Share News

అసెంబ్లీలో జిల్లా సమస్యల ప్రస్తావన

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:37 PM

జిల్లా ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీలో తమ వాణి వినిపించారు. మన్యంలో ప్రధాన సమస్యలపై ప్రస్తావించారు. సాలూరు ఎమ్మెల్యే, స్ర్తీశిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణలు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులను వివరించారు.

అసెంబ్లీలో జిల్లా సమస్యల ప్రస్తావన
జిల్లా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన మంత్రి, ఎమ్మెల్యేలు

పార్వతీపురం, జూలై 26(ఆంధ్రజ్యోతి)/సాలూరు/పార్వతీపురం రూరల్‌/గుమ్మలక్ష్మీపురం: జిల్లా ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీలో తమ వాణి వినిపించారు. మన్యంలో ప్రధాన సమస్యలపై ప్రస్తావించారు. సాలూరు ఎమ్మెల్యే, స్ర్తీశిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణలు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులను వివరించారు. సాలూరు నియోజకవర్గంలో 31 గ్రామాల తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.మూడు కోట్లు మంజురు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఆ పనులు మొదలుపెడతామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సాలూరులో వంద పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఫీడర్‌ అంబులెన్స్‌లు, వైటీసీ భవనాలను నిర్వీర్యం చేసిందన్నారు. గోతులతో నిండిన రోడ్లు.. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులను తలపిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల హామీ ప్రకారం సూపర్‌సిక్స్‌ పథకంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18వేలు ఇస్తామని తెలిపారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యసేవలపై పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రస్తావించారు. రోగుల ఇబ్బందుల దృష్ట్యా తక్షణమే ప్రత్యేక వైద్య నిపుణులను నియమించాలన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుతో పాటు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చూడాలని, ఆసుపత్రులను సెంట్రలైజ్‌ చేయాలని కోరారు. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ.. ఏనుగుల తరలింపుతో పాటు గిరిజన, మైదాన ప్రాంతాల ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. ఆసుపత్రుల్లో మందులు, పడకల కొరత, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఏఎన్‌ఎంల నియామకం విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. తోటపల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తయ్యేలా చూడాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు. గత వైసీపీ సర్కారు హయాంలో నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఏ విధంగా జరిగిందో వివరించారు.

Updated Date - Jul 26 , 2024 | 11:37 PM