Share News

విద్య, వైద్య సేవల మెరుగుకు ప్రత్యేక కార్యాచరణ

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:34 PM

సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజనులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందజేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

 విద్య, వైద్య సేవల మెరుగుకు  ప్రత్యేక కార్యాచరణ
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో

ఏజెన్సీలో రోడ్లుకు అధిక ప్రాధాన్యం

ఐటీడీఏ పీవో రాహుల్‌కుమార్‌రెడ్డి

సీతంపేట,జూలై 26: సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజనులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందజేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఐటీడీఏ పీవోగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ... ‘గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం రహదారులు మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే తొలి ప్రాధాన్యంగా వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం. ఇప్పటికే సీతంపేట మండలంలో మలేరియా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. వాటి నివారణకు చర్యలు తీసుకుంటూ.. గ్రామస్థాయిలో గిరిజనులకు అవగాహన కార్య క్రమాలు నిర్వహింస్తాం. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ కార్యాల యాల్లో కూడా నిర్వహిస్తాం. అవసరమైతే దోమతెరలు పంపిణీ చేస్తాం. గిరిజన ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌పై దృష్టి సారిస్తాం. గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తాం. వందన్‌ వికాస్‌ కేంద్రాలు సక్రమంగా నడిచేలా చూస్తాం. ఐటీడీఏ పరిధిలో ఉన్న 1200 గిరిజన గ్రామాల భౌగోళిక పరిస్థితులు తెలుసుకుంటాం. ఆయా ప్రాంతవాసుల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటాం. గిరిజనుల వినతులు స్వీకరించడానికి గ్రామస్థాయిలో ఏర్పాట్లు చేస్తాం. ప్రతి వినతికి జవాబుదారీతనం ఉండేలా చూస్తాం. అన్ని శాఖల్లో రెగ్యులర్‌ ఉద్యోగులను నియమిస్తాం. జలజీవన్‌మిషన్‌ పథకం కింద ప్రతి గిరిజన గ్రామాలకు తాగునీరు సౌకర్యం కల్పిస్తాం.’ అని పీవో తెలిపారు. అనంతరం వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఐటీడీఏ కార్యాలయ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు.

- సీతంపేటలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేంకటేశ్వర ఆలయాన్ని పీవో సందర్శించారు. అక్కడి నుంచి పార్వతీపురం చేరుకుని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఐటీడీఏ పరిధిలో గిరిజనాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ ఆయనకు సూచించారు.

మాతా శిశు మరణాలు సంభవించకూడదు..

గిరిజన ప్రాంతాల్లో మాతా శిశు మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏ ఎస్‌.ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో 29 పీహెచ్‌సీల వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. మలేరియా, డెంగ్యూ జ్వరాల వల్ల మరణాలు సంభవిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతి గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో విజయపార్వతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:34 PM