కూటమి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

అప్పట్లో వైసీపీ..తాజాగా టీడీపీ

వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లా వ్యవహరించిన కొంతమంది తహసీల్దార్లు తాజాగా టీడీపీ నామం జపిస్తున్నారు. ఎన్నికల విధులు ముగించుకుని సొంత జిల్లాలకు తరలివస్తున్న తరుణంలో అనుకూల మండలాల్లో పోస్టింగ్‌ల కోసం పైరవీలకు శ్రీకారం చట్టారు. ఈ నేపథ్యంలో వారికి పరిచయం ఉన్న టీడీపీ నాయకులతో మాట్లాడుతున్నారు. మరోవైపు కీలక నేతలు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. మరి కొందరు కులం కార్డును ఉపయోగిస్తున్నారు. కాగా వైసీపీ సర్కారు హయాంలో ఆయా తహసీల్దార్ల పనితీరును గుర్తు చేసుకుని.. పోస్టింగ్‌ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కూటమి శ్రేణులు ఎమ్మెల్యేలకు సూచిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులు మాటలు వినొద్దని.. అధికారుల నియామకం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతున్నాయి. అధికారుల నిజాయితీ, వారి చరిత్ర, వ్యవహర శైలి తదితర అంశాలను పరిగణ లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

గాడి తప్పిన రెవెన్యూ వ్యవస్థ

గత వైసీపీ సర్కారు తీరుతో జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని చెప్పొచ్చు. నిబంధనల ప్రకారం విధులు నిర్వహించే కొంతమంది తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది కూడా గత ఐదేళ్లూ కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చింది. సదరు ఎమ్మెల్యేలు చెప్పినట్టు వినని తహసీల్దార్లపై ఉన్నత స్థాయి అధికారుల ద్వారా ఒత్తిడి పెంచి వైసీపీ రెవెన్యూ చట్టం అమలయ్యేలా చేశారనే ఆరోపణలున్నాయి.

- ఏదేమైనా జిల్లాలో కొంతమంది తహసీల్దార్లు నిజాయితీగా పనిచేస్తారన్న పేరుంది. అటువంటి వారికి పోస్టింగ్‌లు ఇచ్చే విషయంలో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అంతేగాకుండా గత వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన భూ కుంభకోణాలు, చెరువులు, బందల ఆక్రమణలపై తహసీల్దార్లు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని, ప్రభుత్వ భూములను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:40 PM