Share News

సైబర్‌ నేరాల నియంత్రణకు సహకరించండి

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:47 PM

సైబర్‌ నేరాల నియంత్రణకు బ్యాంకు అధికారులు సహకరించాలని ఎస్పీ ఎస్‌.వి.మాధవరెడ్డి కోరారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో పలు బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు.

సైబర్‌ నేరాల నియంత్రణకు సహకరించండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

బెలగాం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరాల నియంత్రణకు బ్యాంకు అధికారులు సహకరించాలని ఎస్పీ ఎస్‌.వి.మాధవరెడ్డి కోరారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో పలు బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు అందించారు. చోరీల్లో కంటే సైబర్‌ నేరాల్లోనే ఎక్కువగా నగదు పొగొట్టుకున్న బాధితులు ఉన్నారని ఆయన తెలిపారు. 2023లో సైబర్‌ నేరాల కారణంగా బాధితులు రూ.1.15 కోట్లు పోగొట్టుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.21.85 కోట్లు కోల్పోయారని వెల్లడించారు. జిల్లాలో ప్రధానంగా నిరక్ష్యరాసులు, గిరిజనులు సైబర్‌ మోసాలకు గురై మొత్తంగా పొగొట్టుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి వారికి అవగాహన కల్పించాలని సూచించారు. సరైన గుర్తింపు కార్డు ఉంటేనే ఖాతా తెరవాలన్నారు. నాన్‌ లోకల్‌ వ్యక్తులకు ఖాతా తెరిచే సందర్భాల్లో అనుమానం వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఎక్కువగా లావాదేవీలు జరిగే అనుమానాస్పద బ్యాంక్‌ అకౌంట్లపై నిఘా పెట్టాలన్నారు. ఫేక్‌ లోన్‌ యాప్‌లు, సామాజిక మాధ్యమాల్లో పంపే లింకులు, ఓటీపీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్‌ మోసాల కేసుల్లో సమయం చాలా ముఖ్యమని చెప్పారు. సరైన సమయంలో బ్యాంక్‌ అధికారులు సమాచారం ఇస్తే మోసాలకు పాల్పడే వారిని అరెస్ట్‌ చేయవచ్చని స్పష్టం చేశారు. బ్యాంక్‌లు, ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పని సరిగా ఉండాలన్నారు. సైబర్‌ మోసాలకు పాల్పడిన బాధితులు 1930 నెంబర్‌కి సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ ఓ.దిలీప్‌ కిరణ్‌, ఏఎస్పీ అంకిత సురానా, డీఎస్పీ రాంబాబు , వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:47 PM