Share News

హాజరు లేకపోయినా చెల్లింపులు

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:58 PM

మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికలో అనేక అక్రమాలు బయటపడ్డాయి.

హాజరు లేకపోయినా చెల్లింపులు

రామభద్రపురం: మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికలో అనేక అక్రమాలు బయటపడ్డాయి. 2023 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు జరిగిన పనులపై 22 గ్రామ పంచాయతీల్లో డీఆర్‌పీలు విచారణ చేపట్టారు. డుమా ఏపీడీలు శారదాదేవి, జనార్దనరావు, స్టేట్‌ రిసోర్సుపర్సన్‌ మన్మథరావు ఆధ్వర్యంలో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. గొల్లలపేటలో గతంలో మృతి చెందిన వ్యక్తి పేరు మీద బిల్లులు ఇచ్చారని వెల్లడైంది. ఫారంపాండ్‌ నిర్మించకపోయినా లబ్ధిదారుకు నిధులు చెల్లించారని వెల్లడించారు. కోటశిర్లాం, రామభద్రపురం గ్రామాల్లో మస్తర్లు, హాజరులో సంతకాలు లేనప్పటికీ వేతనాలు చెల్లించినట్టు రుజువు చేశారు. కోటశిర్లాం గ్రామంలో డూప్లెక్స్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుకు కూడా ఉపాధి నిధులు చెల్లించినట్టు తేటతెల్లమైంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు వారానికి మూడు రోజులే ఉపాధి పనులు చేయాల్సి ఉండగా ఆరు రోజులు చేసినట్టు బిల్లులు తీసుకున్నారని తెలిపారు. హార్టికల్చర్‌ లేకపోయినా నిధులు చెల్లించడం గమనార్హం. పాత రేగలో విచారణకు వచ్చిన సిబ్బందికి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రికార్డులు ఇవ్వకపోవడం, మస్తర్లు లేకుండా 45 మందికి పనిచేసి రెండు నెలలైనా బిల్లులు ఇవ్వలేదని విచారణలో తేలింది. మిర్తివలసలో పైపు కల్వర్టు పనులు చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించలేదని సర్పంచ్‌ మజ్జి రాంబాబు అధికారులను నిలదీశారు. రొంపల్లిలో ఉపాధి పనులకు నిధులు చెల్లించడం లేదని ఎంపీటీసీ భవిరెడ్డి శంకరరావు అధికారుల తీరును తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చుక్క ఈశ్వరమ్మ, ఏపీవో గొలగాని త్రినాథరావు, ఈసీ శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:58 PM