Share News

సైనికుల త్యాగాలు మరువలేం

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:35 PM

దేశ రక్షణ కోసం ప్రాణాలు ఆర్పించిన వీర సైనికుల త్యాగాలు మరువలేమని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. బీజేపీ యువమోర్చా, మాజీ సైనికుల ఆధ్వర్యంలోశుక్రవారం కలెక్టర్‌ ప్రాంగణంలో కార్గిల్‌ విజయ దివాస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సైనికుల త్యాగాలు మరువలేం
వీర జవానుల చిత్రపటాలకు నివాళి ఆర్పిస్తున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తదితరులు

పార్వతీపురం టౌన్‌, జూలై 26 : దేశ రక్షణ కోసం ప్రాణాలు ఆర్పించిన వీర సైనికుల త్యాగాలు మరువలేమని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. బీజేపీ యువమోర్చా, మాజీ సైనికుల ఆధ్వర్యంలోశుక్రవారం కలెక్టర్‌ ప్రాంగణంలో కార్గిల్‌ విజయ దివాస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హాజరై.. కార్గిల్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల చిత్రపటాల వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్గిల్‌ యుద్ధంలో సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడి.. విజయం సాధించారని తెలిపారు. భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా విజయ్‌ దివాస్‌ జరుపుకుంటున్నామన్నారు. సైనికుల త్యాగాలను మననం చేసుకుని.. దేశరక్షణ, అభివృద్ధికి యువత పాటు పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, మాజీ సైనికుల సంఘ నాయకులు కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

- జిల్లా కేంద్రంలోని బెలగాం చర్చివీధిలోని గ్రంథాలయంలో విజ్ఞాన వికాస కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థుల కోసం విజ్ఞాన వికాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తామని, ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలకు సంబంధించి దరఖాస్తులు మెటీరియల్‌ డౌన్‌లోడ్‌ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కేంద్రాలు తెరిచి ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, చైర్‌పర్సన్‌ గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మాజీ సైనికుల సంక్షేమానికి కృషి

పార్వతీపురం, జూలై 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తానని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా కార్గిల్‌ యుద్ధంలో పోరాడిన సైనికులతో కలెక్టర్‌ మాట్లాడి.. నాటి విషయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున పథకాల అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం గౌరవ అధ్యక్షుడు టి.చంద్రశేఖరరావు, అధ్యక్షుడు కైలాసరావు, సభ్యులు జైశ్రీరామ్‌, భాస్కరరావు, రామకృష్ణ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

బొకేలు వద్దు..

తనను కలవడానికి వచ్చేవారు బొకేలు తీసుకురావద్దని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. ఉట్టి చేతులతో రావానికి మోహమాట పడితే.. పోటీ పరీక్షలు, గ్రంథాలయాలకు ఉపయోగపడే పుస్తకాలు తెస్తే మంచిదన్నారు. వాటిని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే విజ్ఞాన కేంద్రాలకు అందిస్తామన్నారు. పుస్తకం దీర్ఘకాల జ్ఞాపకంగా నిలుస్తుందన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:35 PM