Share News

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అక్రమాలపై విచారణ

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:59 PM

గుర్ల తమ్మిరాజుపేట ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్‌ పల్లి సరస్వతి అక్రమాలపై డ్వామా ఏపీడీ అరుణశ్రీ శుక్రవారం ఆ గ్రామంలో బహిరంగ విచారణ నిర్వహించారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అక్రమాలపై విచారణ

మెంటాడ: గుర్ల తమ్మిరాజుపేట ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్‌ పల్లి సరస్వతి అక్రమాలపై డ్వామా ఏపీడీ అరుణశ్రీ శుక్రవారం ఆ గ్రామంలో బహిరంగ విచారణ నిర్వహించారు. సరస్వతి అక్రమాలపై ఇటీవల ఆ గ్రామానికి చెందిన చలుమూరి వెంకటరావు తోపాటు పలువురు మంత్రి సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు శుక్రవారం విచారణ చేపట్టారు. సరస్వతి మెంటాడ గ్రామానికి చెందినది అని, ఆమెకు జీటీపేటలో పోస్టింగ్‌ ఇప్పించేందుకు వైసీపీ నేతలు ఇంటి స్థలం కూడా మంజూరు చేశారని గ్రామస్థులు ఆరోపించారు. అలాగే అధిక పనిదినాలు చూపడం కోసం హైడ్రామా నడిపారని చెప్పారు. గ్రామంలోని కృష్ణపాత్రుని చెరువులో పని జరిపించకుండానే ఈమె పేరిట మస్తర్లు వేసి ఫీల్డ్‌అసిస్టెంట్‌గా నియమించారని ధ్వజమెత్తారు. గ్రామంలో లేని వైసీపీ వర్గీయులకు కూడా మస్తర్లు వేశారని ఆరోపించారు. మేట్లు, గ్రూపు లీడర్లు, కూలీలతో దురుసుగా వ్యవహరించారని తెలిపారు. వెంకటస్వామి నాయుడు చెరువులో పని చెప్పి కృష్ణపాత్రుని చెరువులో మస్తర్లు వేసిన ఘన చరిత్ర ఈమెదని వెల్లడించారు. ఎనిమిది నెలల కిందట ఎంపీడీవోకు ఫిర్యాదు చేసి న విషయాన్ని గుర్తు చేశారు. ఈమెను విధుల నుంచి తొలిగించి, అర్హులకు అవకా శం కల్పించాలని ఏపీడీకి విజ్ఞప్తి చేశారు. విచారణ నివేదికను పీడీకి నివేదిస్తానని ఏపీడీ తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం చినఅప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:59 PM